ఆదితో మళ్లీ ఆరంభమయినట్లేనా?

జమ్మలమడుగు అంటేనే ముందుగా గుర్తుకొచ్చేది రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డి కుటుంబాలు. దశాబ్దాల కాలంగా ఈ రెండు కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ రాజకీయాలు నడుస్తున్నాయి. హత్యలు చోటు చేసుకున్నాయి. కుటుంబాల [more]

;

Update: 2020-03-10 06:30 GMT

జమ్మలమడుగు అంటేనే ముందుగా గుర్తుకొచ్చేది రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డి కుటుంబాలు. దశాబ్దాల కాలంగా ఈ రెండు కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ రాజకీయాలు నడుస్తున్నాయి. హత్యలు చోటు చేసుకున్నాయి. కుటుంబాల పరంగా మాత్రమే కాకుండా రాజకీయంగా కూడా వేర్వేరు పార్టీల్లో ఉంటూ జమ్మలమడుగులో ఆధిపత్యం కోసం రెండు కుటుంబాలు మొన్నటి వరకూ ప్రయత్నించాయనే చెప్పాలి. 2014 తర్వాత సీన్ మారిందనుకున్నా, మళ్లీ మొదటికి వచ్చే పరిస్థితి ఏర్పడింది.

ఇద్దరికీ రాజీ కుదిర్చి….

2014 ఎన్నికల్లోనూ రామసుబ్బారెడ్డి టీడీపీ తరుపున, ఆదినారాయణరెడ్డి వైసీపీ తరుపున జమ్మలమడుగు నియోజకవర్గంలో పోటీ చేశారు. అయితే వైసీపీ నుంచి పోటీ చేసిన ఆదినారాయణరెడ్డి గెలిచారు. తర్వాత చంద్రబాబు ఆదినారాయణరెడ్డిని పార్టీలోకి తీసుకున్నారు. మంత్రివర్గంలో స్థానం కల్పించారు. తొలుత తీవ్రంగా వ్యతిరేకించిన రామసుబ్బారెడ్డి చంద్రబాబు పిలిచి రాజీ కుదర్చడంతో అంగీకరించారు. రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు.

ఆది బీజేపీలోకి…..

పదవుల పంపకమే కాకుండా ఇరువర్గాల కేసుల విషయంలోనూ చంద్రబాబు రాజీ కుదిర్చారు. రెండు వర్గాలు ఏకం కావడంతో ఇక జమ్మలమడుగులో తిరుగులేదని భావించారు. కానీ 2019 ఎన్నికలలో జమ్మలమడుగు శాసనసభకు రామసుబ్బారెడ్డిని, కడప లోక్ సభకు ఆదినారాయణరెడ్డిని పోటీ చేయించారు. ఇద్దరూ చిత్తుగా ఓటమి పాలయ్యారు. దీంతో జగన్ పార్టీలోకి తిరిగి రాలేక ఆదినారాయణరెడ్డి బీజేపీ కండువా కప్పుకున్నారు. జమ్మలమడుగు రాజకీయాలను ఆదినారాయణరెడ్డి పెద్దగా పట్టించుకోవడం లేదు.

వైసీపీలోకి ఎందుకంటే?

అయితే అదే సమయంలో రామసుబ్బారెడ్డి సయితం టీడీపీలో ఉండలేకపోతున్నారు. వైసీపీలో చేరిపోయేందుకు రెడీ అయ్యారు. పార్టీలో చేరితే ఎలాంటి పదవి దక్కదని రామసుబ్బారెడ్డికి తెలుసు. ఇప్పుడు శాసనమండలి కూడా రద్దయింది. అయినా వైసీపీలో చేరడానికి ప్రధాన కారణం ఆదినారాయణరెడ్డిని ఇంకా తన శత్రువుగానే రామసుబ్బారెడ్డి పరిగణిస్తున్నారని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి తిరిగి ఆదినారాయణరెడ్డి టీడీపీ గూటికి వస్తారని తెలిసే రామసుబ్బారెడ్డి వైసీపీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని చెబుతున్నారు. సో మళ్లీ జమ్మలమడుగులో ఆది వర్సెస్ రామనారాయణరెడ్డి వార్ ప్రారంభమవుతుందనేది వాస్తవం.

Tags:    

Similar News