ఉన్నా లేనట్లేగా.. ఊడబీకేయొచ్చుగా?

జనసేనకు ఒక్కగానొక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పూర్తిగా వైసీపీ పక్షాన చేరిపోయినట్లే. అయినా ఆయనపై చర్యలు తీసుకోవడానికి మాత్రం పవన్ కల్యాణ్ వెనకాడుతున్నారు. ఏడాది నుంచి రాపాక [more]

Update: 2020-12-14 15:30 GMT

జనసేనకు ఒక్కగానొక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పూర్తిగా వైసీపీ పక్షాన చేరిపోయినట్లే. అయినా ఆయనపై చర్యలు తీసుకోవడానికి మాత్రం పవన్ కల్యాణ్ వెనకాడుతున్నారు. ఏడాది నుంచి రాపాక వరప్రసాద్ జనసేన వైపు చూడటం లేదు. పార్టీ కార్యాలయానికి రావడం లేదు. పవన్ కల్యాణ్ ఇచ్చిన పార్టీ కార్యక్రమాలకు కూడా ఆయన స్పందించడం లేదు. తాను జనసేనలోనే లేనట్లు రాపాక వరప్రసాద్ వ్యవహరిస్తున్నారు.

చాలా రోజుల నుంచి…..

రాపాక వరప్రసాద్ పై చర్యలు తీసుకోవాలని రాజోలు జనసేన కార్యకర్తలు ఎప్పటి నుంచో డిమాండ్ చేశారు. రాపాక వరప్రసాద్ రాజోలు నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలను దగ్గరకు కూడా రానివ్వడం లేదు. ఆయన వైసీపీ కార్యకర్తలను మాత్రమే దగ్గరకు తీస్తున్నారు. ఒకరకంగా అనధికారికంగా రాపాక వరప్రసాద్ వైసీపీలో చేరిపోయినట్లే. ఇటీవలే రాపాక వరప్రసాద్ కుమారుడు జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు.

జగన్ ను పొగుడుతున్నా…..

ఒకవైపు జనసేన అధ్యక్షుడు రైతులకు నివర్ తుపాను నష్టపరిహారం చెల్లించాలంటూ మూడు జిల్లాలను పర్యటించి, దీక్షలకు దిగుతుంటే రాపాక వరప్రసాద్ మాత్రం జగన్ ను పొగడటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. జగన్ లాంటి ముఖ్యమంత్రి పది కాలాల పాటు ఉండాలని అసెంబ్లీలో సయితం ఆయన అన్నారు. దీంతో రాపాక వరప్రసాద్ పై సోషల్ మీడియాలో జనసైనికులు విరుచుకు పడుతున్నారు.

రాజోలు కార్యకర్తలు….

దమ్ముంటే రాజీనామా చేసి తిరిగి రాజోలులో వైసీపీ తరుపున పోటీ చేసి గెలవాలని ఛాలెంజ్ లు విసురుతున్నారు. అయితే దీనికి రాపాక వరప్రసాద్ నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. దీంతో ప్రభుత్వం కూడా రాపాక వరప్రసాద్ కు భద్రతను పెంచింది. అయితే ఇంత జరుగుతున్నా పవన్ కల్యాణ్ మాత్రం రాపాక వరప్రసాద్ పై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. కనీసం అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు కూడా ఫిర్యాదు చేయలేదు. పోనీ పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేయలేదు. ఇది పార్టీకి బాగా నష్టం కలిగిస్తుందని రెండు రోజుల క్రితం రాజోలు నియోజకవర్గం జనసేన కార్యకర్తలు పవన్ కల్యాణ‌్ ను కలసి వివరించారు. మరి ఇప్పటికైనా పవన్ కల్యాణ్ చర్యలకు దిగుతారో? లేదో? చూడాలి.

Tags:    

Similar News