జమిలికి సిద్ధమవుతున్నారా?

ప్రధాని నరేంద్ర మోదీ జమిలి ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లే కన్పిస్తుంది. ఆయన తరచూ జమిలి గురించి ప్రస్తావిస్తుండటమే ఇందుకు నిదర్శనం. జమిలి ఎన్నికల ఊసును మరోసారి నరేంద్ర మోదీ [more]

Update: 2020-12-03 17:30 GMT

ప్రధాని నరేంద్ర మోదీ జమిలి ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లే కన్పిస్తుంది. ఆయన తరచూ జమిలి గురించి ప్రస్తావిస్తుండటమే ఇందుకు నిదర్శనం. జమిలి ఎన్నికల ఊసును మరోసారి నరేంద్ర మోదీ తెచ్చి దేశంలో చర్చ లేపారు. స్పీకర్ల సదస్సులో మోడీ జమిలి ఎన్నికల గురించి ప్రస్తావించారు. లోక్ సభ, శాసనసభ, మున్సిపల్ ఎన్నికలకు ఒకేసారి ఎన్నికలు జరగాలన్నారు. అన్ని ఎన్నికలకు ఒకే ఓటర్ల జాబితా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది మంచిదని, దానివల్ల అభివృద్ధి మరింత వేగం అవుతుందని నరేంద్రమోదీ అభిప్రాయపడ్డారు.

ఆలోచన ఇప్పటిది కాదు…..

నిజానికి జమిలి ఎన్నికల ఆలోచన ఇప్పటిదికాదు. వాజ్ పేయి ఉన్నప్పుడే జమిలి ఎన్నికల ఆలోచన చేశారు. కానీ అది అప్పట్లో సాధ్యం కాలేదు. జమిలి ఎన్నికలు రాజకీయంగా పార్టీకి లాభమేనన్న అంచనాలో నరేంద్ర మోదీ, అమిత్ షాలు ఉన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ వైపు జనం నిలుస్తుండటమే ఇందుకు కారణం. రాష్ట్రాల ఎన్నికల్లో కొంత తేడా కన్పిస్తుంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అప్పటి ఎన్నికల్లో బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది.

బలమైన పార్టీగా…..

పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం దాదాపు అన్ని రాష్ట్రాల్లో బీజేపీకి ప్రజల నుంచి మద్దతు లభించింది. ఇదే నరేంద్ర మోదీ, అమిత్ షాలకు జమిలి ఎన్నికలను నిర్వహించాలన్న ఆలోచనను మరింత పెంచింది. 2021 నాటికి రాజ్యసభలో సంపూర్ణ బలాన్ని బీజేపీ సాధిస్తుంది. దీంతో రాజ్యాంగ సవరణ చేసైనా జమిలి ఎన్నికలను నిర్వహించ వచ్చన్న యోచనలో వారు ఉన్నారు. అయితే దీనికి ఎన్నికల కమిషన్ తొలుత అంగీకరించాల్సి ఉంది.

సాధ్యమయ్యేనా?

ఎన్నికల కమిషన్ అన్ని పార్టీల అభిప్రాయాలను సేకరించాల్సి ఉంది. ముందుగా ప్రాంతీయ పార్టీలు ఉన్న అధికారంలో రాష్ట్రాలు జమిలి ఎన్నికల ప్రతిపాదనకు అంగీకరించే అవకాశం లేదు. మోదీ మ్యాజిక్ ను అంగీకరించేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్ వంటి రాష్ట్రాలు సుముఖత వ్యక్తం చేసే అవకాశం లేదు. పార్లమెంటరీ స్థాయి సంఘం కూడా జమిలి ఎన్నికలపై అధ్యయనం చేసింది. ఎన్నికల కమిషన్, లా కమిషన్ లు కూడా అధ్యయనం చేశాయి. అయితే నీతి ఆయోగ్ మాత్రం 2024 తర్వాత దశల వారీగా జమిలి ఎన్నికలను నిర్వహించాలని అభిప్రాయపడింది. మొత్తం మీద జమిలి ఎన్నికలను నిర్వహించేందుకు నరేంద్రమోదీ పట్టుదలగానే ఉన్నట్లు అర్ధమవుతోంది.

Tags:    

Similar News