పితాని ఇక మారేటట్లు లేరే?

” వైఎస్‌. రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారు ఓ ప‌ని అన్నారంటే ఖ‌చ్చితంగా చేసి చూపిస్తారు.. ఆయ‌న మాట ఇచ్చారంటే త‌ప్పరు.. అదే మీ చంద్రబాబు ఒకే ఇంటికి [more]

Update: 2021-01-20 11:00 GMT

” వైఎస్‌. రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారు ఓ ప‌ని అన్నారంటే ఖ‌చ్చితంగా చేసి చూపిస్తారు.. ఆయ‌న మాట ఇచ్చారంటే త‌ప్పరు.. అదే మీ చంద్రబాబు ఒకే ఇంటికి నాలుగుసార్లు అయినా శంకుస్థాప‌న‌లు చేసి ర‌మ్మంటారు.. ఆయ‌న మాట ఇస్తే ఆ త‌ర్వాత ఆయ‌న‌కు గుర్తులేన‌ట్టు న‌టిస్తారు.. మీ టీడీపీ పార్టీ.. మీ చంద్రబాబు ” ఈ మాట‌లు ఎవ‌రో కాదు గ‌త టీడీపీ ప్రభుత్వంలో.. చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా ఉన్నప్పుడు నాటి మంత్రి పితాని స‌త్యనారాయ‌ణ చెప్పిన మాట‌లు. దీనిని బ‌ట్టి పితానికి టీడీపీ అన్నా, చంద్రబాబు అన్నా ఎంత ప్రేమ ఉందో ఇట్టే తెలుస్తుంది. పితాని న‌ర‌న‌రానా చంద్రబాబు వ్యతిరేకి… వైఎస్ అన్నా.. ఆ ఫ్యామిలీ అన్నా ప్రాణంగా ఉంటారు. అయితే త‌న రాజ‌కీయ అవ‌స‌రాల కోసం ఆయ‌న ఏదైనా చేస్తారన‌డంలో డౌటే లేదు.

కిరణ్ కు కుడిభుజంగా….

వైఎస్ మ‌ర‌ణాంత‌రం జ‌గ‌న్ పార్టీ పెట్టిన‌ప్పుడు చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేసి జ‌గ‌న్ ద‌గ్గర‌కు వెళ్లారు. అదే పితాని స‌త్యనారాయ‌ణ త‌న మంత్రి ప‌ద‌వి సేఫ్‌గా ఉండేందుకు జ‌గ‌న్‌పై తీవ్రస్థాయిలో విరుచుకు ప‌డేవారు. నాడు ప్రతిప‌క్షంలో ఉన్న చంద్రబాబును ఎలా తిట్టేవారే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అదే పితాని స‌త్యనారాయ‌ణ నాటి సీఎం కిర‌ణ్‌కుమార్ రెడ్డికి కుడిభుజంగా ఉంటూ ఆయ‌న జై స‌మైక్యాంధ్ర పార్టీలో కీల‌క నేత అయ్యారు. చివ‌ర‌కు ఆ పార్టీ అధికారంలోకి రాద‌ని తెలిసి… ఎన్నిక‌ల వేళ చివ‌ర్లో లాబీయింగ్ చేసుకుని టీడీపీ సీటు ద‌క్కించుకుని ఎమ్మెల్యే అయ్యారు. చివ‌ర‌కు త‌న క్యాస్ట్ పేరు వాడుకుని మంత్రి కూడా కాగ‌లిగారు.

అవ‌స‌రానికి ఏదైనా వాడుకోవ‌డ‌మే

ప‌శ్చిమ‌గోదావ‌రి శెట్టిబ‌లిజ‌ల్లో గ‌త రెండున్నర ద‌శాబ్దాల్లో రాజ‌కీయంగా ఏ నేత కూడా పితాని స‌త్యనారాయ‌ణలా ఎద‌గ‌లేదు. ఆయ‌న ఏ పార్టీలో ఉన్నా త‌న క్యాస్ట్‌కు తానే ప్రతినిధిని అన్న హైప్ బాగా తెచ్చుకుంటారు. పోనీ అలా ఉన్న నేత త‌న సామాజిక వ‌ర్గానికి ఏ మాత్రం ఉప‌యోగ‌ప‌డ్డార‌న్నది కూడా మిలియ‌న్ డాల‌ర్ల ప్రశ్నే.. ! పార్టీలు మారి… త‌న ప‌ద‌విని కాపాడుకోవ‌డానికి.. మంత్రి ప‌ద‌వి ద‌క్కించుకోవ‌డానికి మాత్రమే కులంతో పాటు దేనినైనా వాడుకోవ‌డంలో పితాని స‌త్యనారాయ‌ణని మించిన నేత లేరు. అంతెందుకు ఇన్నేళ్ల‌లో పితాని స్థాయిలో కాక‌పోయినా క‌నీసం ఓ మోస్తరు నేత కూడా శెట్టిబ‌లిజ వ‌ర్గం నుంచి ఏ పార్టీలోనూ ఎద‌గ‌లేదు.

టీడీపీలో ఉండి చేస్తోందేమిటి.. ?

గ‌త ఎన్నికల‌కు ముందే పితాని స‌త్యనారాయ‌ణ వైసీపీలోకి వెళ్లాలా ? వ‌ద్దా ? అని ఊగిస‌లాడారు. ఆ పార్టీ నుంచి న‌ర‌సాపురం ఎంపీ సీటు ఇస్తామ‌ని చెప్పడంతో మంత్రి ప‌ద‌వి రాద‌ని ఆయ‌న సైలెంట్ అయ్యారు. జ‌గ‌న్ అప్పటికే ప్రస్తుత మంత్రి చెరుకువాడ రంగ‌నాథ‌రాజుకు ఆచంట సీటు ఫిక్స్ చేసి ఉండడంతో పితాని మ‌ళ్లీ టీడీపీ గెలిస్తే మంత్రి ప‌ద‌వి నాదే క‌దా ? అని ఇక్కడే పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నిక‌ల్లో ఓడిపోయినా కూడా పితానికి చంద్రబాబు ఎంతో ప్రయార్టీ ఇస్తున్నారు. ఇటీవ‌ల ప‌ద‌వుల పంపిణీలో కూడా పితానిని అంద‌లం ఎక్కించారు. అయినా పితాని స‌త్యనారాయ‌ణ మాత్రం పార్టీకి క‌ష్టం వ‌చ్చిన‌ప్పుడు ఏనాడు ముందుకు రాని ప‌రిస్థితి.

పార్టీ కోసం మాత్రం…..

పితాని స‌త్యనారాయ‌ణకి పార్టీ ప‌ద‌వులు కావాలి… పార్టీలో ఎదుగుద‌ల కావాలి… అంతేకాని పార్టీ కోసం ఆయ‌నేం చేయ‌రు… పార్టీకి నేను ఏం ఇచ్చాన‌న్నది ఆయ‌న‌కు అన‌వ‌స‌రం.. పార్టీ నాకు ఏం ఇచ్చింది ? ఏం చేసింది ? అన్నదే ఆయ‌న సూత్రంగా ఉంటుంద‌న్నది ఆయ‌న్ను రెండున్నర ద‌శాబ్దాలుగా ద‌గ్గ‌ర‌గా చూస్తోన్న మీడియా, రాజ‌కీయ వ‌ర్గాలు చెప్పేమాట‌. టీడీపీ ఓడిపోయాక చాలా మంది సైలెంట్ అయినా.. ఇటీవ‌ల కొంద‌రు బ‌య‌ట‌కు వ‌చ్చి నోరు పెగ‌ల‌దీస్తూ వైసీపీ ప్రభుత్వంపై విమ‌ర్శలు చేస్తున్నారు. పితాని స‌త్యనారాయ‌ణ మాత్రం నోరు మెదిపితే ఎక్క‌డ త‌న నోట్లో ముత్యాలు రాల‌తాయో ? అన్నట్టుగా వ్యవ‌హ‌రిస్తున్నారు.

ప్రభుత్వానికి టార్గెట్ అవుతారని….

ఇంకా గ‌ట్టిగా చెప్పాలంటే తాను గ‌ట్టిగా మాట్లాడితే తాను వైసీపీ ప్రభుత్వానికి ఎక్కడ టార్గెట్ అవుతానో ? త‌న వార‌సుల‌పై ఈ స‌ర్కార్ ఏ కేసులు బ‌నాయిస్తుందో ? అన్నదే పితాని స‌త్యనారాయ‌ణ బాధ అని జిల్లాలో వినిపించే మాట‌. ప్రస్తుతం టీడీపీ నాయ‌కులు, మాజీ మంత్రులు, కీల‌క నేత‌లు ఎక్కడిక‌క్కడ రోడ్ల మీద‌కు వ‌చ్చి ఏదో రూపాల్లో నిర‌స‌న‌లు వ్యక్తం చేస్తున్నా.. పితాని స‌త్యనారాయ‌ణ మాత్రం ఇప్పుడు మ‌న‌కెందుకు ఈ బాధ‌.. పార్టీకి మంచి ఊపు వ‌చ్చి.. ఎన్నిక‌లు ద‌గ్గర ప‌డ్డాక చూద్దాంలేం ? అన్నట్టుగా వ్యవ‌హ‌రిస్తున్నార‌ని జిల్లా పార్టీ నేత‌లే చెవులు కొరుక్కుంటున్నాయి.

ఇంకొకరు ఎదగకూడదని…..

ఇక చివ‌ర‌గా త‌న కులంలో ఎప్పట‌కీ తానే కింగ్‌గా ఉండాలి.. మ‌రొక నేత రాకూడ‌దు.. ఎద‌గ‌కూడ‌దు… త‌న వార‌సుడి రాజ‌కీయ భ‌విష్యత్తు ఏంట‌న్న టెన్షన్‌లో కూడా ఆయ‌న ఎప్పుడూ ఉంటార‌న్న టాక్ కూడా ఉంది. చంద్రబాబు లాంటి నేత‌లు ఉన్నన్ని రోజులు పితాని స‌త్యనారాయ‌ణ లాంటి వాళ్ల ఆట‌లు ఎన్ని రోజులు అయినా ఇలాగే సాగుతుంటాయ్‌.. అదే జ‌గ‌న్ ద‌గ్గర ఉండి ఉంటే పితాని స‌త్యనారాయ‌ణ ఈ పాటికి ఏ చివ‌ర వ‌ర‌సులో ఉండేవాడో ?

Tags:    

Similar News