కేసీఆర్ ను రేవంత్ డిఫెన్స్ లో పడేస్తున్నారా ?

టి కాంగ్రెస్ కొత్త బాస్ రేవంత్ రెడ్డి పార్టీని గాడిన పెట్టేందుకు గట్టిగానే వ్యూహాలు రూపొందిస్తున్నారు. దూకుడు కి పెట్టింది పేరైన రేవంత్ రెడ్డి రాజకీయాల్లో ఎత్తులకు [more]

;

Update: 2021-07-26 11:00 GMT

టి కాంగ్రెస్ కొత్త బాస్ రేవంత్ రెడ్డి పార్టీని గాడిన పెట్టేందుకు గట్టిగానే వ్యూహాలు రూపొందిస్తున్నారు. దూకుడు కి పెట్టింది పేరైన రేవంత్ రెడ్డి రాజకీయాల్లో ఎత్తులకు పై ఎత్తులు వేసేందుకు నిత్యం అప్ డేట్ గా ఉంటారు. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగులకు త్వరలో 50 వేల ఉద్యోగాలు అంటూ ప్రకటించారు. వెంటనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షా 90 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలిసిందే అంటూ రాజ్ భవన్ ముట్టడికి రేవంత్ రెడ్డి పిలుపు నిచ్చి గట్టి ఉద్యమమే చేశారు. ఆ తరువాత హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను టి సర్కార్ వేలం వేసింది. ఇందులో వెయ్యికోట్ల రూపాయల అవినీతి జరిగిందని కేంద్రం చర్యలు తీసుకోకపోతే గులాబీ తో కమలం అంతర్గత దోస్తీ ఉన్నట్లే అంటూ బాంబులు పేల్చారు రేవంత్ రెడ్డి.

దళిత బంధు పై …

హుజూరాబాద్ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించేందుకు కేసీఆర్ ఇటీవల దళితబంధు పథకం ప్రకటించారు. ఈ పథకానికి పైలెట్ ప్రాజెక్ట్ గా హుజురాబాద్ ను ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించారు ఆయన. దీని ప్రకారం హుజురాబాద్ లో 20 వేలమంది లబ్ధిదారులను ఎంపిక చేసి పదిలక్షల రూపాయల చొప్పున వారి ఆర్ధిక స్థితిగతిని మార్చే బృహత్తర యజ్ఞం మొదలు కాబోతున్నట్లు ప్రకటించి ప్రత్యర్థుల్లో గుబులు రేపారు గులాబీ బాస్. దీనిపై గత కొద్దిరోజులుగా తీవ్ర కసరత్తు చేసిన రేవంత్ రెడ్డి కేసీఆర్ ను డిఫెన్స్ లో పడేసే వ్యూహాన్ని ఇప్పుడు తెరపైకి తెచ్చేశారు.

రాష్ట్రం మొత్తం అమలు కోరుతూ …

జీహెచ్ ఎంసి ఎన్నికలకు ముందు వరద బాధితులకు పదివేలరూపాయలు అంటూ కేసీఆర్ ప్రకటించి మొత్తానికి ఆ ఎన్నికల్లో లబ్ది పొందారు. ఆ తరువాత ఆ పదివేలరూపాయలు ఫలితాల తరువాత లేకుండా పోయాయి. ఇదే తీరులో ఇప్పుడు దళితబంధు పథకాన్ని హుజురాబాద్ ఉపఎన్నిక వరకు వాడుకుని వదిలేస్తారని రేవంత్ రెడ్డి గట్టిగా ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం మొదలు పెట్టారు. అందుకోసం దళిత గిరిజన దండోరా పేరుతో వచ్చే ఆగస్టు 9 నుంచి సెప్టెంబర్ 17 వరకు రాష్ట్రం అంతా దళితబంధు అమలు చేయాలిసిందే అంటూ ఉద్యమానికి రేవంత్ శ్రీకారం చుడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా ఉన్న ఓటు బ్యాంక్ దళిత గిరిజనులే. తెలంగాణ లో వారు 30 శాతం వరకు ఉన్నట్లు రేవంత్ రెడ్డి చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు తమ పార్టీ ఓటు బ్యాంక్ ను గులాబీ పార్టీ కొల్లగొడితే కాంగ్రెస్ పరిస్థితి మరింత దిగజారుతుందన్నది హస్తం నేతల ఆందోళన. అందుకే ముందే కళ్ళు తెరిచి ఉద్యమం చేయకపోతే ఉనికే లేకుండా పోతామని కాంగ్రెస్ శ్రేణులను పరోక్షంగా హెచ్చరిస్తున్నారు రేవంత్ రెడ్డి. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి నుంచి ఉద్యమాన్ని మొదలు పెట్టి రాష్ట్రమంతా కొనసాగించాలన్నది తద్వారా అధికారపార్టీని ఉక్కిరిబిక్కిరి చేసి కేసీఆర్ ను డిఫెన్స్ లో పడేయాలన్నది రేవంత్ రెడ్డి ఎత్తుగడగా కనిపిస్తుంది.

ఇస్తావా … చస్తావా …

కేసీఆర్ ఏ స్కిం అమలు చేసినా అక్కడ ఎన్నికలు ఉండాలన్న పాయింట్ ను రేవంత్ రెడ్డి బలంగా ప్రతీ చోటా నొక్కి చెబుతున్నారు. అందుకే కొన్ని చోట్లే అమలు చేసే దళితబంధు వంటి పథకాల అమలు కోసం ఎమ్యెల్యేలను నిలదీయాలన్న పిలుపు ను ఇస్తున్నారు ఆయన. పథకం అమలు చేయండి లేదా చచ్చి ఉపఎన్నిక తీసుకురండి లేదా రాజీనామా చేసి ఉప ఎన్నిక తీసుకురండి అందువల్ల అనేక అభివృద్ధి కార్యక్రమాలు పథకాలు ఆ నియోజకవర్గాలకు చేరతాయని దళితులకు పదేసి లక్షల రూపాయలు అందుతాయని వినూత్న ప్రచారం మొదలు పెట్టేశారు రేవంత్ రెడ్డి. మరి ఈ ఉద్యమాలను కేసీఆర్ అండ్ టీం ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.

Tags:    

Similar News