రాం మాధవ్ షాక్ ఇచ్చారుగా? మరి వీరి పరిస్థితి ఏంటి?

అదేంటో ఏపీ విషయంలో బీజేపీ నేతల తీరు ఎవరికీ అర్ధం కాదు, కనీసం ఢిల్లీ నుంచి రాజకీయాలు చేస్తున్న వారికైనా అర్ధమవుతుందా అన్నది ఇక్కడ ప్రశ్నగా ఉంది. [more]

Update: 2020-05-31 05:00 GMT

అదేంటో ఏపీ విషయంలో బీజేపీ నేతల తీరు ఎవరికీ అర్ధం కాదు, కనీసం ఢిల్లీ నుంచి రాజకీయాలు చేస్తున్న వారికైనా అర్ధమవుతుందా అన్నది ఇక్కడ ప్రశ్నగా ఉంది. ఏపీలో బీజేపీ నేతలకు తెల్లారిలేస్తే జగన్ ని తిట్టకపోతే పొద్దు గడవదు, అయితే వీరిలో ఉన్నవారంతా వేరే ఇతర పార్టీల నుంచి వచ్చి బీజేపీలో చేరిన వారే. కాంగ్రెస్, తెలుగుదేశం నుంచి వచ్చిన వారే జగన్ ని ఆడిపోసుకుంటున్నారు. కానీ నిఖార్స్ అయిన బీజేపీ నేతలు ఆచి తూచి మాట్లాడుతున్నారు. ఇక ఏపీలో జగన్ మీద గన్ పెట్టి మరీ మాటల తూటాలు పేలుస్తున్న కమలనాధులకు ఆ పార్టీ జాతీయ నేత. సీనియర్ అయిన రాం మాధవ్ షాక్ ఇచ్చేశారు. ఏడాది జగన్ పాలనలో ఏపీలో భేష్ అనేశారు.

బాబుకు లేదుగా…?

నిజానికి అయిదేళ్ల క్రితం చూసుకుంటే అప్పట్లో చంద్రబాబు, బీజేపీ కలసి పోటీ చేశాయి. కానీ ఏనాడూ బాబు పాలన బాగుందని ఢిల్లీ బీజేపీ నేతలు అన్న పాపాన పోలేదు. ఇక ఏపీలో బాబు సెక్షన్ ఒకటి బీజేపీలో ఉండేదని అంటారు. వారు మాత్రం అప్పటికీ ఇప్పటికీ కూడా ఆయన్ని మెచ్చుకుంటూనే ఉంటారు. వారిలో కొందరే ఇపుడు బీజేపీ నుంచి జగన్ ని విమర్శిస్తున్న వారి జాబితాలో కూడా ఉన్నారని అంటారు. సరే ఇవన్నీ ఇలా ఉంటే రాం మాధవ్ లాంటి సీనియర్, మోడీ, షాలకు తలలో నాలుక లాంటి నేత జగన్ పాలన బాగుంది అనడం నిజంగా ఏపీ రాజకీయాల్లో గొప్ప మేలి మలుపుగా చూడాలి.

సన్నిహిత బంధం….

రాం మాధవ్ అంతటితో ఆగలేదు. కేంద్రంలోని మోడీ సర్కార్ తో ఏపీలోని వైసీపీ సర్కార్ కి మంచి బంధం ఉందని కూడా చెప్పేశారు. దేశం కోసం మోడీ చేస్తున్న కృషికి ఏపీ నుంచి జగన్ తన వంతుగా సాయం అందిస్తున్నారని, పార్లమెంటులో ప్రతీ బిల్లుకు వైసీఎపీ మద్దతు ఇవ్వడం మంచి పరిణామమని చెప్పారు. ఆ విధంగా పార్లమెంట్ సాక్షిగా వైసీపీతో బీజేపీ బంధం గట్టిగా ఉందని రాం మాధవ్ చెప్పకనే చెప్పారు. ఇది మరో నాలుగేళ్ల పాటు కొనసాగుతుందని కూడా ఆయన మాటల్లోనే అర్ధమవుతోంది.

దెబ్బేనా…?

ఇక రాం మాధవ్ వైసీపీకి, జగన్ కి ఈ విధంగా బాహాటంగా కితాబు ఇవ్వడం ఏపీలో టీడీపీకి కూడా దెబ్బేనని భావిస్తున్నారు. వైసీపీని, బీజేపీని చెడ్డచేసి తాను మోడీ పక్కకు చేరాలని చంద్రబాబు ఆరాటపడుతున్నారు. అయితే బాబు ఎంతలా లేఖలు రాస్తున్నా మోడీకి, షాలకు కన్నుగీటుతున్నా ఫలితం మాత్రం దక్కడంలేదు. ఇపుడు వారిద్దరికీ అత్యంత సన్నిహితుడైన ఏపీకే చెందిన రాం మాధవ్ జగన్ ని వెనకేసుకురావడం అంటే కేంద్రం ఆశీస్సులు నిండుగా జగన్ కి ఉన్నట్లే లెక్క. దాంతో ఈ పరిణామం. తమ్ముళ్లకు కక్కలేక, మింగలేక అన్నట్లుగా ఉంటుందనడంలో సందేహం లేదు. అలాగే కొత్తగా పొత్తు పెట్టుకున్న జనసేనానికి ఇది మింగుడుపడని అంశమే. మొత్తానికి రాం మాధవ్ ఏపీలోని తన పార్టీతో సహా విపక్షాన్ని క్లీన్ బౌల్డ్ చేశారా అన్న భావన కలుగుతుంది.
.

Tags:    

Similar News