నేరము..చట్టము..రాజకీయము

ఒక తీవ్రమైన సంఘటన చోటు చేసుకున్నప్పుడు సంఘం తక్షణ న్యాయాన్ని ఆశిస్తుంది. జాప్యం జరిగే కొద్దీ ఆగ్రహావేశాలు పెల్లుబుకుతాయి. దురాగతం సంఘంలో సృష్టించే అలజడిని బట్టి రాజకీయాలూ [more]

Update: 2019-12-02 15:30 GMT

ఒక తీవ్రమైన సంఘటన చోటు చేసుకున్నప్పుడు సంఘం తక్షణ న్యాయాన్ని ఆశిస్తుంది. జాప్యం జరిగే కొద్దీ ఆగ్రహావేశాలు పెల్లుబుకుతాయి. దురాగతం సంఘంలో సృష్టించే అలజడిని బట్టి రాజకీయాలూ రంగప్రవేశం చేస్తాయి. విషయం కేంద్ర,రాష్ట్రాలతో ముడిపడి ఉంటే రచ్చ మొదలవుతుంది. జాతీయ, రాష్ట్ర స్థాయుల్లో భిన్నమైన పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు తప్పు ఎదుటి పక్షం పై తోసేసే ప్రయత్నాలకూ కొదవ ఉండదు. సొసైటీ ఆగ్రహం రాజకీయపార్టీలపైకి మళ్లకుండా ఈ ఎత్తుగడను అనుసరిస్తుంటాయి. పార్లమెంటులోనూ ప్రకంపనలు సృష్టించిన ‘దిశ’ ఉదంతం తాత్కాలిక ఆవేశకావేశాలకే పరిమితం కాకుండా శాశ్వత పరిష్కార దిశలో అడుగులు వేయించినప్పుడే మహిళా లోకానికి న్యాయం జరుగుతుంది.

శాశ్వత కార్యాచరణ కరవు…

స్త్రీని పూజించే దేశంలో దేవతలు నివసిస్తారనేది నానుడిగా మాత్రమే మిగిలిపోయింది. ఎందుకంటే ఆ సూక్తికి అర్థమే తెలియని దుస్థితిలో పడిపోయాం. సంస్కృతి, సంప్రదాయాలను భావిభారత పౌరుల వికాసంలో , బోధనలో అంతర్భాగం కాకుండా ఎప్పుడో దూరం చేసేశాం. అందుకే అత్యాచారాలు, హత్యలు చోటు చేసుకున్న సందర్బాల్లో ఒక్కసారిగా ఆగ్రహావేశాలు పెల్లుబుకడం , తర్వాత వారం పదిరోజులకు సద్దుమణగడం సాధారణ తంతుగా మారిపోయింది. సంఘటన తీవ్రతకు అనుగుణంగా తాత్కాలిక స్పందనలు మినహా శాశ్వత కార్యాచరణ కరవు అవుతోంది. సమాజానికి భయపడి రాజకీయ నేతలు ప్రతిస్పందిస్తున్నారు. అంతవరకూ బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత తాము చేపట్టాల్సిన చట్టపరమైన ప్రక్రియలో మాత్రం చేతులెత్తేస్తున్నారు.

నిర్భయంగా…

2012లో దేశరాజధానిలో నిర్భయపై చోటు చేసుకున్న తీవ్ర దారుణం తర్వాత ప్రత్యేకంగా చట్టాన్ని తెచ్చారు. కానీ నిర్దిష్ట కాలవ్యవధిలో శిక్షలు పడేలా మార్పులు తీసుకురావడంలో మాత్రం వైఫల్యం ఇంకా కొనసాగుతూనే ఉంది. విచారణ న్యాయస్థానం, అప్పీల్ న్యాయస్థానమైన హైకోర్టు, సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు ఇలా మూడు అంచెలుగా శిక్షకు సంబంధించి కాలయాపన సర్వసాధారణమైపోయింది. చట్టంలో ఉండే లోపాలకు తోడు న్యాయవ్యవస్థలోని జాప్యాలు కలగలిసి ఈదేశంలో సకాలంలో న్యాయం జరగదనే ఒక బలమైన నమ్మకం ఏర్పడటానికి కారణంగా నిలుస్తున్నాయి. జస్టిస్ డిలేయడ్ ..జస్టిస్ డినైడ్…అన్నసామెతకు అతికినట్లు సరిపోతోంది ఇండియన్ జ్యురిష్ ప్రుడెన్స్ ..ఆలస్యంగా జరిగే న్యాయం.. న్యాయాన్ని నిరాకరించిన దానితో సమానమే. ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు వంటివి నేటి ఆధునిక అవసరాలకు , సత్వర శిక్షలకు అనుగుణంగా ఉన్నాయా? లేదా? అన్నది ఆలోచించాల్సిన తరుణం. బ్రిటిష్ కాలం నాటి ఈ నేర శిక్షా స్మ్రుతి చట్టాల్లో మార్పులు చోటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

నేరము..శిక్ష……

నేరం ఎంత తీవ్రమైనదైనా నిందితులకు చట్టపరంగా శిక్ష పడుతున్న ఉదంతాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. ఏదో ఒక కారణంతో ఏదో ఒక స్థాయి న్యాయస్థానంలో బయటకు వచ్చేస్తున్నారు నేరగాళ్లు. అసలే నేర విచారణ తీవ్ర జాప్యం తో సాగుతోంది. శిక్షల తీరూ సరళంగా ఉంటోంది. దేశంలో ఏటా సగటున లక్షయాభైవేల వరకూ మహిళలపై అత్యాచారాలు, నేరాలకు సంబంధించి కేసులు నమోదవుతున్నాయి. అందులో ఆరువేల లోపు కేసుల్లోనే శిక్షలు పడుతున్నాయి. అంటే శిక్షలు నాలుగు శాతం లోపునకే పరిమితమవుతున్నాయి. ఈవిషయంలో కొంతవరకూ తెలుగు రాష్ట్రాల్లో రికార్డునే మెరుగ్గా చెప్పుకోవాలి. ఇక్కడ దాదాపు సగటున తొమ్మిదివేల వరకూ కేసులు నమోదవుతుంటే ఎనిమిదివందల పైచిలుకు శిక్షలు పడుతున్నాయి. తొమ్మిదిశాతంపైన శిక్షలు పడుతున్నట్లు చెప్పాలి. ఇక్కడ కూడా జాప్యం సర్వసాధారణమే. ఇమ్మీడియెట్ గా శిక్షలు పడినప్పుడే న్యాయం జరిగినట్లుగా సమాజం భావిస్తోంది. సంఘటనను మరిచిపోయిన తర్వాత నిందితులను శిక్షించినా పెద్దగా దానికి ప్రచారం రాదు. అటువంటి ఘాతుకాలకు పాల్పడకూడదన్న హెచ్చరిక సమాజంలోని అసాంఘిక శక్తులకు చేరదు.

రాజకీయమూ…దోషే..

శాంతిభద్రతలకు రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత. అదే సమయంలో చట్టాలను కఠినతరం చేసి నేరగాళ్లు తప్పించుకుపోకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రానిది కూడా . తీవ్రమైన ఘాతుక సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు అప్పగించడం అవసరం. ఉన్న న్యాయస్థానాలకే ఫాస్ట్ ట్రాక్ అనే ముద్ర వేయకుండా ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేయాలి. ఘాతుకాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామన్న సందేశాన్ని, సంకేతాన్ని సమాజానికి ఇవ్వాలి. అదే సమయంలో కేంద్రం పార్లమెంటు చట్టాల ద్వారా ఉన్నత న్యాయస్థానాలైన హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో సైతం మహిళలకు సంబంధించి ప్రత్యేక బెంచీల ఏర్పాటునకు ,సత్వర న్యాయానికి అవసరమైన టైమ్ బౌండ్ శిక్షల ఖరారును ఖాయం చేయాలి. సుప్రీం కోర్టుకు సైతం మార్గదర్శకం చేయగలిగిన పార్లమెంటే ఇందుకు పూనుకోవాలి. రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ పెత్తనం చేసేది రాజకీయ పార్టీలే. తమ ప్రభుత్వంపై చెడ్డపేరు వస్తుందనే భావనతో ఒకరినొకరు నిందించుకోవడం, లేదంటే తప్పించుకునే ప్రయత్నం చేయడం సాగుతుంది. ‘దిశ’ కేసు విషయంలోనూ అదే జరుగుతోంది. తగినంత మంది న్యాయమూర్తుల నియామకం లేకపోవడం, దర్యాప్తును వేగంగా పూర్తి చేసేందుకు అవసరమైన మౌలిక వసతులు పోలీసులకు కల్పించకపోవడం వంటి లోపాలు వ్యవస్థను పీడిస్తున్నాయి.

చట్టం ముందు అంతా సమానులే…

ముఖ్యంగా బాలనేరస్తుల చట్టం వంటివి తీవ్రమనస్తత్వం ఉన్నవారికి రక్షణ కవచాలుగా తోడ్పడుతున్నాయి. అత్యాచారం, హత్య వంటి తీవ్ర నేరాలకు పాల్పడే పిల్లలనూ మిగిలిన నేరస్థులతో సమానంగానే చూడాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. ఆ మేరకు చట్టాల్లోనూ మార్పులు అవసరం. ఆకాశంలో సగం అన్నట్లు నేడు మహిళలూ దేశ ప్రగతి, ఆర్థిక సుస్థిరతలో కీలక భాగస్వాములుగా నిలుస్తున్నారు. అర్ధరాత్రైనా బయటికి వెళ్లి ఉద్యోగం చేసే స్వేచ్ఛ వారికి కల్పించాలి. జాగ్రత్తలతో కట్టడి చేయడం నేటి ఆధునిక మహిళ సహించదు. అది ఆత్మాభిమానానికీ విఘాతమే. స్వేచ్ఛ, రక్షణ కల్పించడమే ప్రభుత్వాల ప్రైమరీ డ్యూటీ.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News