వైసీపీలో మంత్రే టార్గెట్‌.. ఏం జ‌రిగిందంటే..?

అనంత‌పురం జిల్లా పెనుకొండ నియోజ‌క‌వ‌ర్గంలో మంత్రి టార్గెట్‌గా జిల్లా వైసీపీ నేత‌లు `పంచాయ‌తీ`లు చేస్తున్నారా ? అంటే.. ఔన‌నే అన్న మ్యాట‌రే ఇప్పుడు స్థానికంగా వినిపిస్తోంది. ఆది [more]

Update: 2021-03-06 06:30 GMT

అనంత‌పురం జిల్లా పెనుకొండ నియోజ‌క‌వ‌ర్గంలో మంత్రి టార్గెట్‌గా జిల్లా వైసీపీ నేత‌లు 'పంచాయ‌తీ'లు చేస్తున్నారా ? అంటే.. ఔన‌నే అన్న మ్యాట‌రే ఇప్పుడు స్థానికంగా వినిపిస్తోంది. ఆది నుంచి టీడీపీకి పెనుకొండ కంచుకోటగా ఉంటోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో త‌ప్ప.. ఆ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున ఎవరు పోటీచేసినా.. విజయం సాధించేవారు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున శంకరనారాయణ గెలుపొందారు. ప్రస్తుతం ఆయన రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. మంత్రి అయిన‌ప్పటికీ ఆయ‌న‌కు నియోజ‌క‌వ‌ర్గంలో చెప్పుకోద‌గ్గ గ్రిప్ ఇప్పటికీ దొర‌క‌లేదు. జిల్లా వైసీపీలో ఉన్న గ్రూపు త‌గాదాలు ఆయ‌న‌కు పెనుగొండ‌లో ఇబ్బందిగా మారాయి. మ‌రో మాట‌లో చెప్పాలంటే సొంత పార్టీలో ఆయ‌న ఎదుగుద‌ల‌ను జీర్ణించుకోలేని వారే పెనుగొండ‌లో చాప‌కింద నీరులా ఆయ‌న‌కు ఎర్త్ పెడుతోన్నారు.

కీలక నేతల అండదండలతోనే…?

దీంతో మంత్రి శంకరనారాయణకు ఇంటిపోరు ఇబ్బందికరంగా మారిందన్న అభిప్రాయం వైసీపీలోనే చ‌ర్చనీయాంశంగా మారింది. మంత్రి వ్యతిరేక వర్గీయులు పొరుగు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన‌ ఇద్దరు ఎమ్మెల్యేలతో సన్నిహితంగా మెలుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి ఎప్పుడు నియోజ‌క‌వ‌ర్గానికి వ‌చ్చినా.. ఏదో కార‌ణం చూపుతూ.. ఆయ‌న‌కు వ్యతిరేకంగా ధ‌ర్నాలు, రాస్తారోకోల‌ను ప్రోత్సహిస్తున్నార‌నే టాక్ కూడా ఉంది. ఇందుకు సొంత పార్టీకే చెందిన జిల్లా స్థాయి కీల‌క నేత‌ల అండ‌దండ‌లు కూడా స్థానికంగా మంత్రిని వ్యతిరేకించే వ‌ర్గం నేత‌ల‌కు ఉంటున్నాయ‌ట‌.

మంత్రి పదవి కోసమేనా?

అయితే.. ఇప్పుడు ఈ ప‌రిస్థితి పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు కూడా పాకింది. మంత్రి ఎంపిక చేసిన అభ్యర్థులతో పాటు.. పొరుగు నియోజ‌క‌వ‌ర్గాల‌కు చెందిన‌ ఇద్దరు ఎమ్మెల్యేలకు సన్నిహితంగా మెలుగుతున్న వర్గాలు రెబల్‌గా మారి నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు సంబంధించి.. తొలిరోజు నామినేషన్లలో పలు పంచాయతీల్లో ఈ పరిస్థితి కనిపించింది. వైసీపీలో ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు (మంత్రితో క‌లిపి) మధ్య విభేదాలు రోజురోజుకు ముదురుతున్నాయి. మ‌రో ఏడాదిలోనే మంత్రి వ‌ర్గంలో మార్పు ఉంటుంద‌ని జ‌గ‌న్ సంకేతాలు ఇవ్వడంతో త‌మ‌కు బెర్త్ క‌న్ఫర్మ్ చేసుకునేందుకు మంత్రికి సెగ పెడుతున్నార‌నే వాద‌న ఉంది.

పట్టు ఎలా నిలుపుకుంటారో?

ఈ నేప‌థ్యంలో ఇప్పుడు మంత్రికి వ్యతిరేకంగా ఆయ‌న సూచించిన అభ్యర్థుల‌పైనే రెబ‌ల్స్‌ను దింపార‌నే టాక్ పెనుకొండ‌లో భారీగా వినిపిస్తోంది. ఇదిలావుంటే.. వైసీపీలో ఏర్పడిన ఆధిప‌త్య పోరు.. మంత్రిపై వ్యతిరేక‌త వంటివి.. ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీకి కలిసొచ్చే అవకాశాలు క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వైసీపీలోనే ఒకే పంచాయ‌తీకి ఇద్దరు సర్పంచ్ ప‌ద‌వికి పోటీపడితే (వీరిలో మంత్రి సూచించిన వారు ఒక‌రు.. రెబ‌ల్ ఒక‌రు) టీడీపీకి లాభిస్తుందన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఇదే జ‌రిగితే.. జ‌గ‌న్ ద‌గ్గర మంత్రికి మార్కులు త‌గ్గి.. త‌మ‌కు మేలు జ‌రుగుతుంద‌ని పొరుగు నియోజ‌క‌వ‌ర్గాల ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. మ‌రి దీనిని మంత్రి ఎలా త‌ట్టుకుని పెనుగొండ‌లో త‌న ప‌ట్టు నిలుపుకుంటారో ? చూడాలి.

Tags:    

Similar News