వైఎస్సార్ భక్తుడు బరస్ట్ అయ్యారే?

విజయనగరం జిల్లా రాజకీయాల్లో సీనియర్ నాయకుడు రాజన్నదొర. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గిరిజన నేత. రాజన్నదొర నిజయితీకి మారుపేరు. ఆయన ఇల్లు కూడా సాదా సీదాగా [more]

Update: 2019-11-10 06:30 GMT

విజయనగరం జిల్లా రాజకీయాల్లో సీనియర్ నాయకుడు రాజన్నదొర. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గిరిజన నేత. రాజన్నదొర నిజయితీకి మారుపేరు. ఆయన ఇల్లు కూడా సాదా సీదాగా ఉంటుంది. ఆయన ప్రతీ రోజూ పేదలతోనే సమావేశమై వారి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరుగుతారు. రాజన్నదొర ఇంటికీ సాదా సీదా జనం ఎపుడూ జాతర లాగానే వస్తారు. పేరులో దొర ఉంది కానీ ఆయన పేదల దేవుడేనని అంటారు. మావోయిస్టులకు కూడా ఆయన ఇష్టుడు అంటారు. అటువంటి రాజన్నదొర వైఎస్సార్ కి వీర భక్తుడు. ఆయనతోనే తన రాజకీయ జీవితం అంటూ సాగారు. ఎపుడైతే వైఎస్సార్ మరణించారో అపుడే రాజన్నదొర కాంగ్రెస్ ని వదిలేశారు. కుమారుడు జగన్ పెట్టిన పార్టీలో తొలిగా చేరి ఈనాటి వరకూ ఆయన మాటకు కట్టుబడే ఉన్నారు. వైసీపీ గెలిచాక సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న రాజన్నదొరకు మంత్రి పదవి ఖాయమని అంతా అనుకున్నా పుష్ప శ్రీవాణికి ఆ పదవి దక్కింది. పైగా ఆమె ఇపుడు డిప్యూటీ ముఖ్యమంత్రిగా, గిరిజన సలహా మండలి చైర్మన్ గా కూడా ఉంటున్నారు.

అధికారుల నిర్లక్షంపైన ఆవేదన…..

తాజాగా జరిగిన విజయనగరం జిల్లా సమీక్షా సమావేశంలో రాజన్నదొర పెద్ద నోరు చేసుకున్నారు. ఎన్నడూ లేనిది అధికారుల మీద అధికార పార్టీ మీద కూడా ఆయన ఆవేదన వెళ్ళగక్కారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా తన మాటను ఎవరూ లెక్కచేయడంలేదని రాజన్నదొర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకే ఎక్కే గుమ్మం దిగే గుమ్మం అయితే ఇక సామాన్యుడి గతేంటని గట్టిగానే నిలదీశారు. అసలు అధికారంలో మనం ఉన్నామా అని కూడా రాజన్నదొర ప్రశ్నించారు. అధికారులు ఖాతరు చేయని ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉండి ఎందుకు అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. దానికి కారణం ఆయన అనేక సమస్యలు అధికారుల దృష్టికి తెస్తున్నా పట్టింకోవడం లేదనే సహజమైన బాధ ఒకటైతే మరోటి కూడా ఆయనలో పేరుకుపోయిన అసంతృప్తిగా పేర్కొంటున్నారు. జిల్లాకు చెందిన ఇంచార్జి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ, డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి సమక్షంలోనే రాజన్నదొర ఇలా కన్నెర్ర చేయడం కూడా చర్చనీయాంశం అవుతోంది.

అదే కారణమా…?

నిజానికి రాజన్నదొరకు పదవులు పడవు అంటారు. పదవులే కావాల్సివస్తే ఆయన గతంలో టీడీపీ నేతలు ఎంతగా రాయబేరాలు నడిపినా కనీసం స్పందించలేదు. విలువలు సిధ్ధాంతలు ముఖ్యమనుకునే అరుదైన నేతగా పేరుంది. జగన్ అధికారంలోకి రాగానే ఆయనకు మంచి అవకాశం దక్కుతుందని ఆశ పడిన మాట వాస్తవం. అయితే న్యాయంగా తనకు సీనియర్ గా దక్కాల్సిన గౌరవం కోసమే రాజన్నదొర అలా కోరుకున్నారని కూడా అంటున్నారు. కానీ జూనియర్ అయిన పుష్పశ్రెవాణిని జగన్ ఎంపిక చేయడంతోనే రాజన్న దొరకు బాధ కలిగిందని చెబుతున్నారు.

సీనియర్ గా ఉన్నా….

ఇక జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నా ఎవరూ పట్టించుకోవడంలేదన్న ఆవేదన కూడా రాజన్న దొరలో ఉందని చెబుతున్నారు. జిల్లాలో పదిమంది ఎమ్మెల్యేలు ఉంటే అందులో ఇద్దరు మంత్రులు ఉన్నారు. అయినా సరే పార్టీలో ఎక్కువగ వర్గ పోరు ఉంది. ఒకరు గురించి ఒకరికి అవసరం లేదు, అక్కరలేదు, ఆధిపత్య పోరులో రాజన్న దొర ఒంటరిగా మిగిలిపోయారని అంటున్నారు. ఆయన ఆలోచనలకు, జిల్లాలో వైసీపీ సాగుతున్న తీరుకు కూడా ఎక్కడా పొంతన కుదరడంలేదని అంటున్నారు. ఈ కారణంగానే రాజన్నదొర ఇలా బరస్ట్ అయ్యారని చెబుతున్నారు. చూడాలి మరి ఆయన మాటల వేడి ఎక్కడిదాకా దారితీస్తుందో.

Tags:    

Similar News