వృద్ధ నేత‌లు.. స‌ల‌హాల‌కే ప‌రిమితం.. బోర్డు పెట్టలేదు కానీ?

ఏపీలో అధికార పార్టీ వైసీపీలో వృద్ధ నేత‌ల ప‌రిస్థితి ఏంటి ? వీరిని సీనియ‌ర్లుగా గుర్తించ‌డం లేదా ? ఎలాంటి కీల‌క ప‌ద‌వులు అప్పగించ‌డం లేదా అంటే.. [more]

;

Update: 2021-04-13 11:00 GMT

ఏపీలో అధికార పార్టీ వైసీపీలో వృద్ధ నేత‌ల ప‌రిస్థితి ఏంటి ? వీరిని సీనియ‌ర్లుగా గుర్తించ‌డం లేదా ? ఎలాంటి కీల‌క ప‌ద‌వులు అప్పగించ‌డం లేదా అంటే.. ఔన‌నే మాట‌లే వినిపిస్తున్నాయి. నిజానికి పార్టీ పెట్టిన నాటి నుంచి అంటే.. ఈ ప‌దేళ్ల కాలంలో.. పార్టీలో అనేక మంది సీనియ‌ర్లు చ‌క్రం తిప్పారు. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీకి అనుకూలంగా ప‌నిచేశారు. అయితే.. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో కొంద‌రికి టికెట్లు కూడా ఇవ్వకుండా … ప‌క్కన పెట్టారు. ప్రభుత్వం ఏర్పడిన త‌ర్వాత ప‌ద‌వులు ఇస్తామ‌న్నారు. అయితే.. ఇప్పటి వ‌ర‌కు వీరి ఊసు ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. దీంతో వీరిని ప‌క్కన పెట్టార‌ని.. అందుకే వీరిని ప‌ట్టించుకోవ‌డం లేద‌ని పెద్ద ఎత్తున పార్టీలో చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

టీడీపీకి భిన్నంగా…

మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి, దాడి వీర‌భ‌ద్రరావు, గాదె వెంక‌ట‌రెడ్డి.. ఇలా చాలా మంది సీనియ‌ర్లు వైసీపీలో ఉన్నారు. ఒక‌ర‌కంగా వీరితో వ‌య‌సుతో పోల్చుకుంటే.. ఇంకా ఒక‌టి రెండేళ్లు ఎక్కువ వ‌య‌సున్న వారు టీడీపీలో ఇంకా చ‌క్రం తిప్పుతున్నారు. కానీ, వైసీపీలో ఉన్న వారు మాత్రం ఎక్కడా క‌నిపించ‌డం లేదు. అంటే.. వీరి అవ‌స‌రం లేద‌ని జ‌గ‌న్ భావిస్తున్నారా ? లేక‌.. వృద్ధ త‌రాన్ని కేవ‌లం స‌ల‌హాలు, సూచ‌న‌ల వ‌ర‌కే ప‌రిమితం చేయాల‌ని అనుకున్నారా ? అనే విష‌యంలో ఇప్పటికీ క్లారిటీ లేదు. అయితే.. కొంద‌రికి మాత్రం ప‌ద‌వులు ఇచ్చారు. ఎన్నిక‌ల‌కు ముందు పార్టీలోకి వ‌చ్చిన రంగ‌నాథ‌రాజు, ప‌ర‌సా ర‌త్నం వంటివారికి మంత్రిగాను, మార్కెట్ యార్డు చైర్మన్‌గాను ప‌ద‌వులు ఇచ్చారు.

జగన్ పట్టించుకోక పోవడంతో…..

ఇక‌, ఇటీవ‌ల సీ రామచంద్రయ్యకు ఏకంగా ఎమ్మెల్సీ ఇచ్చారు. మ‌రి మిగిలిన వారి ప‌రిస్థితి ఏంటి ? వైసీపీ అధికారంలోకి వ‌స్తే..తమ‌కు ఏదైనా గుర్తింపు ఉంటుంద‌ని త‌ల‌పోసిన వారి ప‌రిస్థితి ఇప్పుడు అగ‌మ్య గోచ‌రంగా ఉంది. డీఎల్‌. ర‌వీంద్రారెడ్డి లాంటి వాళ్లు సైతం ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీకి స‌పోర్ట్ చేసి ఏదైనా గుర్తింపు ఉంటుంద‌న్న ఆశ‌తో ఉన్నారు. ఇలాంటి నేత‌ల లిస్ట్ చాలానే ఉన్నా జ‌గ‌న్ ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేదు. జ‌గ‌న్ పూర్తిగా యువ‌త‌రం నేత‌లు.. పూర్తిగా కొత్త ముఖాల‌నే ఎక్కువుగా న‌మ్ముకుంటున్నారు. దీంతో వృద్ధ‌త‌రం నేత‌ల గోడు ఎవ్వ‌రికి ప‌ట్ట‌డం లేదు.

నామినేటెడ్ పదవులైనా…?

మ‌రో మూడేళ్ల పాటు మాత్రమే ప్రభుత్వానికి గ‌డువు ఉండ‌డంతో ఏదైనా నామినేటెడ్ ప‌ద‌వి ఇచ్చినా సంతృప్తి వ్యక్తం చేస్తామ‌నే నాయ‌కులు వైసీపీలో క‌నిపిస్తున్నారు. పోనీ.. వారు ఇచ్చే స‌ల‌హాలు తీసుకుంటున్నారా? అంటే.. ఇప్పటికైతే.. ఎక్కడా అలాంటి సూచ‌న‌లు లేవు. మొత్తంగా చూస్తే.. వైసీపీ అధినేత చాలా వ్యూహాత్మకంగా పార్టీని వృద్ధ వాస‌న‌లు రాకుండా చూసుకుంటున్నార‌న‌డంలో సందేహం లేదు. ఒక్క పురుష నాయ‌కుల‌కే ఈ స‌మ‌స్య రాలేదు. చాలా మంది మ‌హిళా నాయ‌కుల‌కు కూడా పార్టీలో వృద్ధాప్య స‌మ‌స్యలు వున్నాయ‌ని అంటున్నారు సీనియ‌ర్లు. మ‌రి జ‌గ‌న్ వీరికి ఎలాంటి దారి చూపిస్తారో చూడాలి.

Tags:    

Similar News