విశాఖ..షాక్ ఇచ్చేస్తోందే ?

విశాఖపట్నం. ఏపీలో మహానగరం. మెట్రో సిటీ. వన్ అండ్ ఓన్లీ టైర్ వన్ సిటీ. అటువంటి విశాఖను గ్రోత్ ఇంజన్ గా జగన్ భావించారు. ఆయన కన్ను [more]

;

Update: 2020-07-06 02:00 GMT

విశాఖపట్నం. ఏపీలో మహానగరం. మెట్రో సిటీ. వన్ అండ్ ఓన్లీ టైర్ వన్ సిటీ. అటువంటి విశాఖను గ్రోత్ ఇంజన్ గా జగన్ భావించారు. ఆయన కన్ను ఇపుడు కాదు, 2014 నుంచి విశాఖ మీదనే ఉంది. ఇక జగన్ ముఖ్యమంత్రి కాకముందు నుంచే అనేక ప్రణాళికలు వేసుకున్నారు. అందులో విశాఖ రాజధాని ఒకటి. ఆ దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. అయితే ఆయనకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే అమరావతినే రాజధానిని చేయమని పట్టుబట్టి కూర్చుంది. రైతులకు మద్దతుగా ఉద్యమాలు చేయిస్తోంది. ఇక శాసనమండలి వేదికగా కూడా వికేంద్రీకరణ బిల్లులను అడ్డుకుంటోంది. ఇవన్నీ ఇలా ఉన్నా కూడా జగన్ దూకుడు ఎక్కడా ఆగడంలేదు.

అలా బ్రేకులు…..

మరో వైపు చూసుకుంటే పెను ప్రకృతి విపత్తుగా కరోనా ఉంది. అది ఎపుడు పోతుందో ఎవరికీ తెలియదు. లేకపోతే ఈపాటికి జగన్ విశాఖ రాజధానిని ఏర్పాటు చేసి ఉండేవారని వైసీపీ వర్గాలు అంటున్నాయి. ఇక విశాఖలో వరసగా జరుగుతున్న గ్యాస్ లీకేజి ప్రమాదాలు సైతం జగన్ కి మరో విధంగా బ్రేకులు వేస్తున్నాయి. మొన్న ఎల్జీ గ్యాస్ లీకేజి ఘటన జరిగింది. ఏకంగా పదిహేను మంది చనిపోయారు. వందలాది మంది బాధితులు అయ్యారు. ఇపుడు ఫార్మా సిటీలో మరో గ్యాస్ లీకేజి ప్రమాదం చోటు చేసుకుంది. ఇద్దరు అక్కడికక్కడ చనిపోయారు. దీంతో విశాఖ చుట్టూ మణిహారంలా ఉన్న పరిశ్రమల నుంచి ప్రమాదాలు ఎలా ముంచుకువస్తాయోనని జనంలో భయాలు ఉన్నాయి. వాటి మీద టీడీపీ రాజకీయం కూడా ఉంది.

సేఫ్ కాదా…?

విశాఖలో రాజధాని ఏర్పాటు చేయడం సురక్షితం కాదని మేధావులు కూడా అంటున్నారు. ఎందుకంటే విశాఖ భౌగోళిక స్వరూపం అందుకు సహకరించదని సూచిస్తున్నారు. విశాఖలో తూర్పు వైపుగా సముద్రం ఉంది. వెనక వైపుగా పచ్చని కొండలు ఉన్నాయి. సముద్రం నుంచి తరచూ తుఫానులు, సునామీలు వస్తాయని అపుడు వెనక్కి జరగాలంటే కొండలు అడ్డేస్తూంటాయని, దాంతో విశాఖ రెండింతలుగా చిక్కుకుని అవస్థలు పడుతుందని అంటున్నారు, ఇక విశాఖలో ఎల్జీ పాలిమార్స్ లాంటి ప్రమాదాలు కనుక భారీ ఎత్తున జరిగితే ప్రజలు తప్పించుకునేందుకు ఎక్కడా వీలు లేదని కూడా విశ్లేషిస్తున్నారు. నగరం మొత్తం భస్మీపటలం కావడానికి ఎంతో సేపు పట్టదని అంటున్నారు. విశాఖ నగరం మొత్తం ముప్పయి నుంచి నలభై కిలోమీటర్ల పరిధిలోనే ఉందని చెబుతున్నారు. ఇలా భౌగోళికంగా చూసుకుంటే విశాఖ సేఫ్ కాదని అంటున్నారు.

ఆయుధమేనా…?

విశాఖ రాజధాని వద్దు అని అన్నందుకు టీడీపీని ఇంతకాలం దోషిగా చూపిస్తూ వచ్చింది వైసీపీ. ఒక దశలో విశాఖకు రావడానికి చంద్రబాబు ప్రయత్నం చేస్తే ఆయన్ని విమానాశ్రయంలోనే ఉంచి గో బ్యాక్ బాబూ అంటూ వైసీపీ ఆందోళన చేసింది. ఇక ఇదే అంశాన్ని ముందు పెట్టుకుని జీవీఎంసీ ఎన్నికల్లో గెలవాలని కూడా వైసీపీ అస్త్రాలను సిధ్ధం చేసింది. అయితే అదిపుడు రివర్స్ అయ్యేలా ఉంది. వరస ప్రమాదాల సిటీ కాబట్టే తాము విశాఖ రాజధాని వద్దు అంటున్నామని, ఇది అనుభవంతో చెబుతున్నామని కూడా టీడీపీ తమ్ముళ్ళు అంటున్నారు. ఇక రాజధాని కనుక వస్తే మరిన్ని పరిశ్రమలు వస్తాయని, అపుడు ప్రశాంతత లేకుండా పోవడంతో పాటు, ప్రమాదాలకు అవకాశం ఉంటుందని జనాలకు చెప్పుకొస్తున్నారు. ఈ వాదనకు జనం మొగ్గితే మాత్రం విశాఖలో రాజధాని వద్దు అని జనమే అనే సీన్ ఉంటుంది. సరే ప్రజలు, రాజకీయాలు ఎలా ఉన్నా విశాఖ రాజధాని అన్న నాటి నుంచి ఒక్క అడుగూ ముందుకుపడకపోవడమే కాదు కదా, మరిన్ని అపశకునాలు వెంట రావడం పట్ల వైసీపీలోనే అంతర్మధనం జరుగుతోందిట. మరి చూడాలి వరస గ్యాస్ లీకేజి ఘటనల‌తో వైసీపీ కలలకే పెద్ద డ్యామేజి పడేలా ఉంది.

Tags:    

Similar News