పితాని జంప్ కు రెడీ గానే ఉన్నారా? ఆయనేమన్నారు ?

వైఎస్ జగన్ ను టార్గెట్ చేసిన హేమా హేమీలకు ఇప్పుడు అధికారపార్టీ చుక్కలు చూపిస్తుంది. ఇది కక్ష సాధింపు కావొచ్చు లేక కలిసొచ్చే కాలానికి నడిచి వచ్చే [more]

;

Update: 2020-07-01 12:30 GMT

వైఎస్ జగన్ ను టార్గెట్ చేసిన హేమా హేమీలకు ఇప్పుడు అధికారపార్టీ చుక్కలు చూపిస్తుంది. ఇది కక్ష సాధింపు కావొచ్చు లేక కలిసొచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు దొరికినట్లు పచ్చ పార్టీ నేతలు తప్పులు చేసి కేసుల పాలు కావొచ్చు. ఏదన్నా జగన్ కోరుకున్నది ఏపీ లో జరిగిపోతుంది. అచ్చన్నాయుడు, జెసి ప్రభాకర రెడ్డి, అయ్యన్నపాత్రుడు ఇలా తనపై ఉన్నదానికి లేనిదానికి నోరుపారేసుకునే వారి లెక్కలు తేల్చేస్తుంది జగన్ సర్కార్. వీరి తరువాత నెక్స్ట్ ఎవరు అనే చర్చ అటు వైసిపి లోను టిడిపి లో మొదలైంది అని చూస్తే పరిస్థితి తేటతెల్లం అయిపోతుంది.

పశ్చిమ పై జగన్ కన్ను …

గోదావరి జిల్లాలు గత ఎన్నికల్లో వైసిపి అఖండ విజయంలో పూర్తి అండగా నిలిచాయి. పశ్చిమ గోదావరి జిల్లా మరింత గా దీవించేసింది. ఈ నేపథ్యంలో ఆ జిల్లాల్లో బలమైన నేతగా ఉన్న మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ను టిడిపి నుంచి రప్పించేందుకు వైసిపి లో కొందరు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తుంది. ఈఎస్ఐ స్కామ్ వంటి వాటిలో విచారణలు అరెస్ట్ లు వంటివి లేకుండా ఉండాలంటే హాయిగా అధికారపార్టీ పంచన చేరితే మంచిదని ఆయనపై వత్తిడులు వస్తున్నాయంటున్నారు.

పితాని కి 50 వేలు ఓట్లు తగ్గలేదు …

పశ్చిమ గోదావరి జిల్లాలో శెట్టిబలిజ సామాజికవర్గం బలమైంది. 2009 లో కాంగ్రెస్ తరపున వైఎస్ రాజశేఖర రెడ్డి పితాని సత్యనారాయణ ను ఆచంట నుంచి బరిలోకి దింపారు ఆ ఎన్నికల్లో ఆయనకు 54 వేలకు పైచీలుకు ఓట్లు పడ్డాయి. గెలిచారు కూడా. ఆ తరువాత రాష్ట్ర విభజన తో మనస్థాపం చెంది కాంగ్రెస్ కి గుడ్ బై కొట్టి టిడిపి నుంచి అదే నియోజకవర్గం నుంచి పితాని సత్యనారాయణ పోటీ చేస్తే 63 వేల ఓట్లు సాధించి నాలుగు వేల పైచీలుకు మెజారిటీ తో బయట పడ్డారు. ఆ తరువాత తిరిగి 2019 ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేసి వైసిపి అభ్యర్థి శ్రీ రంగనాధరాజు చేతిలో ఓటమి చెందినా 53 వేల ఓట్లను సాధించి నియోజకవర్గంలో బలమైన నేతగానే ఉన్నారు. ఇప్పుడు ఆయన కానీ వైసిపి లో చేరితే ఆచంట లో టిడిపి మరో బలమైన నేతను వెతుక్కోవాలిసి ఉంది. ఇప్పటికిప్పుడు ప్రతిపక్ష పార్టీలో ఉంటూ పార్టీని భుజాన మోసేవారు లేరు కూడా.

నేను కరెక్టుగానే ఉన్నా ….

ఈ వ్యవహారంపై “తెలుగుపోస్ట్” మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ను కదిలించింది. నేను ప్రస్తుతం టిడిపి లో కరెక్ట్ గానే ఉన్నా అని చెప్పారు ఆయన. నెక్స్ట్ జగన్ టార్గెట్ మీరే అంటున్నారంటే నేను ఏ ప్రభుత్వంలో పనిచేసినా క్లిన్ చీట్ గా ఉన్నానని చెప్పుకొచ్చారు. 2014 ఎన్నికల్లో ఎపి లో వైసిపి అధికారంలోకి వస్తుందని అంతా అంచనా వేసినా సీనియర్ నాయకుడి నాయకత్వంలో పనిచేయాలని విభజన తరువాత చంద్రబాబు న్యాయం చేస్తారని తెలుగుదేశం తీర్ధం పుచ్చుకున్నానని వివరించారు పితాని సత్యనారాయణ. నాటి ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి రావడం మంత్రి కావడం జరిగాయని తెలిపారు.

టిడిపిలో ఉంటా అని గ్యారంటీ ఇవ్వని పితాని …

వైసిపి లోకి ఎప్పుడు అన్న ప్రశ్న కు తన హక్కులకు భంగం కలిగినా, గౌరవానికి భంగం కలిగినా తనను నమ్ముకున్న బిసి సామాజిక వర్గానికి ద్రోహం జరిగేలా ఉంటు మాత్రం టిడిపి లో కొనసాగనని చెప్పారు. దీని అర్ధం ఆయన అటు ఇటు ఉగుతున్నట్లే కనిపిస్తుందంటున్నారు విశ్లేషకులు. ఈ నేపథ్యంలో నర్సాపురం పార్లమెంట్ సభ్యుడు రఘురామకృష్ణం రాజు ఎపిసోడ్ లో తగిలిన దెబ్బలు బలమైన నేతలను పార్టీలో చేర్చుకోవడం ద్వారా భర్తీ చేసే యోచనలో వైసిపి ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో పితాని సత్యనారాయణపై గట్టిగా వత్తిడి పెడితే మాత్రం టిడిపి లో మరో బలమైన వికెట్ ను వైసిపి తీసినట్లే భావించాలి. అయితే పితాని సత్యనారాయణ రాకను ఆయన పై గెలిచిన మంత్రి చెరుకువాడ రంగనాధ రాజు అంగీకరిస్తారా జగన్ ఆయనకు సర్దిచెబుతారా అన్నది వేచి చూడాలి.

Tags:    

Similar News