Pawan kalyan : గబ్బర్ ‘గురి’ తప్పాడా..?
పవన్ కల్యాణ్ పొలిటికల్ ట్రాక్ రికార్డులో మరో పరాజయం నమోదైందా? లేక తాను అనుకున్న ఫలితం సాధించగలిగాడా? అన్న ప్రశ్న తాజాగా సినిమా, రాజకీయ వర్గాల నుంచి [more]
;
పవన్ కల్యాణ్ పొలిటికల్ ట్రాక్ రికార్డులో మరో పరాజయం నమోదైందా? లేక తాను అనుకున్న ఫలితం సాధించగలిగాడా? అన్న ప్రశ్న తాజాగా సినిమా, రాజకీయ వర్గాల నుంచి [more]
పవన్ కల్యాణ్ పొలిటికల్ ట్రాక్ రికార్డులో మరో పరాజయం నమోదైందా? లేక తాను అనుకున్న ఫలితం సాధించగలిగాడా? అన్న ప్రశ్న తాజాగా సినిమా, రాజకీయ వర్గాల నుంచి ఎదురవుతోంది. రిపబ్లిక్ సినిమా ఫంక్షన్ లో చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా చల్లారలేదు. అటు రాజకీయ రంగం, ఇటు సినిమా రంగం వేడెక్కిపోయింది. పవన్ కల్యాణ్ దూకుడు కారణంగా తామెక్కడ మునిగిపోతామోనని సినిమా పెద్దలు బెంబేలెత్తిపోతున్నారు. జనసేన సమావేశాల్లో వ్యాఖ్యలు చేసి ఉంటే సరిపోయేది. సినిమా వేడుకలో చేయడంతోనే తంటాలు వచ్చి పడ్డాయని చిత్రపరిశ్రమలోని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ప్లేస్, టైమ్ తో సంబందం లేకుండా పర్యవసానాలను పట్టించుకోకుండా తాను అనుకున్నది చెప్పేసే (అవ)లక్షణం పవన్ కు ఫుల్ గా ఉంది. దాంతో తాజాగా ఏపీలో చర్చనీయమైన కోటాలో చేరిపోయాడు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై చేసిన వ్యాఖ్యలు వ్యూహాత్మకంగా, ఉద్దేశపూర్వకంగానే చేశారనేది జనసేన నాయకుల అభిప్రాయం. ఆమేరకు పార్టీకి ఫలితం కూడా లభించిందంటున్నారు.
వైసీపీ ‘పై చేయి’..
ఇటీవలి కాలంలో జనసేన దూకుడు పెంచింది. పవన్ కల్యాణ్ ప్రజాసమస్యలపై ఫోకస్ పెట్టారు. రోడ్ల అద్వాన్న స్థితిపై కొన్నిలక్షల ట్వీట్లతో సామాజిక మాధ్యమాలు హోరెత్తిపోయాయి. రెండున్నర సంవత్సరాలుగా పైసా కూడా ఖర్చు చేయకుండా రోడ్లను గాలికి వదిలేసింది వైసీపీ సర్కారు. దాంతో పవన్ కల్యాణ్ చేపట్టిన రోడ్ల ఉద్యమం ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేసింది. ఈ విషయంలో ప్రజల నుంచి వ్యక్తమవుతున్న సంఘీభావం వైసీపీకి ఇరకాటంగా మారింది. ఎమ్మెల్యేలు, మంత్రులు సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో పడ్డారు. ఈ నేపథ్యంలో దీనిని మరింత ఉద్ధృతం చేయకుండా పవన్ కల్యాణ్ సినిమా టిక్కెట్ల ప్రభుత్వ విక్రయాలపై ధ్వజమెత్తారు. . ప్రజలు నిత్యం ఎదుర్కొనే సామాజిక సమస్యల నుంచి జనసేన ట్రాక్ తప్పింది. దీంతో వైసీపీ తెలివిగా ట్రాప్ చేసింది .ప్రజల దైనందిన సమస్య అయితే ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాలి. కానీ సినిమా టిక్కెట్ల అమ్మకం వంటి చిన్న విషయం కావడంతో సర్కారు తేలికగానే సమాధానం చెప్పేసింది. పైపెచ్చు రోడ్ల దుస్థితి, పెట్రోల్ పై అదనపు పన్నులు, విద్యుత్ రేట్ల పెంపుదల, ఇంటిపన్నుల పెంపుదల వంటి ప్రధాన అంశాలు పక్కన పెట్టేసినట్లయింది. పవన్ కల్యాణ్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ చిత్రపరిశ్రమకే చెందిన పోసానిని రంగంలోకి దింపారు. దీంతో అసలు అంశాలు మరుగున పడ్డాయి. అభిమానులు పోసానిని తిట్టిపోయడానికి, దాడి చేయడానికి ప్రయత్నించడంతో మొత్తం విషయమంతా వ్యక్తిగత బురద చల్లుకుంది. పోసాని వర్సస్ పవన్ కల్యాణ్ గా రంగు మారింది. వైసీపీ సర్కారు తెలివిగా గట్టేక్కేసింది.
టీడీపీ డైలమా…
ఇటీవలి కాలంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, వారసుడు లోకేశ్ ఏపీ పర్యటనలు పెంచారు. ప్రజల్లో తిరిగేందుకు ప్రయత్నిస్తున్నారు. కోవిడ్ కాలంలో దాదాపు ఆంధ్రప్రదేశ్ కు దూరంగా ఉన్న ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు మళ్లీ పార్టీని గాడిలో పెట్టేందుకు ప్రజాసమస్యలపై ఉద్యమాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. పవన్ కల్యాణ్ సృష్టించిన దుమారంతో టీడీపీనేతల ప్రకటనలు, ఆందోళనలు ప్రజల్లో చర్చకే రావడం లేదు. మీడియా సైతం వారిని పట్టించుకోవడం మానేసింది. జనసేన, వైసీపీల మధ్యనే ప్రచారం, ఆరోపణలు కేంద్రీకృతమయ్యాయి. ఈ మొత్తం ఉదంతంలో ఏవిధంగా స్పందించాలో తెలియని అయోమయ పరిస్థితికి టీడీపీ లోనవుతోంది. ఏదేమైనా సినిమా రంగానికి సంబంధించిన ఇష్యూ అయినప్పటికీ పవన్ కల్యాణ్ మాత్రం టీడీపీని తోసిరాజంటూ ప్రచారంలో నంబర్ వన్ స్థానానికి చేరుకున్నారు. వైసీపీని దీటుగా తాను ఎదుర్కోగలననే భరోసాను జనసేన శ్రేణులకు అందించగలిగారు. అవసరమైతే సినిమా కెరియర్ ను త్యాగం చేసి రాజకీయంగా చూసుకునేందుకు సిద్దమని తేల్చి చెప్పారు. ఇది టీడీపీ శ్రేణులకు మింగుడు పడటం లేదు. జనసేన ఒంటరిగా రంగంలోకి దిగినా, ప్రధాన ప్రతిపక్షం అన్న ముద్రను లాగేసుకున్నా చంద్రబాబు నాయుడు, లోకేశ్ కు కష్టకాలమే.
దూరమంటున్న పరిశ్రమ..
మొత్తం వ్యవహారం సినిమా పరిశ్రమకు చుట్టుకుంటోంది. పవన్ కల్యాణ్ కు సినిమాల పట్ల సీరియస్ నెస్ లేదు. తెగించి రాజకీయం చేయాలనుకుంటున్నాడు. అందువల్ల అతనికి వచ్చిన నష్టం ఏమీ లేకపోవచ్చు. కానీ చిత్రరంగాన్ని మొత్తాన్ని ఇబ్బంది పెట్టే ప్రకటనలు చేయడం వల్ల ఏపీ ప్రభుత్వంతో అనవసరంగా తగవు తెచ్చి పెట్టాడని సినిమా పెద్దలు వాపోతున్నారు. తెలుగు ఇండస్ట్రీ బతికిబట్టకట్టాలంటే ఏపీ నుంచి వచ్చే ఆదాయం చాలా ముఖ్యం. ప్రత్యర్థుల పట్ల కక్షపూరితంగా వ్యవహరించడంలో వైసీపీ సర్కారు ఎంతవరకైనా తెగిస్తుంది. ఈవిషయాన్ని గతంలోనే అనేక నిర్ణయాల్లో నిరూపించుకుంది. పవన్ పుణ్యమా? అని ఇప్పటికే కొన ఊపిరితో పరిశ్రమకు మరిన్ని కష్టాలు వచ్చి పడతాయనుకుంటున్నారు. టాలీవుడ్ కు లభిస్తున్న ఆదాయంలో 35శాతం తెలంగాణ నుంచి లభిస్తుంటే 65శాతం ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తోంది. టిక్కెట్ల రేట్ల తగ్గింపు ,బెన్ ఫిట్ షోల నిషేధం ఇతర నిర్ణయాలతో ప్రభుత్వం చర్యలకు పూనుకుంటే నిండా మునిగిపోవడం ఖాయం. అందుకే పవన్ కల్యాణ్ అభిప్రాయాలతో మాకు సంబంధం లేదంటూ పదే పదే చెబుతూ ప్రభుత్వం ముందు సాగిలపడుతున్నారు సినిమా పెద్దలు. భవిష్యత్తులో పవన్ కల్యాణ్ ను హీరోగా పెట్టి సినిమాలు తీసేందుకు పెద్ద నిర్మాతలు సాహసించకపోవచ్చు.
-ఎడిటోరియల్ డెస్క్