వివాదాల సుడిలో సంచయిత ?

పూసపాటి వంశంలో మూడవ తరం ప్రతినిధిగా రంగ ప్రవేశం చేసిన సంచయిత గజపతిరాజు వరసగా తీసుకుంటున్న అనేక నిర్ణయాలు వివాదం అవుతున్నాయి. దాంతో ఆమెను టార్గెట్ చేయాలని [more]

Update: 2020-09-07 00:30 GMT

పూసపాటి వంశంలో మూడవ తరం ప్రతినిధిగా రంగ ప్రవేశం చేసిన సంచయిత గజపతిరాజు వరసగా తీసుకుంటున్న అనేక నిర్ణయాలు వివాదం అవుతున్నాయి. దాంతో ఆమెను టార్గెట్ చేయాలని చూస్తున్న వైరి వర్గానికి అడ్డంగా దొరికిపోతున్నారు. అనుభవలేమి. దూకుడు ఆమె పాలిట శాపంగా ఉన్నాయని అంటున్నారు. సంచయిత నియామకంతో గతంలో ఎన్నడూ చర్చకు రాని మాన్సాస్ ట్రస్ట్. సింహాచల దేవస్థానం ట్రస్ట్ కూడా ఇపుడు తరచూ మీడియాలో పతాక శీర్షికకు ఎక్కుతున్నాయి. ఆమె ఎవరి సలహాలు తీసుకుంటున్నారో తెలియదు కానీ అటు ఆస్థిక జనులు, ఇటు జనం కూడా నివ్వెరపోయేలా నిర్ణయాలు ఉంటున్నాయని అంటున్నారు.

ఉద్యోగాలు ఊడగొట్టేలా…

ఎవరైనా కొత్తవారు పాలనాధికారిగా వస్తే తమకు మరింత భరోసా లభిస్తుందని ఉద్యోగులు ఆశిస్తారు. అలాంటిది సంచయిత నియామకం తరువాత ఏకంగా 175 మంది దాకా సింహాచ‌లంలోని అవుట్ సోర్సెస్ సిబ్బందిని ఇంటికి పంపించేశారు. వారి సేవలు అవసరం లేదని చెప్పేశారు. ఏళ్ల తరబడి అప్పన్నను నమ్ముకున్న వారంతా ఈ ఘటనతో షాక్ తిన్నారు, బోరుమన్నారు. దీని మీద విపక్షాలు అల్లరల్లరి చేశాయి. వైసీపీ సర్కార్ ఇరుకున పడింది. దాంతో మంత్రి అవంతి శ్రీనివాస్ కలుగచేసుకుని మళ్ళీ కొత్త ఉత్తర్వు ఇప్పించి వారు బతుకు నిలబెట్టారు. అలా చైర్ పర్సన్ అయిన నెలలోనే వ్యతిరేకతను మూటకట్టుకున్న సంచయిత ఇపుడు మరో షాకింగ్ డెసిషన్ తీసుకున్నారుట.

ఆయనే సర్వంగా…..

గతంలో పీవీజీ రాజు, తరువాత ఆనందగజపతిరాజు, అశోక్ గజపతిరాజు వంటి వారు చైర్ పర్సన్లుగా పనిచేసినా వారే స్వయంగా పాలక మండలి పెద్దలుగా అన్ని వ్యవహారాలూ చూసేవారు. కానీ సంచయిత మాత్రం చెన్నై నుంచి తనకు కావాల్సిన మనిషిని ఒకరిని తెప్పించి గత మూడు నెలలుగా సింహాచలం అతిథి గృహంలో బస ఏర్పాటు చేయించారు. అంతే కాదు సింహాచలం వ్యవహారాలను ఆయన కంట్రోల్ లో పెట్టారు. ప్రతీ ఫైల్ ఆయనే చూడాలని కండిషన్ పెట్టారట. ఇంతకీ ఆయన హోదా ఏంటి అంటే ఓఎస్డీ అంటూ కొత్త పదవి క్రియేట్ చేసి నెలకు యాభై వేల జీతంతో కొలువు ఇచ్చేశారు. లాక్ డౌన్ తరువాత ఆలయ ఆదాయం దారుణంగా పడిపోయింది. ఇలా తెల్ల ఏనుగులను మేపడం అవసరమా అని ఆలయ వర్గాలు వ్యతిరేకిస్తున్నాయట.

ఉత్సవ విగ్రహమా…?

ప్రతిష్టాత్మకమైన సింహగిరి ఆలయానికి సీనియర్ మోస్ట్ దేవాదాయ అధికారి ఉంటారు. ఆయన చూడాల్సిన ఫైళ్ళు అన్నీ ఈ ప్రైవేట్ వ్యక్తి చేతిలో పెట్టి ఈవోను ఉత్సవ విగ్రహం చేశారన్న మాట వినిపిస్తోంది. దీంతో ఈ పరిణామాలతో షాక్ తిన్న ఈవోను తనకు ఈ పోస్ట్ వద్దు బదిలీ చేయమంటూ ప్రభుత్వానికి మొర పెట్టుకుంటున్నారుట. ఇక సంచయిత తాను అన్నీ అనుకున్న‌ట్లుగానే జరగాలని హుకుం జారీ చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ఈ పరిణామాలు గతంలో చూడలేదని ఆలయ సిబ్బంది అంటున్నారు. దేవుడికి ఒక రూపాయి ఆదాయం వచ్చేలా చూడాలి కానీ ఇలా దుర్వినియోగం మంచిది కాదని అంటున్నారు. అలాగే ఆలయ ప్రతిష్టను నిలబెట్టేలా సంచయిత పనిచేస్తే ఆమెకు ఉజ్వల భవిషత్తు ఉంటుందని అంటున్నారు. ఆమె మీద, అమె పని తీరు మీద వేయి కళ్ళునిఘా వేసి ఉన్నాయని, ఆ సంగతి తెలుసుకోకుండా అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందుల్లో పడడం ఖాయమని అంటున్నారు.

Tags:    

Similar News