పవన్ కి గాజువాక గుర్తు చేశారుగా…?

గాజువాక అంటేనే పవన్ కల్యాణ‌్ అని ఆ మధ్యదాకా ప్రచారం జరిగింది.అంతెందుకు 2019 ఎన్నికల్లో పవన్ అక్కడ నుంచి పోటీ చేస్తే ఏపీలోనే అత్యధిక మెజారిటీ వస్తుంది [more]

Update: 2021-04-26 06:30 GMT

గాజువాక అంటేనే పవన్ కల్యాణ‌్ అని ఆ మధ్యదాకా ప్రచారం జరిగింది.అంతెందుకు 2019 ఎన్నికల్లో పవన్ అక్కడ నుంచి పోటీ చేస్తే ఏపీలోనే అత్యధిక మెజారిటీ వస్తుంది అని జనసైనికులు శపధం చేశారు. దానికి కారణం గాజువాకలో మెగా ఫ్యాన్స్ చాలా ఎక్కువగా ఉంటారు. ఇక పవన్ కల్యాణ‌్ సామాజికవర్గం కూడా దండీగా ఉంటారు. దాంతో గెలుపు సులువు అని పవన్ భావించే అక్కడ నుంచి పోటీకి దిగారు. కానీ గాజువాకలో అనూహ్యంగా పవన్ ఓడిపోయారు. నాటి నుంచి ఆయన ఈ వూసే తలవడంలేదు.

పోతూ పోతూ….

ఇక సీనియర్ కాంగ్రెస్ నేతగా, బలమైన కాపు సామాజికవర్గానికి చెందిన నాయకుడిగా మాదాసు గంగాధరానికి ఏపీలో కొంత గుర్తింపు ఉంది. ఆయన కాంగ్రెస్ ఏలుబడిలో రెండు సార్లు శాసనమండలి సభ్యునిగా కూడా పనిచేశారు. ఆయన జనసేనలో రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ గా కూడా ఉంటున్నారు. ఇపుడు ఆయన సడెన్ గా తన పదవిని రాజీనామా చేశారు. పోతూ పోతూ పవన్ కల్యాణ‌్ వైఖరి మీద చురకలు అంటించారు. అందులో గాజువాక కూడా ఉంది. గాజువాకలో ఉన్న ఉక్కు పరిశ్రమను కూడా గుర్తుకు తెచ్చారు.

గొంతు విప్పరా…?

పవన్ కళ్యాణ్ కి విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలో కొంత బాధ్యత ఉంది. ఆయన పోటీ చేసిన గాజువాకలోనే ఉక్కు పరిశ్రమ ఉంది. కార్మికులు కూడా అక్కడే పెద్ద ఎత్తున ఉంటారు. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ‌్ కి వచ్చిన అరవై వేల ఓట్లలో వారి వాటా కూడా ఉంది. అటువంటి కార్మికులు ఇపుడు ఉక్కు కోసం పోరాడుతూంటే పవన్ గొంతు ఎందుకు విప్పరు అన్న ప్రశ్న కూడా ఉంది దాని మీద చాలా మంది పవన్ ని నిలదీశారు కూడా. అయితే వారి కంటే మాదాసు గంగాధరం లాంటి నిన్నటి సహచరులు వేసిన ప్రశ్నే ఇపుడు జనసేనానికి బాగా గుచ్చి ఉండాలి. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం అవుతూంటే పవన్ కల్యాణ‌్ పట్టించుకోకపోవడమే కాదు, బీజేపీ నుంచి కచ్చితమైన హామీని తీసుకురాలేకపోయారు అని గంగాధరం అంటున్నారు.

ఇరకాటమేగా..?

పవన్ కల్యాణ‌్ కి విశాఖలో బలం ఉంది అని అంటారు. మరి అలాంటి చోట ఒక అతి పెద్ద పరిశ్రమ ప్రైవేటీకరణ మీద భారీ ఉద్యమం జరుగుతూంటే ప్రజా సమస్యల మీద ప్రశ్నిస్తాను అంటూ వచ్చిన పవన్ కల్యాణ‌్ నోరు కట్టేసుకోవడం అంటే ఆయన రాజకీయ జీవితానికే అది పెద్ద దెబ్బ అంటున్నారు. మరో వైపు పవన్ కళ్యాణ్ పార్టీని కూడా సరిగ్గా పట్టించుకోవడంలేదు అన్న మాట కూడా గంగాధరం లేఖలో ఉంది. సినిమా లోకం వేరు, రాజకీయాలు వేరు అంటూ ఆయన గట్టిగానే చెప్పేశారు. మొత్తానికి పవన్ కి చాలా విషయాలు గుర్తుకు తెస్తూ సీనియర్ నేత జనసేనకు గుడ్ బై కొట్టేశారు. మరి గాజు గ్లాస్ పార్టీకి గాజువాక ఎంతవరకూ గుర్తు ఉంది. ఎంత వరకూ బాధ్యత పడుతుంది అన్నది ఇక మీదట చూడాల్సిందే.

Tags:    

Similar News