ప్రొద్దుటూరు టీడీపీలో ఉక్కు ఆశ‌లు.. సాకార‌మ‌య్యేనా..?

ఏ చెట్టూ లేనిచోట ఆముదం చెట్టే మ‌హావృక్షమ‌న్నట్టుగా ఉంది.. క‌డ‌ప‌లో టీడీపీ ప‌రిస్థితి. సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లో పాగా వేయాల‌ని.. పార్టీని ప‌రుగులు పెట్టించాల‌ని [more]

;

Update: 2020-09-10 09:30 GMT

ఏ చెట్టూ లేనిచోట ఆముదం చెట్టే మ‌హావృక్షమ‌న్నట్టుగా ఉంది.. క‌డ‌ప‌లో టీడీపీ ప‌రిస్థితి. సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లో పాగా వేయాల‌ని.. పార్టీని ప‌రుగులు పెట్టించాల‌ని చంద్రబాబు అనేక రూపాల్లో ప్రయ‌త్నాలు చేసిన విష‌యం తెలిసిందే. గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేప‌ట్టారు. ఉక్కు ఫ్యాక్టరీకి కూడా శంకు స్థాప‌న చేశారు. అయితే, ఇక్కడ పార్టీ ప‌రిస్థితి అధ్వానంగానే ఉంది. గ‌త ఎన్నిక‌ల్లో జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ సీట్లతో పాటు రెండు ఎంపీ సీట్లలో కూడా పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఎన్నిక‌ల్లో ఓడిపోయాక నేత‌లు పూర్తిగా సైలెంట్ అయిపోయారు. పార్టీ కార్యక్రమాలు కూడా ప‌ట్టించుకోవ‌డం లేదు. దీంతో చంద్రబాబు త‌ల ప‌ట్టుకున్నార‌నే వార్తలు త‌ర‌చుగా వినిపిస్తున్నాయి. చంద్రబాబు ఎంత మొత్తుకున్నా ఈ జిల్లా టీడీపీ నేత‌ల తీరు మాత్రం మార‌డం లేద‌ట‌.

వరసగా ఓటమి పాలవుతూ….

అయితే, చుక్కాని మాదిరిగా క‌డప జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీకి ఓ నాయ‌కుడు దొరికాడ‌ని ఇక్కడి ప్రజ‌లు చ‌ర్చించుకుంటున్నారు. వాస్తవానికి ఆది నుంచి కూడా ప్రొద్దుటూరు నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జ్‌గా, గ‌తంలో జిల్లా పార్టీ అధ్యక్షుడుగా మ‌ల్లెల లింగారెడ్డి ఉన్నారు. ఈయ‌న 1999, 2004లో వ‌రుస‌గా ఓడిపోయాడు. 2009లో గెలుపు గుర్రం ఎక్కారు. ఈ స‌మ‌యంలోనే ఆయ‌న వ‌ర‌ద‌రాజుల రెడ్డిని ఓడించారు. అయితే, అనూహ్యంగా జిల్లా రాజ‌కీయాల్లో 2014లో లింగారెడ్డిని కాద‌ని వ‌ర‌ద‌రాజులురెడ్డికి టికెట్ ఇప్పించారు. అయితే, ఆయ‌న కూడా ఓడిపోయారు.

టీడీపీని పక్కాలెక్కించేందుకు….

ఇక‌, గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ చంద్రబాబు లింగారెడ్డికి టికెట్ ఇచ్చారు. అయితే, ఆయ‌న కూడా ఈ ద‌ఫా గెలుపు గుర్రం ఎక్కలేక పోయారు. ఈ క్రమంలో వ‌రుస‌గా వైసీపీ త‌ర‌ఫున రాచ‌మ‌ల్లు శివ‌ప్రసాద్‌రెడ్డి విజ‌యాలు సాధిస్తూ వ‌చ్చారు. ఇక ఇక్కడ టీడీపీని న‌డిపించే స‌మ‌ర్థుడు అయిన నేతే లేకుండా పోయాడు. గ‌త 25 ఏళ్లలో ఒక్క 2009లో మిన‌హా ఈ సీటును టీడీపీ ఎప్పుడూ గెలుచుకోలేదు. అయితే ఎట్టకేల‌కు ప్రొద్దుటూరు టీడీపీని కాస్త ప‌ట్టాలెక్కించే నాయ‌కుడు ఆ పార్టీకి దొరికాడు. ఇటీవ‌ల కాలంలో టీడీపీ త‌ర‌ఫున ఉక్కు ప్రవీణ్‌రెడ్డి చ‌క్రం తిప్పుతున్నారు. క‌డ‌ప ఉక్కు ఫ్యాక్టరీ కోసం అనేక రూపాల్లో ఉద్యమాలు న‌డిపించిన ప్ర‌వీణ్‌.. ఉక్కు ప్రవీణ్‌ స్వయం ప్రక‌టిత బిరుదాంకితుడు..!

ప్రజల్లోకి బలంగా వెళుతూ…

ఈయ‌న‌ క‌మ‌లాపురం మాజీ ఎమ్మెల్యే వీర‌శివారెడ్డి త‌మ్ముడి కొడుకు.. స్థితిమంతుడు కూడా కావ‌డంతో చంద్రబాబు ఈయ‌న‌కు అవ‌కాశం ఇచ్చారు. దీంతో త‌న‌స‌త్తా నిరూపించుకునేందుకు త‌న పలుకుబ‌డిని కూడా వినియోగించుకుంటున్న ప్రవీణ్‌.. బాగానే ప్రజ‌ల్లోకి వెళ్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ నాయ‌కుడు రాచ‌మ‌ల్లుపై వ‌స్తున్న ఆరోప‌ణ‌లను రాజ‌కీయంగా వాడుకోవ‌డంలో ప్రవీణ్ రెడ్డి స‌క్సెస్ అవుతున్నార‌ని తెలుస్తోంది. స్థానికంగా రాచ‌మల్లుపై వ‌స్తోన్న ఆరోప‌ణ‌ల‌ను ఆయ‌న బ‌లంగా ప్రజ‌ల్లోకి తీసుకు వెళుతున్నారు.

ఎమ్మెల్యేపై వ్యతిరేకతను…..

రాచ‌మ‌ల్లు రెండోసారి గెల‌వ‌డం, పార్టీ అధికారంలో ఉండ‌డంతో ఆయ‌న పేరు చెప్పుకుని అనుచ‌రులు బాగా చేతివాటం ప్రద‌ర్శిస్తున్నార‌న్న టాక్ ప్రొద్దుటూరులో బ‌లంగా వినిపిస్తోంది. ఇక మునిసిప‌ల్ కాంట్రాక్టుల‌ను త‌న వారికే రాచ‌మ‌ల్లు ఇప్పించుకుంటున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. దీంతో ఈ వ్యతిరేక‌త‌ను ప్రవీణ్‌.. ప్రజ‌ల్లోకి బాగానే తీసుకువెళ్తున్నార‌ని తెలుస్తోంది. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్నవారు.. రాబోయే కాలంలో ఉక్కు సంక‌ల్పంతో ఇక్కడ టీడీపీ పుంజుకునే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో ? చూడాలి.

Tags:    

Similar News