ఈ మంత్రికి సింప‌తీ క‌ష్టాలు.. కొని తెచ్చుకున్నారా?

రాజ‌కీయాల్లో సింప‌తీకి ఉండే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఈ సింప‌తీని సొంతం చేసుకునేందుకు నాయ‌కులు పోటీ ప‌డుతుంటారు. గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ విజ‌యం వెనుక `ఒక్క [more]

Update: 2020-08-02 00:30 GMT

రాజ‌కీయాల్లో సింప‌తీకి ఉండే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఈ సింప‌తీని సొంతం చేసుకునేందుకు నాయ‌కులు పోటీ ప‌డుతుంటారు. గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ విజ‌యం వెనుక 'ఒక్క ఛాన్స్‌' అనే సింప‌తీనే ఎక్కువ‌గా ఉంది. ఇక‌, మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ నేత‌లు సింప‌తీతో గెలిచినవి చాలానే ఉన్నాయి. అయితే, ఒక్కొక్క సారి ఈ సింప‌తీనే కొంప‌లు ముంచుతుంది. సింప‌తీ ఎక్కువైనా.. ప్రమాద‌మే. ఇప్పుడు మ‌చిలీప‌ట్నం ఎమ్మెల్యే, మంత్రి పేర్ని వెంక‌ట్రామ‌య్య ఉర‌ఫ్ పేర్ని నాని కూడా ఇదే ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నార‌నే వ్యాఖ్యలు వ‌స్తున్నాయి. ఇక్కడ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన మాజీ మంత్రి కొల్లు ర‌వీంద్ర ఓ కేసులో జైలు పాల‌య్యారు.

జైలు పాలు కావడంతో…

దీంతో త‌న హ‌వా పెరుగుతుంద‌ని, త‌న దూకుడుకు అడ్డు లేకుండా పోయింద‌ని పేర్ని నాని భావించారు. కానీ, చిత్రంగా ఇప్పుడు ఆయ‌న‌కు ఉన్న హ‌వా త‌గ్గుముఖం ప‌డుతున్నట్టు స్థానిక ప‌రిణామాలు చెపుతున్నాయి. జైలుకు వెళ్లిన కొల్లుపై స్థానికంగా సింప‌తీ పెరుగుతున్నట్టు టీడీపీలోనే చ‌ర్చ జ‌రుగుతోంది. టీడీపీ నేత‌లు స్థానికంగా కొల్లుకు మ‌ద్దతుగా నిర్వహిస్తున్న కార్యక్రమాల‌కు జ‌నాలు ఎక్కువ మందే వ‌స్తున్నారు. కొల్లు జైలు పాలు కావడంతో బీసీ వ‌ర్గాల‌తో పాటు సాధార‌ణ జ‌నాల్లోనూ కొల్లుపై సానుభూతి పెరుగుతోంది. నియోజ‌క‌వ‌ర్గంలో ఎక్కువుగా మ‌త్స్యకార వ‌ర్గాల్లో కొల్లుకు విప‌రీత‌మైన సానుభూతి ల‌భిస్తోంది.

నానికి అదే టెన్షన్…..

కొల్లు త‌ప్పు చేశాడా ? లేదా ? అన్నది త‌ర్వాత నిర్దార‌ణ అవుతుంది. అయితే ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో కొల్లుకు అనుకూలంగా ప్రజ‌లు రోడ్ల మీద‌కు రావ‌డంతో పాటు ఎక్కువ చ‌ర్చలు న‌డుస్తుండ‌డంతో మంత్రి పేర్నినానికి టెన్షన్ ప‌ట్టుకుంద‌న్న ప్రచారం మచిలీప‌ట్నం రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రుగుతోంది. కొల్లు ఉదంతంపై త‌ను కానీ, త‌న పార్టీ నేత‌లు కానీ ప్రజ‌ల‌కు వివ‌రించ‌డంలో ఎక్కడో ఫెయిల్ అయ్యామ‌నే చ‌ర్చ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ సంఘ‌ట‌న త‌ర్వాత కొన్ని బీసీ వ‌ర్గాల్లో పేర్ని నాని ప‌ట్ల కాస్త వ్యతిరేక‌త భావం ఏర్పడిన‌ట్టు స‌మాచారం.

జనసేన క్యాడర్ కూడా……

ఇక పేర్ని నాని కాపు వ‌ర్గానికి చెందిన నేత కాగా… జ‌న‌సేన కూడా ఇక్కడ బ‌లంగా ఉండ‌డంతో కాపుల్లో కూడా చీలిక వ‌స్తే పేర్నికి ఇబ్బంది త‌ప్పేలా లేదు. ఇక‌, టీడీపీ అనుకూల మీడియా కూడా రోజుకో క‌థ‌నం ప్రచారం చేస్తోంది. జ‌రిగిన కేసులో కొల్లు పాత్ర లేద‌ని, కేవ‌లం రాజకీయ క‌క్షల‌తోనే ఆయ‌న‌ను అరెస్టు చేశార‌ని వార్తలు ప్రచురిస్తోంది. దీనిని కూడా ఖండించ‌డంలో పేర్ని నాని విఫ‌ల‌మ‌య్యారు. ప‌లితంగా ప్రజ‌ల్లో కొల్లు ర‌వీంద్ర ప‌ట్ల పెరుగుతున్న సింప‌తీ చివ‌ర‌కు పేర్ని నాని ఇబ్బందుల‌కు కార‌ణ‌మ‌య్యే ప‌రిస్థితి ఏర్పడుతోన్న వాతావ‌ర‌ణం అక్కడ క‌నిపిస్తోంది.

Tags:    

Similar News