ఫీట్లు చేస్తే రిస్క్ తప్పదు….పొడిచేస్తామనుకోవడం?
బీజేపీ ఆనందం ఇపుడు ఎలా ఉంది అంటే వచ్చే ఎన్నికల్లో ఏపీలో అధికారం తమదేనని ధీమాతో క్యాడర్ ఉంది. సోము వీర్రాజుని ఏపీ బీజేపీ పీఠం అప్పగించారు. [more]
బీజేపీ ఆనందం ఇపుడు ఎలా ఉంది అంటే వచ్చే ఎన్నికల్లో ఏపీలో అధికారం తమదేనని ధీమాతో క్యాడర్ ఉంది. సోము వీర్రాజుని ఏపీ బీజేపీ పీఠం అప్పగించారు. [more]
బీజేపీ ఆనందం ఇపుడు ఎలా ఉంది అంటే వచ్చే ఎన్నికల్లో ఏపీలో అధికారం తమదేనని ధీమాతో క్యాడర్ ఉంది. సోము వీర్రాజుని ఏపీ బీజేపీ పీఠం అప్పగించారు. అంతవరకూ కొంత మంచిపరిణామమే. కానీ ఇల్లు అలకగానే పండుగ కాదు కదా. పైగా సోము వీర్రాజు జనాకర్షణ నేత అంతకంటే కాదు. ఆయన మీడియా సమావేశాల్లో బాగా మాట్లాడగలరు, అన్నిటికీ మించి వీరావేశం వీర్రాజు బ్రాండ్. అదే ఇపుడు బీజేపీలో కొత్త ఆశలు కల్పించినట్లుగా ఉంది. కానీ బీజేపీ అంటే ఏపీలో తెలియని గ్రామాలు వేలల్లోనే ఉన్నాయి. బీజేపీ అంటే ఉత్తరాది పార్టీ అన్న ముద్ర ఎటూ ఉంది. ఇక బీజేపీ సిధ్ధాంతాలు సర్వజనామోదం కావు. అందుకే చాలా సెక్షన్లు ఆ పార్టీ ఇప్పటికీ దూరంగా ఉన్నాయి.
వారు రారుగా….
ఏపీలో ఎస్సీలు ఎక్కువగా ఉన్నారు. వారంతా బీజేపీతో ఎపుడూ కలసిరాలేదు. ఇక మైనారిటీలు కూడా గుంటూరు, కర్నూలు, కడప విశాఖ వంటి చోట్ల ఉన్నారు.వారు ఎపుడూ బీజేపీ వెంట నడవలేదు. బీసీల విషయం తీసుకున్నా అంతే. ఆ వర్గాలు బీజేపీలో ఇమడలేమని, అది అగ్ర వర్ణ పార్టీ అని భావిస్తారు. ప్రధానంగా రాజులు, వైశ్యులు, కాపులు, బ్రాహ్మణ సామాజిక వర్గాల్లో కొన్ని చోట్ల బీజేపీకి పలుకుబడి ఉంది. అలాగే వెంకయ్యనాయుడు, హరిబాబు వంటి వారి పుణ్యమాని కమ్మ వారు బీజేపీలో కొంత కనిపిస్తారు. ఇపుడు కాపుల చేతికి పగ్గాలు అందాయి. వారి సంఖ్య ఏపీలో దండీగానే ఉంది కాబట్టి ఆ వైపుగా నరుక్కురావడమే వీర్రాజు తక్షణ కర్తవ్యం.
అదే మైనస్…..
ఏపీలో ఎంత కాదనుకున్నా టీడీపీకి చంద్రబాబు వంటి సీనియర్ నేత సారధ్యం వహిస్తున్నారు. ఆయన పార్టీకి గట్టి పునాదులు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడినా కూడా 38 శాతం ఓట్ల షేర్ ని ఆ పార్టీ కొల్లగొట్టింది. ఇపుడు కూడా ఎంత తగ్గినా కూడా 30 శాతం ఓట్లూ అయినా ఆ పార్టీ సాధించడం ఖాయం. నాయకులు పార్టీ మారినా క్యాడర్ చెక్కుచెదరకపోవడం వల్లనే అది సాధ్యపడుతొంది. మరో వైపు వైసీపీకి చూస్తే జనాకర్షణ కలిగిన నేత జగన్ ఉన్నారు. ఆయన 50 శాతం ఓట్ల షేర్ ని 2019 ఎన్నికల్లో సాధించారు. ఇపుదు మరో అయిదు శాతం పెరిగింది అని సర్వేలు చెబుతున్నాయి. ఇపుడు బీజేపీ, జనసేన కూటమి ఏపీలో బలపడాలంటే కొత్తగా ఓటు బ్యాంక్ క్రియేట్ చేసుకోవాలి.
సాధ్యమా ….?
బీజేపీలో ఫలనా వారు ముఖ్యమంత్రి అభ్యర్ధి అని చెప్పకుండా ఎన్నికలకు వెళ్తే అసలుకే ఎసరువస్తుంది. ఇక పవన్ సీఎం అధ్యర్ధి అని చెబితే బీజేపీ నేతలకే నీరసం వస్తుంది. దాంతో సీఎం అభ్యర్ధి ఎవరు అన్నది తెలియకుండానే 2024 ఎన్నికలకు వెళ్ళాలేమో. ఇక బీజేపీకి 2024 ఎన్నికలు దేశంలోనే కత్తి మీద సామే మరి. పదేళ్ళుగా మోడీని చూసి మొహం మొత్తేసిన జనాలు అంతటా ఉంటారు. ఉత్తరాదినే బీజేపీకి డేంజర్ బెల్స్ మోగుతున్న స్థితి ఉంటుంది. ఇక దక్షిణాదిన అందునా ఏ మాత్రం పలుకుబడి లేని ఏపీ లాంటి చోట్ల ఫీట్లు చేస్తే రిస్క్ అవుతుందనే చెప్పాలి. ఇక బీజేపీ మీద ఏపీ జనాలకు కోపాలు అలాగే ఉన్నాయి. ప్రత్యేక హోదా ఇవ్వలేదు, విభజన హామీలు తీర్చలేదు, నిధులు కూడా సక్రమంగా విడుదల చేయకుండా వివక్ష చూపుతున్నారని చెడ్డపేరు ఎటూ ఉంది.
ఎన్ని కలలో…..
మరో వైపు పవన్ ని కూడా జనం ఇప్పటికే చూసేశారు. ఆయన నాయకత్వ లక్షణాలు, నిలకడలేని తత్వం అన్నీ కూడా జనం ముందు ఉన్నాయి. ఇవన్నీ పెట్టుకుని బీజేపీ జనసేన ఏపీలో ఏదో పొడిచేస్తుందని కలలు కంటే మాత్రం తప్పే అవుతుంది అంటున్నారు. ఏపీలో బీజేపీ బలపడాలి అంటే గ్లామర్ ఉన్న నాయకత్వం అవసరం. అంతే కాదు, పార్టీ మూల సిధ్ధాంతాల్లో మార్పు రావాలి. ఇక ప్రత్యేక హోదా లాంటివి ఇవ్వాలి. ఇక ఏపీలో ప్రధానంగా ఉన్న రెండు ప్రాంతీయ పార్టీలలో ఒకటి పూర్తిగా అదృశ్యం కావాలి. ఇవన్నీ జరగాలంటే ఎన్నేళ్ళు పడుతుందో ఎవరికి తెలుసు. మొత్తానికి కన్నా పోయి సోము వచ్చే ఢాం ఢాం ఢాం అని కాషాయం పార్టీ కార్యకర్తలు సంబరపడడానికే ఇది పనికివస్తుందన్న విశ్లేషణలు ఉన్నాయి.