ఊగిసలాట ఎందుకో….?

పితాని స‌త్యనారాయ‌ణ‌. సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న నాయ‌కుడు. 15 సంవ‌త్సరాలు ఎమ్మెల్యేగా, 8 సంవ‌త్సరాలు మంత్రిగా చేశారు. మూడు ద‌శాబ్దాల‌కు పైగా రాజ‌కీయ అనుభ‌వం ఆయ‌న [more]

;

Update: 2019-09-01 05:00 GMT

పితాని స‌త్యనారాయ‌ణ‌. సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న నాయ‌కుడు. 15 సంవ‌త్సరాలు ఎమ్మెల్యేగా, 8 సంవ‌త్సరాలు మంత్రిగా చేశారు. మూడు ద‌శాబ్దాల‌కు పైగా రాజ‌కీయ అనుభ‌వం ఆయ‌న సొంతం. అటు కాంగ్రెస్‌, ఇటు టీడీపీల్లో కీల‌క నాయ‌కుడిగా ఎదిగారు. అయితే, ఇప్పుడు మాత్రం ఆయ‌న రాజ‌కీయ ఊగిస‌లాట‌లో చిక్కుకుని ఫ్యూచ‌ర్‌పై ఆందోళ‌న వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి వైఎస్ జీవించి ఉన్న కాలంలో ఆయ‌న వ‌ర్గంగా గుర్తింపు పొందిన పితాని.. ఈ క్రమంలోనే మంత్రిగా కూడా చ‌క్రం తిప్పారు. శెట్టిబ‌లిజ సామాజిక వ‌ర్గానికి చెందిన పితాని.. వైఎస్‌కు అత్యంత విశ్వాస పాత్రుడిగా కూడా గుర్తింపు సాధించారు. అయితే, రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో ఆయ‌న కాంగ్రెస్‌తో విభేదించారు.

వైసీపీ ఆహ్వానించినా….

ఈ క్రమంలోనే పితాని 2014లో టీడీపీలోకి వ‌చ్చారు. అప్పటి ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించారు. టీడీపీ నాయకుడిగా ఉంటూనే సామాజిక వ‌ర్గంలో గుర్తింపు సాధించారు. ఇక‌, 2017లో ఆయ‌న‌కు చద్ర‌బాబు కేబినెట్‌లో చోటిచ్చారు. ఈ క్రమంలోనే మంత్రి కూడా అయిన పితాని.. ప‌లు కీల‌క నిర్ణయాలు తీసుకున్నా రు. అయితే, 2019 నాటికి ఆయన గెలుపుపై సందేహాలు వ‌చ్చాయి. ఈ క్రమంలోనే ఆయ‌న పార్టీ మారేందుకు ప్రయ‌త్నించారు. వైసీపీ కూడా ఆయ‌న‌ను ఆహ్వానించింది. పార్టీలోకి వ‌స్తే.. న‌ర‌సాపురం ఎంపీ సీటు ఖాయ‌మ‌ని హామీ ఇచ్చింది. అయితే, ఆ స‌మ‌యంలో పితాని వెనుక‌డుగు వేశారు. టీడీపీ త‌ర‌ఫునే ఉండిపోయారు. అయితే, ఆయ‌న తాజా ఎన్నిక‌ల్లో ఓట‌మి పాల‌య్యారు.

వారసులు అందిరాక…..

దీంతో ఇప్పుడు ఆయ‌న రాజ‌కీయంగా ఏం చేయాలో తెలియ‌క మ‌ద‌న‌ప‌డుతున్నార‌ని స‌మాచారం. త‌న‌కు ఉన్న ముగ్గురు కుమారుల్లో ఇద్దరిని రాజ‌కీయంగా అభివృద్ధి చేయాల‌ని, త‌న వార‌సులుగా రాజ‌కీయాల్లోకి తీసుకురావాల‌ని ఆయ‌న భావించారు. కానీ, ఇది ఇప్పట్లో సాధ్యమ‌య్యేలా క‌నిపించ‌డం లేదు. ఇప్పటి వ‌ర‌కు త‌న‌కు అన్ని విధాలా అండ‌గా ఉన్న శెట్టి బ‌లిజ సామాజిక వ‌ర్గం కూడా ఇప్పుడు టీడీపీని స‌మ‌ర్ధించ‌డం లేదు. మొన్నటి ఎన్నిక‌ల్లో సొంత సామాజిక‌వ‌ర్గం వాళ్లే ఆయ‌న‌కు ఓట్లేయ‌ని ప‌రిస్థితి.

గుడ్ బై చెప్పేస్తారా…?

మ‌రోప‌క్క, ఇన్ని సంవత్సరాలుగా ఆయ‌న అధికారంలో ఉన్న పార్టీలోనే ఉండ‌డం, ఇప్పుడు ప్రతిప‌క్షంలో ఉండాలంటే.. త‌న వ‌ర్గాన్ని మేనేజ్ చేయ‌లేని ప‌రిస్థితి ఏర్పడింది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న అధికార వైసీపీలోకి జంప్ చేయాల‌ని చూస్తున్నారు. అయితే, ఈ జంపింగ్‌ల‌కు జ‌గ‌న్ ఏమేర‌కు ? స‌హ‌క‌రిస్తారో చూడాలి. అదే టైంలో పితానిపై గెలిచి ప్రస్తుతం మంత్రిగా ఉన్న చెరుకువాడ శ్రీరంగ‌నాథ‌రాజు పితాని అవ‌స‌రం పార్టీకి లేద‌ని చెప్పేస్తున్నార‌ట‌. వైసీపీలో ఉన్న పితాని వ్యతిరేకవ‌ర్గం కూడా ఆయ‌న్ను పార్టీలోకి రానిచ్చే ప‌రిస్థితి లేద‌ని చెపుతోంది. దీంతో పితాని కొన్నాళ్లు మౌనంగా ఉంటారా ? లేదా ? రాజ‌కీయాల‌కు గుడ్ బై చెప్పేస్తారా ? అన్నది చూడాలి.

Tags:    

Similar News