సంచయిత అక్కడే సెటిల్ అవుతారట
ఆమె విజయనగరాన్ని పాలించిన ఘనమైన చరిత్ర కలిగిన పూసపాటి వారి వంశాంకురం. ఆమె మాజీ మంత్రి ఆనందగజపతిరాజు పెద్ద కుమార్తె. బీజేపీలో చేరి రాజకీయాల్లో కూడా చురుకుగా [more]
;
ఆమె విజయనగరాన్ని పాలించిన ఘనమైన చరిత్ర కలిగిన పూసపాటి వారి వంశాంకురం. ఆమె మాజీ మంత్రి ఆనందగజపతిరాజు పెద్ద కుమార్తె. బీజేపీలో చేరి రాజకీయాల్లో కూడా చురుకుగా [more]
ఆమె విజయనగరాన్ని పాలించిన ఘనమైన చరిత్ర కలిగిన పూసపాటి వారి వంశాంకురం. ఆమె మాజీ మంత్రి ఆనందగజపతిరాజు పెద్ద కుమార్తె. బీజేపీలో చేరి రాజకీయాల్లో కూడా చురుకుగా ఉంటున్న సంచయిత గజపతిరాజు మూడు నెలల క్రితం బాబాయ్, మాజీ మంత్రి, తెలుగుదేశం ప్రముఖుడు అశోక్ గజపతిరాజుకే గట్టి ఝలక్ ఇచ్చేసి ఏకంగా సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్ పర్సన్ గా, అలాగే, మాన్సాస్ చైర్ పర్సన్ గా నియమితులయ్యారు. ఆమె చేతికి పగ్గాలు రావడంతో రాజుల కోటలో అగ్గి రాజుకుంది. పూసపాటి వారి వంశంలో మూడవ తరం అరగేట్రం చేసి అనూహ్యంగా బాబాయ్ ని పాతతరంగా వెనక్కి నెట్టేసింది.
తండ్రి పేరుతో…
విజయనగరం సంస్థానాధీశుడు పీవీజీ రాజు పెద్ద కుమారుడుగా రాజకీయాల్లోకి వచ్చిన ఆనంద్ గజపతిరాజు మొదట్లో చురుకుగా ఉన్నా ఆ తరువాత ఆయన సైడ్ అయిపోయారు. కావాలనే ఆయన్ని పక్కన పెట్టారని అంటారు. ఇక తమ్ముడు అశోక్ రాజకీయం, లౌక్యం ముందు అన్నగారు వెలవెలబోయారని కూడా అంటారు. దాంతో ఆయన ఒకసారి మంత్రి, రెండు సార్లు ఎంపీతోనే రాజకీయ జీవితాన్ని అర్ధాంతరంగా ముగించాల్సివచ్చింది. ఇక ఆయన పేరు కూడా ఎక్కడా పెద్దగా వినిపించేది కాదు. అటువంటిది ఆయన కుమార్తెగా రంగంలోకి దిగిన సంచయిత తండ్రి పేరు నిలబెడతాను అంటున్నారు. తన తండ్రి ఆశలు, ఆశయాలు నెరవేరుస్తాను అని చెబుతున్నారు.
కీలకమే…?
మాన్సాస్ తొలి సర్వ సభ్య సమావేశంలో సంచయితగజపతి రాజు తాత పీవీజీ రాజుని, తండ్రి ఆనందగజపతిరాజుని మాత్రమే తలచుకున్నారు. వారి మాన్సాస్ కి చేసిన సేవలను ప్రశసించారు. మరీ ముఖ్యంగా తండ్రి ఆనంద్ మాన్సాస్ ద్వారా వైద్య కళాశాల ఏర్పాటుకు చేసిన కృషిని సంచయిత గుర్తుచేసుకున్నారు. ఆయన బాటలో నడుస్తానని ప్రమాణం చేశారు. ఇక విజయనగరంలోని మాన్సాస్ విద్యా సంస్థలను మరింతగా అభివృధ్ధి చేసి డీమ్డ్ యూనివర్శిటీ స్థాయికి తెస్తామని కూడా ఆమె చెప్పడం విశేషం. ఇవన్నీ ఎలా ఉన్నా తన తండ్రి తరువాత నాలుగేళ్ళూ మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా పనిచేసిన బాబాయ్ అశోక్ పేరు చెప్పకపోవడమే ఇపుడు పెద్ద చర్చగా ఉంది.
అదే మంత్రమా…?
ఇప్పటికీ విజయనగరం ప్రాంతంలో ఆనందగజపతి అంటే ఎంతో మంచి పేరు ఉంది. ఆయన పుట్టుక రాజు అయినా రుషిలా గడిపారు. పేదల పట్ల మంచి అభిమానం చూపించేవారు. ఆయన కూతురుగా ఎంట్రీ ఇచ్చిన సంచయిత ఒక ప్రణాళిక ప్రకారమే అడుగులు ముందుకువేస్తున్నారనుకోవాలి. తండ్రి పేరుని పదే పదే జపిస్తూ ఆయన ఆశయాలే తన లక్ష్యం అంటూ చెప్పడం ద్వారా సంచయిత విజయనగరం కోటలో పాగా వేయడానికి చూస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే సగం పని పూర్తి చేసిన ఆమె విజయనగరం కార్యక్షేత్రంగా రాజకీయ రంగంలోకి దిగాలనుకుంటున్నారా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. పలుమార్లు విజయనగరం ఎమ్మెల్యే సీటు గెలిచిన అశోక్ తన వారసురాలిగా కుమార్తె అదితి గజపతిరాజుని ముందుకు తెచ్చారు. ఇపుడు సంచయిత రంగంలోకి రావడంతో వచ్చే ఎన్నికల్లో ఆమె పోటీ ఖాయమని మాట వినిపిస్తోంది. ఆనంద్ వారసురాలిగా బరిలో దిగాలనుకుంటున్న సంచయిత బాబాయ్ కే సవాల్ చేసేలా ఉన్నారని అంటున్నారు. చూడాలి మరి ఈ రాజుల కోటలో యుధ్ధం ఎవరిని విజేతగా చేస్తుందో.