సంచయిత పాపాలను జగనే భరించాలిగా?

రాజుల కోటలో రహస్యాలు అనేకం ఉంటాయి. అవి వారి సొంత వ్యవహారం. అలాగే వదిలేయాలి కానీ కాదని ముందుకు వెళ్తే మాత్రం సెంటిమెంట్లతో చెలగాట ఆడడమే. విజయనగరం [more]

Update: 2020-12-25 15:30 GMT

రాజుల కోటలో రహస్యాలు అనేకం ఉంటాయి. అవి వారి సొంత వ్యవహారం. అలాగే వదిలేయాలి కానీ కాదని ముందుకు వెళ్తే మాత్రం సెంటిమెంట్లతో చెలగాట ఆడడమే. విజయనగరం మహరాజుల గురించి చరిత్రను అడిగితే తెలుస్తుంది. వారు తమ ఆస్తులను దానం చేశారే కానీ కబ్జా చేసే బాపతు కాదు. పూసపాటి వారికి సొంత విమానాలు స్వాతంత్రం వచ్చిన కొత్తలోనే ఉన్నాయంటే వారి దర్జా వైభవం గురించి వేరే చెప్పాలా. ఇపుడు అందరూ మంత్రులుగా ఉంటున్నారు. కానీ వారు ఎప్పటికీ వన్నె తరగని మహారాజులే కదా.

ఆమెకు మద్దతు ఇచ్చి….

విజయనగరం రాజులు అంటే పీవీజీ రాజు, ఆయన కుమారులనే జనం గుర్తుంచుకుంటారు. ఇక ఆనంద్ మొదటి వైవాహిక జీవితం విఫలం కావడం పట్ల కూడా జనంలో సానుభూతి ఉంది. మంచికి మారుపేరుగా ఉండే ఆనంద్ ఆ దెబ్బను తట్టుకోలేక రాజకీయాలు వదిలేసి ఆధ్యాత్మిక బాట పట్టారంటేనే అవతలి వారి మీద జనంలో కూడా ఎంతటి వ్యతిరేకత ఉంటుందో ఒక్కసారి ఆలోచించాలిగా. అయినా కూడా విడాకులు తీసేసుకున్న మొదటి భార్య సంతానంగా ముందుకు వచ్చిన సంచయిత గజపతిరాజును ముందు పెట్టి వైసీపీ రాజుల కోటలో రాజకీయానికి అగ్గి రాజేసింది.

పరిణతి లేదుగా…?

ఇక సంచయిత గజపతిరాజుకు పరిణతి లేదని ఆమె తీసుకుంటున్న అనేక నిర్ణయాలే తెలియచేస్తున్నాయి. వందల ఏళ్ల చరిత్ర కలిగిన విజయనగరం మహారాజా కళాశాలను సంచయిత ప్రైవేట్ పరం చేయాలనుకోవడం విజయనగరమే కాదు ఉత్తరాంధ్రావాసులను కలచివేసే చర్యగానే చూస్తారు. అంతే కాదు, ఆనంద్ అంటేనే నిండు వ్యక్తిత్వానికి మారు పేరు. ఆయన రెండవ పెళ్ళి చేసుకున్నా కూడా విడాకులు తీసుకున్న మొదటి భార్య విషయంలో పల్లెత్తి విమర్శ చేయలేదు, ఇక చివరి రోజుల్లో ఆయన వెంట ఉన్నది రెండవ భార్య సుధా గజపతిరాజు, ఆమె కుమార్తె మాత్రమే. మరి వారిని అవమానించడం ద్వారా సంచయిత జనాల్లో ఇప్పటికే కావాల్సినంత వ్యతిరేకత మూటకట్టుకున్నారు అన్న ప్రచారం ఉంది. ఇపుడు తాజాగా మాన్సాస్ కి చెందిన అయోధ్య మైదానానికి పూర్తిగా గేట్లు వేయించి బయటవారు రాకుండా సంచయిత ఆదేశాలు జారీ చేశారు. విజయన‌గరంలో ఉన్న ఏకైక అతి పెద్ద బహిరంగ స్థలం అదే. ఎన్నో సాంస్కృతిక, ఆధ్యాత్మిక రాజకీయ మీటింగులకు అదే వేదికగా ఉండేది. ఈ విషయంలో కూడా విజయన‌గరం ప్రజలంతా సంచయిత నిర్ణయాలను తప్పుపడుతున్నారు.

డ్యామేజ్ అవుతోందిగా…?

ఇక పూసపాటి కుటుంబీకుల్లో పెద్దాయనగా, విజయనగరం పురవాసులకు పూజ్యనీయుడిగా ఉన్న అశోక్ గజపతి రాజు మీద సంచయిత వరసబెట్టి విమర్శలు చేయడం ద్వారా కూడా ఇప్పటికే వ్యతిరేకత తెచ్చుకున్నారు. ఆమెను మాన్సాస్ చైర్ పర్సన్ ని చేయడం, సింహాచలం చైర్ పర్సన్ చేయడం ద్వారా వైసీపీయే ఈ మొత్తం శాపాలను, పాపాలను భరించాల్సివస్తోంది. సంచయిత చూస్తే వైసీపీ మెంబర్ కాదు, ఆమె అసలు వైసీపీ నేతలను కూడా ఎక్కడా లెక్కచేయడమే లేదు. ఇక ఇప్పటికీ బీజేపీలోనే కొనసాగుతున్నారు. కానీ జనాలు మాత్రం ఆమెను వైసీపీ మనిషిగా చూస్తూ ఫ్యాన్ పార్టీ మీద మండిపడుతున్నారు. ఇది చివరికి వైసీపీని రాజకీయంగా ఇబ్బందిపెట్టడం ఖాయమని అంటున్నారు. అశోక్ మీద ఏదో సాధిద్దామనుకుని సంచయితను పక్కన పెట్టుకున్న వైసీపీకి వ్రతం చెడి ఫలితం దక్కేలా కనిపించడంలేదు అంటున్నారు.

Tags:    

Similar News