బీజేపీ పితామహుడిని మరిచారుగా… ?

బీజేపీ అంటే ఉత్తరాది పార్టీ అని అంతా భావించే రోజులు అవి. అలాంటి బీజేపీని దక్షిణాదికి పరిచయం చేసిన ఘనత అచ్చంగా పీవీ చలపతిరావుది. ఆయన జనసంఘ్ [more]

;

Update: 2021-09-14 11:00 GMT

బీజేపీ అంటే ఉత్తరాది పార్టీ అని అంతా భావించే రోజులు అవి. అలాంటి బీజేపీని దక్షిణాదికి పరిచయం చేసిన ఘనత అచ్చంగా పీవీ చలపతిరావుది. ఆయన జనసంఘ్ కాలం నుంచి పనిచేస్తూ వస్తున్న వరిష్ట నేత. చలపతిరావు కరడు కట్టిన సంఘ్ కార్యకర్త. ఏపీలో కాంగ్రెస్ అప్రతిహతంగా తన హవా కొనసాగిస్తున్న రోజుల్లో మరో వైపు బలంగా ఉన్న కమ్యూనిస్టులను కూడా ఎదుర్కొని కాషాయం జెండా పాతిన ఘనత పీవీదే. ఆయన జనసంఘ్ నుంచి రెండు సార్లు ఎమ్మెల్సీగా గెలిచారు కూడా. ఇక బీజేపీగా రూపాంతరం చెందాక 1980లో ఉమ్మడి ఏపీకి తొలి అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. అనాడే దక్షిణాదిన కమల వికాసం జరిగింది. అప్పట్లో విశాఖ మేయర్ సీటుని బీజేపీ గెలుచుకోవడం వెనక పీవీ కృషి చాలా ఉంది.

వాజ్ పేయి సమానుడు….

ఉమ్మడి ఏపీలో పీవీ చలపతిరావుకి సరిసాటి నేతలు ఈ రోజున ఎవరూ లేరు. ఆయన వాజ్ పేయ్, అద్వానీ సరిసాటి నేత. ఆయన బీజేపీ కోసం ఎంతో చేశారు. ఒక విధంగా చూస్తే తన మొత్తం జీవితాన్ని ధారపోశారు అని కూడా చెప్పాలి. ప్రతీ ఎన్నికల్లోనూ ఆయన విశాఖ నుంచి బీజేపీ తరఫున ఎంపీగా పోటీ చేసేవారు. డిపాజిట్లు గల్లంతు అవుతున్నా కూడా ఈ పోటీ చేయడం ఎందుకు అంటే పార్టీని బతికించుకోవడానికి అని బదులిచ్చేవారు. ఎవరినా ఓడిపోతామని తెలిసి పోటీ చేస్తారా. కానీ పీవీ ఎక్కడా ఆత్మస్థైరం కోల్పోకుండా కాషాయం జెండా వెంట నడించారు. దానినే జీవితాంతం ప్రేమించారు.

నాడు అడ్డుకున్నారు …

అటువంటి పీవీ చలపతిరావుకి ఏ అధికారిక హోదాలు దక్కలేదు. ఆయన పార్టీకి చేసిన సేవలకు గానూ కనీసం ఒక రాష్ట్రానికి గవర్నర్ గా అయినా నియమిస్తారు అనుకుంటే అది కూడా లేకుండా పోయిందని అభిమానులు బాధపడతారు. వాజ్ పేయ్ ప్రధాని అయిన కొత్తల్లో తన సహచరులకు పదవులు ఇవ్వాలనుకున్నారు. అలా ఆయన నాడు ఏపీలో ఉన్న పీవీ చలపతిరావు గురించి వాకబు చేశారట. ఆయనను సమాదరించి కీలకమైన రాష్ట్రానికి గవర్నర్ గా చేయాలనుకున్నారట‌. అయితే నాడు ఏపీలో బీజేపీ మీద పెత్తనం చేస్తున్న ఒక బడా నాయకుడు పీవీకి ఆ పదవిని దక్కనీయకుండా చేశారు అని ప్రచారంలో ఉంది. పీవీ చలపతిరావుకి అనారోగ్య సమస్యలు అంటూ కేంద్ర పెద్దలను ఆయనే తప్పుతోవ పట్టించారని చెబుతారు.

తేడా చూపిస్తున్నారా ?

బీజేపీని తేడా గల పార్టీ అంటారు. పార్టీలో పనిచేసిన వారికే అగ్ర తాంబూలం అని చెబుతారు. కానీ ముందొచ్చిన చెవుల కంటే వెనక వచ్చిన కొమ్ములు వాడి అని ఆ పార్టీ పెద్దలే నిరూపిస్తున్నారు అంటున్నారు. పీవీ చలపతిరావు వద్ద శిష్యరికం చేసిన వారంతా ఉన్నత పదవులు అలంకరించారు. ఆయన రాజకీయాల్లో చిరకాలం ఉన్నా వ్యవహారం తెలియక అలాగే ఉండిపోయారు. పార్టీ కోసం అంటూ ఎమర్జెన్సీ కాలంలో కూడా ప్రాణాలకు తెగించి పోరాడిన ఆయనకు దక్కిందేంటి అన్న బాధ అయితే అభిమానుల్లో ఉంది. జైలుకు వెళ్ళి అష్టకష్టాలు పడిన పీవీకి చివరికి ఏ పదవీ లేకుండా చేశారు అన్నదే బీజేపీని అభిమానించే అసలైన కార్యకర్తల వేదన కూడా. నాడు వాజ్ పేయి టైమ్ లో ఆరేళ్ళు, మోడీ జమానాలో ఏడేళ్ళు అధికారంలో పార్టీ ఉన్నా కూడా పీవీ చలపతిరావుకి ఒక పదవి ఇవ్వడానికి టైమ్ సరిపోలేదా, లేక చేతులు రాలేదా అన్న సూటి ప్రశ్న‌కు పెద్దల వద్ద జవాబు ఉందా.

Tags:    

Similar News