నేపాల్ ఇప్పటికైనా కుదుట పడుతుందా?

దక్షిణాసియాలో నిరుపేద దేశమైన నేపాల్ రాజకీయాలు దశ దిశ లేకుండా సాగుతున్నాయి. అత్యున్నతమైన ప్రధాని పీఠం ఆటలో అరటి పండులా మారిపోయింది. ఈ హిమాలయ పర్వత దేశం [more]

Update: 2021-08-15 16:30 GMT

దక్షిణాసియాలో నిరుపేద దేశమైన నేపాల్ రాజకీయాలు దశ దిశ లేకుండా సాగుతున్నాయి. అత్యున్నతమైన ప్రధాని పీఠం ఆటలో అరటి పండులా మారిపోయింది. ఈ హిమాలయ పర్వత దేశం ప్రధానిగా సూర్యబహదూర్ దేవ్ బా ప్రమాణ స్వీకారం చేయడంతో గత డిసెంబరు నుంచి కొనసాగుతున్న ప్రతిష్ఠంభనకు తాత్కాలికంగా తెరపడినట్లయింది. 74ఏళ్ల దేవ్ బా నేపాలీ కాంగ్రెస్ నాయకుడు. ఆయన ప్రధాని పదవిని చేపటట్డం ఇది అయిదోసారి. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ మాదిరిగా నేపాల్లో నేపాలీ కాంగ్రెస్ కు సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. అది దేశంలోని అత్యంత పురాతనమైన పార్టీ. అంతేకాక నేపాలీ కాంగ్రెస్ కు భారత్ అనుకూల పార్టీ అన్న పేరుంది. ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులకు భారత్ లోని వివిధ పార్టీల నాయకులతో వ్యక్తిగతంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. నిన్న మొన్నటి దాకా దేశాన్నేలిన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ నాయకుడు, మాజీ ప్రధాని ఖడ్గ ప్రపాద్ శర్మ ఓలీకు భారత్ వ్యతిరేకిగా, చైనా అనుకూల వాదిగా పేరుంది. ఆయనను అధికారంలో కొనసాగించేందుకు తెరవెనక చైనా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కొత్త ప్రధాని దేవ్ బా హయాంలో అయినా దెబ్బతిన్న భారత్ – నేపాల్ సంబంధాలు గాడిన పడే అవకాశం ఉందని దౌత్యవర్గాలు విశ్లేషిస్తున్నాయి.

రెండు సార్లు రద్దు చేసి….

నేపాల్ రాజకీయాలను అర్థం చేసుకోవాలనుకుంటే ఏడు నెలలకు ముందుకు వెళ్లాలి. అధికార కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ లో వర్గ పోరు కారణంగా ప్రధాని శర్మ ఓలీ గత ఏడాది డిసెంబరు 20న పార్లమెంటును రద్దు చేశారు. అంతేకాక ఏప్రిల్ 30, మే 10ల్లో ఎన్నికలకు ఆదేశించారు. దీనిని సవాలు చేస్తూ కొందరు నాయకులు సుప్రీంకోర్టుకు వెళ్లడంతో పార్లమెంటును పునరుద్ధరిస్తూ ఫిబ్రవరి 23న తీర్పిచ్చింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో మళ్లీ ఓలీ నే ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.

మరోసారి సుప్రీంకోర్టు….

పార్టీలో పరిస్థితులు సజావుగా లేకపోవడంతో మే 22న రెండోసారి సభను రద్దు చేశారు. నవంబరు 12, 19ల్లో ఎన్నికల కు ఆదేశించారు. దీనిపైనా కొందరు నాయకులు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దాదాపు 30 పిటిషన్లు దాఖలయ్యాయి. సభను పునరుద్ధరించడంతోపాటు, మెజార్టీ ఉన్నందున తనకు ప్రధాని పదవి అప్పగించేలా ఆదేశించాలని కోరుతూ నేపాలీ కాంగ్రెస్ నాయకుడు సూర్య బహదుర్ దేవ్ బా కూడా సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చోలేంద్ర షంషేర్ రాణా ఆధ్వర్యంలోని అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం రాజ్యాంగంలోని 76(5) అధికరణం ప్రకారం దేవ్ బా కు అనుకూలంగా తీర్పిచ్చింది. ధర్మాసనం ఆయనకు అనుకూలంగా తీర్పివ్వడంతో జులై మొదటివారంలో దేవ్ బా బాధ్యతలు చేపట్టారు.

తాత్కాలికంగా తెరపడినా…

నేపాల్ అధ్యక్షురాలు బిద్యాదేవి భండారీ ప్రధానిగా దేవ్ బా చేత ప్రమాణ స్వీకారం చేయించారు. మాజీ ప్రధాని ఓలీకి అధ్యక్షురాలు భండారీ సన్నిహితురాలన్న పేరుంది. ఆమె ఓలీకి అనుకూలంగా గతంలో అనేక నిర్ణయాలు తీసుకున్నారు. దేవ్ బా మొన్నటివరకు ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో నవంబరు 12, 19 తేదీల్లో జరగాల్సిన ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. మరోపక్క న్యాయస్థానం తీర్పుపై ఓలీ పార్టీ నిరసన వ్యక్తం చేసింది. కోర్టు ఉద్దేశ పూర్వకంగానే విపక్షాలకు అనుకూలంగా తీర్పిచ్చిందని మాజీ ప్రధాని ఖడ్గ ప్రసాద శర్మ ఓలీ ఆరోపించారు. బహుళ పార్టీ పార్లమెంటరీ వ్యవస్థ గల తమ దేశంలో ఈ తీర్పు ప్రభావం దీర్ఘకాలం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మొత్తం మీద ఏడు నెలలుగా కొనసాగుతున్న నేపాల్ రాజకీయ ప్రతిష్ఠంభనకు దేవ్ బా పీఠం ఎక్కడంతో తాత్కాలికంగా తెర పడినట్లయింది. దేవ్ బా రాకతో నేపాల్, భారత్ సంబంధాలు మళ్లీ పూర్వ వైభవం పొందగలవన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. అయితే ఆయన ఎంతకాలం పదవిలో కొనసాగుతారన్న విషయంపైనే ఇది ఆధారపడి ఉంటుంది.

– ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News