జంపింగ్ జాబితాలో మాజీ మంత్రి.. టీడీపీకి మ‌రో షాక్ త‌ప్పదా..?

ఏపీ ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీలో రోజు రోజుకు జంపింగుల జాబితా పెరుగుతోంది. టీడీపీకి భారీ షాక్ ఇచ్చేందుకు అధికార వైసీపీ తీవ్రంగా ప్రయ‌త్నిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఇప్పటికే [more]

Update: 2020-06-01 06:30 GMT

ఏపీ ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీలో రోజు రోజుకు జంపింగుల జాబితా పెరుగుతోంది. టీడీపీకి భారీ షాక్ ఇచ్చేందుకు అధికార వైసీపీ తీవ్రంగా ప్రయ‌త్నిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఇప్పటికే చంద్రబాబు అనుకూల మీడియాలోనే కొంద‌రు నేత‌లు జంప్ చేస్తున్నార‌నే వార్తలు వ‌స్తున్నాయి. ప్రస్తుతం వీరితో వైసీపీ సీనియ‌ర్లు ట‌చ్‌లో ఉన్నార‌ని, త్వర‌లోనే పార్టీ మార్పు ఖాయ‌మ‌ని వార్తలు వ‌చ్చాయి. అయితే, వీటిని స‌ద‌రు నాయ‌కులు ఇప్పటి వ‌ర‌కు ఖండించ‌క పోవ‌డం గ‌మ‌నార్హం. ఇప్పుడు ఇలాంటి వారి జాబితాలో మ‌రో కీల‌క పేరు వ‌చ్చింది. ఆయ‌నే ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు చెందిన మాజీ మంత్రి పితాని స‌త్యనారాయ‌ణ‌.

మంత్రిగా పనిచేసి…..

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ఆచంట నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన పితాని స‌త్యనారాయ‌ణ‌ సీనియ‌ర్ నాయ‌కుడు. గ‌తంలో కాంగ్రెస్ త‌ర‌పున విజ‌యం సాధించి.. గ‌తంలోనూ మంత్రి అయ్యారు. ఇక‌, చంద్రబాబు హ‌యాంలో టీడీపీలో చేరిన వెంట‌నే 2014లో విజ‌యం సాధించారు. 2017లో జ‌రిగిన మంత్రి వ‌ర్గ విస్తర‌ణ‌లో పితాని స‌త్యనారాయ‌ణ‌కి అవ‌కాశం ద‌క్కింది. అయితే, ఇప్పుడు పితాని స‌త్యనారాయ‌ణ‌ ప‌రిస్థితి పార్టీలో స‌రిగాలేదు. దాదాపు న‌లుగురు ముఖ్యమంత్రుల ద‌గ్గర మంత్రిగా ప‌నిచేసిన పితాని ప‌దిహేనేళ్ల పాటు జిల్లా రాజ‌కీయాల‌ను ఏలారు.

సొంత సామాజిక వర్గంలో…..

ఇక ఇప్పుడు ఓడిపోవ‌డంతో పాటు పార్టీ ప్రతిప‌క్షంలో ఉండ‌డంతో ఆయ‌న మాట‌ల‌ను ఎవ‌రూ ఖాత‌రు చేయ‌డం లేదు. పైగా.. టీడీపీలో ఉంటే.. త‌న సొంత సామాజిక వ‌ర్గంలోనూ ఆయ‌న మాట చెల్లే ప‌రిస్థితి లేకుండా పోయింది. నిన్న మొన్నటి వ‌ర‌కు శెట్టి బ‌లిజ సామాజిక వ‌ర్గానికి కీల‌క నాయ‌కుడిగా ఉన్న ఆయ‌న కులాన్ని ఒక్క‌తాటిమీద‌కు తీసుకు వ‌చ్చి రాజ‌కీయం చేస్తూ వ‌చ్చారు. అయితే ఇప్పుడు వైసీపీ నుంచి శెట్టిబ‌లిజ సామాజిక వ‌ర్గానికి చెందిన‌ కౌరు శ్రీనివాసు రాజ‌కీయంగా దూకుడు ప్రద‌ర్శిస్తున్నారు. యువ‌కుడిగా ఉన్న కౌరు భ‌విష్య‌త్తులో ఈ సామాజిక వ‌ర్గాన్ని జిల్లాలో లీడ్ చేస్తార‌న్న చ‌ర్చలు కూడా బ‌లంగా వినిపిస్తున్నాయి. దీంతో ఇలాంటి ప‌రిస్థితే కొన‌సాగితే.. పితాని స‌త్యనారాయ‌ణ‌కి మొత్తానికే మోసం రావ‌డం ఖాయ‌మ‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

వారసుడి కోసం….

దీనికితోడు త‌న వార‌సుడుగా కుమారుడికి రాజ‌కీయాల్లో మంచి పొజిష‌న్ క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఉంది. ఆయ‌న కాంగ్రెస్‌లో మంత్రిగా ఉన్నప్ప‌టి నుంచే త‌న వార‌సుడి రాజ‌కీయ భ‌విష్యత్తు కోసం ప్రయ‌త్నాలు చేస్తున్నా అవి క‌లిసి రావ‌డం లేదు. ఈ నేప‌థ్యంలోనే పితాని స‌త్యనారాయ‌ణ‌ వైసీపీలోకి వ‌ళ్లేందుకు ప్రయ‌త్నిస్తున్నార‌నే వార్తలు గుప్పుమంటున్నాయి. వాస్తవానికి గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందే.. వైసీపీ నుంచి పితానికి ఆహ్వానం అందింది. పార్టీలోకి వ‌స్తే.. న‌ర‌సాపురం ఎంపీ సీటు ఇస్తామ‌న్నారు. అయితే ఆయ‌న ఎంపీగా వెళ్లేందుకు మొగ్గు చూప‌లేదు. టీడీపీ త‌ర‌ఫునే బ‌రిలోకి దిగి ప‌రాజ‌యం పాల‌య్యారు.

అందుకే చేరాలని…..

ఇక ఇప్పుడు ఆచంట‌లో మంత్రి చెరుకువాడ రంగ‌నాథ‌రాజు స్ట్రాంగ్ అవుతున్నారు. అయితే ఆయ‌న వ‌యోః భారంతో ఉన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఆయ‌న తిరిగి పోటీ చేస్తారా ? లేదా ? అన్నది సందేహ‌మే. ఈ క్రమంలోనే భ‌విష్యత్తులో వైసీపీ ఆచంట సీటును సామాజిక స‌మీక‌ర‌ణ‌ల ప‌రంగా బీసీల‌కు ఇస్తుంద‌న్న అంచ‌నాతో వైసీపీ వ‌ర్గాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే రాజ‌కీయంగా ఇప్పుడు స‌రైన నిర్ణయం తీసుకోక‌పోతే ఇప్పుడు వెనుక‌బ‌డ‌తామేమోన‌ని పితాని స‌త్యనారాయ‌ణ‌ ఆందోళ‌న‌లో ఉన్నార‌ట‌. ఈ నేప‌థ్యంలోనే వైసీపీ వైపు పితాని స‌త్యనారాయ‌ణ‌ మొగ్గు చూపుతున్నార‌నే వాద‌న తెర‌మీదికి వ‌స్తోంది. మ‌రి పితాని కోరిక ఎలా ఉన్నా ? జ‌గ‌న్ నిర్ణయాలు ఎలా ఉంటాయో ? చెప్పలేం క‌దా..?

Tags:    

Similar News