ఆ వైసీపీ సీనియ‌ర్‌కు కుర్ర మ‌హిళా నేత సెగ ?

ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సీనియర్ నేత. వైఎస్సార్ కాలం నుంచి కూడా ఒక సిద్ధాంతానికి కట్టుబడిన నాయకుడు. ఆయనకు వైఎస్సార్ దేవుడు అయితే జగన్ [more]

;

Update: 2021-08-25 15:30 GMT

ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సీనియర్ నేత. వైఎస్సార్ కాలం నుంచి కూడా ఒక సిద్ధాంతానికి కట్టుబడిన నాయకుడు. ఆయనకు వైఎస్సార్ దేవుడు అయితే జగన్ అంటే అలవి కాని అభిమానం. ఆయ‌నే విజ‌య‌న‌గ‌రం జిల్లా సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర. నిజానికి రాజన్నదొరకు కచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలి. గిరిజన నాయకుడిగా ఉన్న ఆయన విజయనగరం జిల్లా మొత్తంలో నిజాయతీపరుడిగా పేరు తెచ్చుకున్నారు. ఈ రోజుకీ ఆయన ఇంటికీ జనాలు క్యూ కడతారు. ఎలాంటి ప్రోటోకాల్ అవసరం లేని నాయకుడు. ఏజెన్సీలో ఎలాంటి భయం భీతీ లేకుండా స్వేచ్చగా తిరిగే నాయకుడు ఆయన ఒక్కరే అని చెబుతారు.

ఆమెకు ఇస్తే..?

ఇక మంత్రి పదవి వస్తుంది అని ఆశగా ఎదురుచూస్తున్న రాజన్నదొరకు పిడుగుపాటు లాంటి వార్త ఒకటి వైసీపీ అధినాయకత్వం వినిపించింది. అదేంటి అంటే టీడీపీ నుంచి శోభా స్వాతీరాణిని తీసుకువచ్చి వైసీపీలో పెద్ద పీట వేయడం. ఆమెకు జీసీసీ పీఠాన్ని అప్పగించడం. ఇక ఆమె తన జోరు మామూలుగా చూపించడంలేదు. మరి జిల్లాలో ఎవరికీ లేని భయం రాజన్న దొరకే ఎందుకు అంటే ఇక్కడే ఉంది తమాషా. ఆమె మెట్టినిల్లు సాలూరు. ఆమె భర్త గణేష్ సొంత ప్రాంతం అది. గ‌ణేష్ కొప్పుల వెల‌మ సామాజిక వ‌ర్గానికి చెందిన వారు. ఆమె ఎస్టీ అయినా భ‌ర్త ద్వారా బీసీ కులం కూడా క‌లిసి రానుంది. అక్కడ బీసీ ఓటు బ్యాంకు కూడా ఆమెకు ప్లస్ కానుంది.

విజయసాయిరెడ్డికి…?

దాంతో ఇక మెట్టినింట రాజకీయం పండించడానికి స్వాతి రెడీ అవుతోంది. ఆమె 2019 ఎన్నికల్లోనే సాలూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ కోసం గట్టిగానే ట్రై చేశారు. కానీ చంద్రబాబు సీనియర్ నేత భంజ్ దేవ్ కి టికెట్ ఇచ్చారు. దాంతో ఆమె టీడీపీని వీడారు. ఇపుడు ఆమె సాలూరు వైసీపీ ఎమ్మెల్యే టికెట్ కి గట్టిగా ప్రయత్నం చేస్తారు అంటున్నారు. ఆమెకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అండదండలు ఉన్నాయి. ఆయనే ఆమెకు జీసీసీ చైర్ పర్సన్ పదవిని ఇప్పించారు. రేపటి రోజున సాలూరు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా ఇస్తారు అని రాజన్నదొర వర్గం మాత్రం ఆవేదన చెందుతోంది.

ఇప్పుడు మంత్రి పదవి దక్కితే…?

మరి జగన్నే నమ్ముకుని ఉన్న ఆయ‌న‌కు టీడీపీ వారు అప్పట్లో కోట్ల రూపాయలు ఇస్తామని రాయబేరాలు నడిపినా ఆ పార్టీలో చేరని నిజాయతీ రాజన్నదొరది అంటారు. ఆయనకు జగన్ అన్యాయం చేయరని కూడా మరో మాట ఉంది. ఇక మంత్రి వర్గ విస్తరణలో రాజన్నదొరకు కనుక ఛాన్స్ ఇస్తే కచ్చితంగా మరో టెర్మ్ ఆయనే ఎమ్మెల్యే అని అనుచరులు అంచనా వేసుకుంటున్నారు. అయితే ఇప్పటికే సీనియ‌ర్ కావ‌డంతో.. ఆయ‌న స్థానంలో యువ మ‌హిళా నేత‌గా ఉన్న స్వాతిరాణికే సీటు క‌ట్టబెట్టే ప్రయ‌త్నాలు కూడా పార్టీలో కొంద‌రు చేస్తున్నట్టు టాక్ ఉంది. మ‌రి రాజ‌న్న దొర రాజ‌కీయ భ‌విత‌వ్యం ఎలా ఉందో ? చూడాలి.

Tags:    

Similar News