అభిమానులు అదే తేల్చారు…?

ఒక సినిమా ఇంత రచ్చ చేస్తుందని ఎవరూ అనుకోరు. బాగుంటే చూస్తారు. లేకుంటే మూడోరోజుకు థియేటర్లలో మూత పడిపోతుంది. గతంలోనూ పవన్ సినిమాలు చాలా వచ్చాయి. హిట్ [more]

;

Update: 2021-04-12 12:30 GMT

ఒక సినిమా ఇంత రచ్చ చేస్తుందని ఎవరూ అనుకోరు. బాగుంటే చూస్తారు. లేకుంటే మూడోరోజుకు థియేటర్లలో మూత పడిపోతుంది. గతంలోనూ పవన్ సినిమాలు చాలా వచ్చాయి. హిట్ సినిమాల కంటే ప్లాఫ్ చిత్రాలే ఎక్కువ. బ్లాక్ బస్టర్లను వేళ్లమీదనే లెక్కించవచ్చు. అయినా వకీల్ సాబ్ ఒక రేంజ్ లో గందరగోళం సృష్టించింది. ఇంకా కొనసాగుతోంది. దీనిని కల్పితగాథపై ఆధారపడి భావోద్వేగాలతో కూడిన చలనచిత్రంగానే చూడాలి. అంతే తప్ప రాజకీయాలను శాసించి , ఇప్పటికిప్పుడు సమాజంలో మార్పును తెచ్చి పెట్టే ఒక మహోన్నత స్ఫూర్తిగా అంచనా వేయలేం. పాలిటిక్స్ తలరాతలను మార్చేసే టార్చ్ బేరర్ గానూ, దిక్సూచిగానూ తలపోయలేం. అయినా ఫ్యాన్స్ లో ఉండే మంకుపట్టు, పాలి‘ట్రిక్స్’లో పబ్లిసిటీ మానియా వెరసి సినిమాకు భలే కలిసొచ్చింది. పవన్ కల్యాణ్ కు మాత్రం ఒక విషయం స్పష్టంగా తెలిసేలా చేసింది ఈ మూవీ. నిజానికి అభిమానులే తెలియచెప్పారు. సినిమా ఉంటేనే తాను స్టార్. లేకుంటే పాలిటిక్స్ల్ లో కూడా షైనింగ్ ఉండదు.

ఫ్యాన్స్..పాలిటిక్స్…

పవన్ కల్యాణ్ రాజకీయ రంగంలో సంచలనాలు ఏమీ సృష్టించలేదు. ఆ విషయానికొస్తే సినిమా రంగంలోనూ లెజెండ్ కాదు. కానీ అతను ఐకాన్. అతనిదొక ప్రత్యేక శైలి. తనదైన ముద్రతో సినీరంగంలో ఒక స్థానాన్ని సంపాదించుకున్న ఆరాధ్య నాయకుడు. కానీ సినిమారంగంపై అతనికి వ్యక్తిగతంగా పెద్ద మక్కువ లేదు. సినిమాలను వదిలేసి రాజకీయాలకే అంకితం కావాలనుకున్నారాయన. లక్షల కొద్దీ ఉన్న తన అభిమానులు జనసైనికులుగా మారిపోతారు. ప్రజల చేత తన నాయకత్వాన్ని ఒప్పిస్తారనుకున్నారు. ఫ్యాన్స్ బలం పార్టీకి బలగంగా మారుతుందనుకున్నారు. తన ఆలోచన ఫలించలేదు. పార్టీకి అంతంతమాత్రం ఆదరణే లభించింది. సినిమాలను వదిలేస్తే రెంటికీ చెడ్డ రేవడిగా మారిపోతావని శ్రేయోభిలాషులు హెచ్చరించారు. ఫలితంగా మూడేళ్ల తర్వాత మళ్లీ సినిమా చేశారు. తన స్టామినా ఎక్కడ ఉందో అక్కడ నిరూపించుకున్నారు. అభిమానులు హారతులు పట్టారు. ఆయన ఫ్యాన్స్ లో వైసీపీ, టీడీపీ కార్యకర్తలు కూడా ఉన్నారు. ఫ్యాన్స్ పొలిటికల్ కార్యకర్తలుగా మారరు. తమ హీరో నుంచి వినోదాన్ని ఆశిస్తారు. అంతవరకే ఆ బంధం. రాజకీయాల్లో రాణించాలంటే కేవలం ఫ్యాన్స్ మీదనే ఆధారపడకూడదు. ప్రజలందరినీ ఒప్పించి గెలవగలగాలి. సినిమాకు, పాలిటిక్స్ కు ఉండే తేడా అదే. ప్యాన్స్ ను అలరింపచేసినంత సులభంగా, ప్రేక్షకులను ఆనందింప చేసినంత ఈజీగా రాజకీయాలను రక్తి కట్టించలేం.

సర్కారీ పబ్లిసిటీ..

ప్రభువు మనసెరిగి ప్రవర్తించడంలో అధికారయంత్రాంగం చాలా శ్రద్ధగా పనిచేస్తుంది. వకీల్ సాబ్ సినిమా విడుదల అవుతుంటే అదే జరిగింది. ఒక టాలీవుడ్ స్టార్ సినిమాలాగే వదిలేసి ఉండాలి. కానీ రేట్ల పెంపుదల నుంచి అన్నిటిలోనూ ఆంక్షలు పెట్టాలని ప్రభుత్వ అధికారులు ప్రయత్నించారు. ఏలినవారి వద్ద మార్కులు కొట్టేయాలనేది అధికారుల తాపత్రయం. దీంతో వకీల్ సాబ్ కు బోలెడంత పబ్లిసిటీ లబించింది. వివాదాన్ని సృష్టించడం ద్వారా రాంగోపాల్ వర్మ తన సినిమాల వైపు ప్రజలను ఆకర్షిస్తూ ఉంటాడు. జనం ఎగబడతారు. తీరా చూస్తే సినిమాలో సరుకు ఉండదు. అయినా ఈలోపుగానే రావాల్సిన సొమ్ములు వచ్చేస్తాయి. పవన్ కల్యాణ్ సినిమాపై సర్కారీ అధికారులు అనవసర హంగామా చేశారు. సినిమాలో ఏదో సందేశం ఉందని ప్రజలు భావించేలా చేశారు. ఫ్యాన్స్ స్పందనలు, పొలిటికల్ నాయకుల స్టేట్ మెంట్లు, చంద్రబాబు వంటి వారు సైతం తాము వెనకబడి పోకూడదని మద్దతు ప్రకటనలు వెరసి సినిమాకు హైప్ ఇచ్చాయి. సినిమాకు, రాజకీయాలకు మధ్య తేడాను ప్రజలు గుర్తిస్తున్నారు. అభిమానులు సైతం వేరు చేసి చూస్తున్నారు. కానీ అధికారులు మారడం లేదు. ఒక పార్టీ నాయకుడి సినిమా అయినంత మాత్రాన ఆంక్షలు పెట్టాల్సిన అవసరం లేదు. ధరలు పెంచినా నచ్చితే సినిమా చూస్తారు. లేకపోతే పట్టించుకోరు. ఇదే పవన్ ఎంతో ఓపికగా తీసిన అజ్ణాత వాసి వంటి సినిమాలు ఏమయ్యాయో అందరికీ తెలిసిందే. అందువల్ల ప్రజల విజ్ణతకు, విచక్షణకు వదిలేయాల్సిన చోట్ల అధికారులు అనవసర జోక్యం ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తుంది.

న్యాయం తీరే వేరు..

న్యాయస్థానాలు అన్నిటా తామున్నాయంటున్నాయి. మంచిదే. ఒక సామాన్యుని సమస్యలు, ప్రజలకు సంబంధించిన అత్యవసర విషయాల్లో కోర్టులు , న్యాయాధిపతులు ఎక్కువ సమయాన్ని వెచ్చించడం మంచిది. ప్రజాజీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేయని అంశాలపై పట్టించుకోకుండా ఉండటమే ఉత్తమం. ఒక సినిమా వల్ల కొంపలేమీ అంటుకుపోవు. దానిపై న్యాయస్థానాలు తమ విలువైన సమయాన్ని వృథా చేయడం అర్థం కాని విషయం. అందులోనూ భిన్నమైన తీర్పులు. ఒక న్యాయమూర్తి ధరలు పెంచుకోమని తీర్పు చెబుతారు. మళ్లీ అదే న్యాయస్థానంలోని కొందరు న్యాయమూర్తులు ధరలపై కళ్లెం వేస్తారు. దీనిని పరిశీలనగా చూసేవారికి హాస్యాస్పదంగా కనిపిస్తుంది. సామాజిక అశాంతి, సంఘ భద్రత, మతపరమైన విద్వేషాలు పెల్లుబికే ప్రమాదం ఉంటే తప్ప సినిమాల విషయంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పేయాలి. లేకపోతే ప్రతి విషయాన్ని చలనచిత్ర రంగం వారు, ప్రభుత్వం వారు కోర్టుల ముందు పెట్టి సమయాన్ని తినేస్తుంటారు. ఇవేమీ ప్రాథమిక హక్కుల వంటి రాజ్యాంగ విధులతో ముడిపడిన అంశాలు కానేకావు. తమకు ఖాళీ లేదని కోర్టులు చెప్పేయగలగాలి. లేకపోతే వీటిపై తీర్పుల్లో జాప్యం చేస్తే వాటంతటవే సద్దుమణిగిపోతాయి. న్యాయస్థానాలకు చెడ్డపేరు రాకుండా ఉంటుంది. తమ విలువైన సమయాన్ని ప్రజాప్రయోజనాలకు సంబంధించిన కేసులకు కేటాయించుకోవచ్చు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News