సంచయిత డ్యూయల్ రోల్ ?

రాజకీయమే అలాంటిదేమో. ఒకసారి ఆ మహాసాగరంలో దూకేస్తే చాలు ఈత కొట్టడం అదే నేర్పుతుంది. అపుడు గండరగండలు, గజ ఈతగాళ్ళ అవసరం కూడా అసలు ఉండదు. ఆమెకు [more]

Update: 2020-08-07 13:30 GMT

రాజకీయమే అలాంటిదేమో. ఒకసారి ఆ మహాసాగరంలో దూకేస్తే చాలు ఈత కొట్టడం అదే నేర్పుతుంది. అపుడు గండరగండలు, గజ ఈతగాళ్ళ అవసరం కూడా అసలు ఉండదు. ఆమెకు రాజకీయం ఏం తెలుసు. ఆమెకు వ్యూహాలు ఏం తెలుసు అన్న నోళ్ళే మూతపడేలా పక్కా పాలిటిక్స్ చేస్తోంది. ఆమె ఎవరో కాదు, విజయనగరం పూసపాటి వారి మూడవ తరం రాజకీయం వారసురాలు సంచయిత గజపతిరాజు. ఆమె ఆనందగజపతిరాజు పెద్ద కుమార్తె. ఈ ఏడాది మార్చిలో అనూహ్యంగా మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ గానూ, అలాగే ఉత్తరాంధ్రాలో సుప్రసిధ్ధ పుణ్యక్షేత్రం అయిన సింహా చలం దేవస్థానం బోర్డు చైర్ పర్సన్ గానూ సంచయిత నియమితులయ్యారు. రాత్రికి రాత్రికి వైసీపీ సర్కార్ నియామక ఉత్తర్వులు ఇస్తే అంతే వేగంగా ఆమె బాధ్యతలు స్వీకరించి బాబాయ్, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుకు గట్టి షాక్ ఇచ్చేశారు.

చంద్రబాబుకే అలా….

అంతటితో ఆమె ఆగలేదుగా. రాజకీయాల్లో అర్ధ శతాబ్దం అనుభవానికి చేరువ అవుతున్న చంద్రబాబుకే సంచయిత కొత్త పాఠాలు చెప్పారు. పురుషాంకారంతోనే తనకు దక్కిన పదవిని విమర్శిస్తున్నారంటూ బాబుపైనే నిప్పులే చెరిగారు. మా సంస్థానం జోలికి రావద్దు, మా కుటుంబ రాజకీయాల గురించి అసలు మాట్లాడవద్దు అంటూ ఒక స్వీట్ వార్నింగు కూడా కొత్త పెత్తందారు హోదాలో బాబుకు ఇచ్చేశారు. మీ రాజకీయాలకు మా వంశం వాడుకోవాల్సిన అవసరం అంతకంటే లేదని కూడా సంచయిత నిప్పులే చెరిగారు. ఆ దెబ్బతో చంద్రబాబు మళ్లీ ట్వీట్ చేస్తే ఒట్టు అన్నట్లుగా సీన్ మారింది.

బీజేపీనా….?

ఇక ఇపుడు అసలు కధలోకి వ‌స్తే సంచయిత రేపో మాపో వైసీపీలో చేరుతారని, ఆమెనే 2024 ఎన్నికల్లో విజయనగరం నుంచి పోటీకి పెట్టి బాబాయ్ అశోక్ కి గట్టి షాక్ ఇద్దామనుకుంటున్న వైసీపీకే సంచయిత షాక్ ఇచ్చేశారు. తాను అచ్చమైన బీజేపీ నేతనేనని మరో మారు గుర్తుచేశారు. తన హక్కు ప్రకారమే చైర్ పర్సన్ పదవులు దక్కాయి తప్ప ఎవరి జాలి, దయాధర్మం కానేకాదని ఇండైరెక్ట్ గా వైసీపీకి కూడా అటాక్ ఇచ్చేశారు. ఇపుడున్న పరిస్థితుల్లో బీజేపీ ఏపీలో అభివృధ్ధి చెందాలని సంచయిత కోరుకోవడం కంటే సంచలనం వేరొకటి ఉంటుందా. అదే పని ఆమె చేశారు.

వీరావేశంతో ….

ఏపీ బీజేపీకి కొత్త కామందుగా సోము వీర్రాజు నియమితులు అయిన వేళ ఆయనకు విష్ చేస్తూ సంచయిత పెట్టిన ట్వీట్ ఇపుడు అన్ని రాజకీయ పార్టీలో చర్చకు తావిస్తోంది. వీర్రాజు రాకతో ఏపీ బీజేపీకి మంచి రోజులు వచ్చాయని ఇక మన పార్టీ ముందుకుపోతుందని కూడా ఆమె అనడం గమనార్హం. అంతే కాదు, సింహాద్రినాధుని ఆశీస్సులు సోము వీర్రాజు కు ఉంటాయని కూడా చెప్పుకున్నారు. జనసేనతో కలసి బీజేపీ విజయాలు అందుకుంటుందని సంచయిత కోరుకోవడం ద్వారా ప్రస్తుత వైసీపీకి తాను దూరమనే సంకేతాన్ని పంపించారు అంటున్నారు. ఇక అప్పట్లో సంచయిత బీజేవైఎం నాయకురాలు. ఆమె ఢిల్లీలోనే పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. సీనియర్ బీజేపీ నేతలతోనే ఆమెకు గట్టి పరిచయాలు ఉన్నాయి. ఇన్ని ఉన్నా కూడా సంచయిత నియామకాన్ని ఏపీ బీజేపీ నేతలే తప్పుపట్టారు. ఆమెను క్రిస్టియన్ గా కూడా ప్రచారం చేశారు. జగన్ సర్కార్ ఆమెను కోరి తెచ్చి మరీ పూసపాటి వంశంలో చిచ్చు పెట్టిందని మాజీ బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు వంటి వారు కూడా గట్టిగానే తగులుకున్నారు. అయితే ఇదంతా గతం. ఇపుడు కన్నాలక్ష్మీనారాయణ ప్లేస్ లో వీర్రాజు రావడంతో సంచయిత బీజేపీతో మంచి ప్లేస్ కోరుకుంటున్నారని అంటున్నారు. అంటే వైసీపీ మద్దతుతో పదవిని అనుభవిస్తూ ఇకపైన ఆమె బీజేపీ ద్వారా కొత్త రాజకీయం చేస్తారన్న మాట. ఇలా ఒక్క దెబ్బకు బీజేపీలోని ఒక వర్గంతో పాటు, టీడీపీ, వైసీపీలకు కూడా సంచయిత షాక్ ఇచ్చేశారు.

Tags:    

Similar News