‘స్టాండ్’ అండ్ సౌండ్ క్లియర్

నిజానికి ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతాపార్టీ ఓట్ల పరంగా అతి చిన్న పార్టీ. ఇప్పటికిప్పుడు తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందన్న అంచనాలు సైతం లేవు. అయినా ఆ పార్టీ [more]

Update: 2020-07-30 15:30 GMT

నిజానికి ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతాపార్టీ ఓట్ల పరంగా అతి చిన్న పార్టీ. ఇప్పటికిప్పుడు తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందన్న అంచనాలు సైతం లేవు. అయినా ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుని నియామకం రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చోపచర్చలకు దారి తీస్తోంది. రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలు దీనిని ఒక పెద్ద పరిణామంగా అనుకూల , ప్రతికూల పర్యవసానాలతో ముడిపెట్టుకుని వ్యాఖ్యానించుకొంటున్నాయి. టీడీపీ, వైసీపీలు రెండూ బీజేపీతో సాన్నిహిత్యంగా ఉండాలని కోరుకుంటున్న రాజకీయ పరిస్థితులే ఇందుకు కారణం. ఈ విషయంలో ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కీలకం కానున్నారు. అందుకే రెగ్యులర్ గా సాగే బీజేపీ అంతర్గత వ్యవహారానికి అత్యంత ప్రాధాన్యం తెచ్చి పెట్టారు. రెండేళ్లుగా పార్టీ అధ్యక్షునిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ స్థానంలో బీజేపీ హార్డ్ కోర్ క్యాడర్ కు చెందిన సోము వీర్రాజు పార్టీ పగ్గాలు చేపట్టారు. ఇద్దరివీ భిన్న నేపథ్యాలు కావడంతో వ్యవహార శైలి మొదలు వైసీపీ, టీడీపీలతో వారి సంబంధాల వరకూ చర్చకు తావిస్తున్నాయి.

టీడీపీకి సవాల్….

కన్నా లక్ష్మీనారాయణ సారథ్యంలో బీజేపీ వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయి ఆందోళనలకు శ్రీకారం చుట్టింది. కొన్ని సందర్భాల్లో ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ కంటే ఘాటుగా స్పందిస్తూ ప్రభుత్వాన్ని తూర్పారబట్టింది. 2019 ఎన్నికల్లో తీవ్రంగా దెబ్బతిని నైతిక స్థైర్యం కోల్పోయిన టీడీపీ పుంజుకోవడానికి కొన్నాళ్లు పట్టింది. ఈ గ్యాప్ లో ప్రతిపక్ష పాత్రను తాను చేజిక్కించుకోవడానికి బీజేపీ గట్టిగానే పని చేసింది. కన్నా లక్ష్మీనారాయణను వైసీపీ రాజకీయంగా టార్గెట్ చేయకతప్పని పరిస్థితి ఏర్పడింది. బీజేపీతో దూరం కావడం ఇష్టం లేని వైసీపీ అగ్రనాయకులు కన్నా లక్ష్మీనారాయణను, బీజేపీని వేరు చేసి చూపేందుకు ప్రయత్నించారు. తద్వారా కొంత మేరకు వైసీపీ సర్కారు కు ఉపశమనం కలిగించేందుకు యత్నించారు. ఈ మొత్తం నేపథ్యంలో కన్నాలక్ష్మీనారాయణ పోరాటం ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీకి రాజకీయ మద్దతు సమకూర్చి పెట్టింది. ప్రభుత్వ వ్యతిరేక పోరాట పంథాలో టీడీపీ, బీజేపీ ఒకటే అన్నంతగా ముద్ర పడింది.

సోముకు పగ్గాలు ఇవ్వడంతో…..

ఇప్పుడు సోము వీర్రాజు పగ్గాలు చేపట్టడంతో బీజేపీ శైలిలో మార్పు వస్తుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రధానంగా బీజేపీ చేపట్టే పోరాటాలు టీడీపీకి అడ్వాంటేజ్ గా మారకుండా సోము వీర్రాజు జాగ్రత్తలు తీసుకుంటారనేది పార్టీ వర్గాల భావన. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతాపార్టీ ఎదుగుదలకు వివిధ సందర్భాల్లో ఆటంకంగా పరిణమించారనేది సోము వీర్రాజు బలమైన విశ్వాసం. గతంలో స్వతంత్రంగా ఎదిగేందుకు అవకాశం ఉన్న ప్రతి సందర్భంలోనూ పొత్తు పేరిట టీడీపీ భారతీయ జనతాపార్టీని అణగదొక్కిందనేది ఆయన భావన. అందుకే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సైతం చంద్రబాబును తీవ్రంగా వ్యతిరేకించేవారు సోము వీర్రాజు. ఆయన రాష్ట్ర శాఖ పగ్గాలు చేపట్టడంతో తెలుగుదేశానికి గొంతులో వెలగకాయ పడ్డట్టే చెప్పుకోవాలి. బీజేపీ అధిష్ఠానంతో ఏదోరూపంలో మైత్రి బంధం ఏర్పాటు చేసుకోవాలని టీడీపీ భావిస్తున్న తరుణంలో తాజా నియామకం కచ్చితంగా ముందరి కాళ్లకు బంధం వేసే పరిణామమే. అందులోనూ పార్టీ పరంగా చూస్తే కన్నా లక్ష్మీనారాయణ కంటే సోము వీర్రాజు కు అగ్రనాయకత్వం వద్ద పరపతి ఎక్కువ. వైసీపీ సర్కారుపై పోరాటానికి అన్నిపార్టీలను ఏకతాటిపైకి తేవాలనుకుంటున్న టీడీపీ ఉద్దేశానికి, బీజేపీతో సాన్నిహిత్యం పెంచుకోవాలనుకుంటున్న భావనకు సైతం తాజా ఉదంతం ప్రతికూలమనే చెప్పాలి. తెలుగుదేశం పార్టీకి ఇది పరీక్షా కాలం.

వైసీపీకి కలిసొస్తుందా..?

కన్నా లక్ష్మీనారాయణ తీరుతో మింగలేక, కక్కలేక ఇబ్బంది పడిన వైసీపీ సోము వీర్రాజు నియామకంతో ఒక రకంగా ఊపిరి పీల్చుకుందనాలి. నిజానికి వైసీపీకి, బీజేపీ ప్రధాన ప్రత్యర్థి కాదు. పోటీదారు కాదు. కానీ బీజేపీ చేపడుతున్న ఉద్యమాలు, పోరాటాలు టీడీపీకి కలిసొస్తాయనే ఆందోళన వైసీపీని వెన్నాడుతోంది. పార్టీగా సొంతంగా ఎదగాలి. ప్రధాన ప్రతిపక్షం స్థానాన్ని ఆక్రమించాలని భావిస్తున్న బీజేపీ వైసీపీ సర్కారుపై పోరాటాన్ని ఆపుతుందనుకోలేం. అందులోనూ సైద్దాంతికంగా భావజాలంతో ఎదిగిన సోము వీర్రాజు కలిసొచ్చిన అవకాశాన్ని వదులుకుంటారనుకోలేం. ఇంతవరకూ టీడీపీ పట్ల కొంత మెతకవైఖరితో వ్యవహరించి, వైసీపీపై విరుచుకుపడిన బీజేపీ ఇకపై రెంటినీ లక్ష్యంగా చేసుకుంటూ పోరాటం సాగిస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలుగుదేశం హయాంలో జరిగిన అవినీతిపై కేంద్ర దర్యాప్తు కోరతామని సోము వీర్రాజు ప్రకటించడంలోని ఆంతర్యమిదే. సామాజిక సమీకరణ పరంగానూ, పార్టీ భావజాలపరంగానూ బలమైన నేపథ్యం ఉన్న సోము వీర్రాజు ఎంపికను పార్టీలోని వర్గాలు సైతం సంఘటితంగా స్వాగతిస్తున్నాయి. అదే సమయంలో టీడీపీ, వైసీపీలను వెన్నాడుతున్న కొన్ని బలహీనతలు బీజేపీ ఎదుగుదలకు కలిసొస్తాయనే అంచనాతో ఉంది ఆ పార్టీ అగ్రనాయకత్వం.

వెన్నాడుతున్న ప్రశ్నలు…

బీజేపీ నూతన సారథిని రాజకీయ ప్రశ్నలు వెంటాడుతున్నాయి. ప్రత్యేక హోదా ముగిసిన చరిత్ర అంటూ అధిష్టానం ఇప్పటికే తేల్చి చెప్పేసింది. ఆ విషయాన్ని పక్కనపెట్టినప్పటికీ పోలవరం, రైల్వే జోన్ వంటి విషయాల్లో నిర్దిష్టమైన కాలవ్యవధితో కూడిన ప్రణాళికను , నిధులను ఇవ్వాల్సి ఉంది. ఈ విషయంలో ఏ లోపం జరిగినా రాజకీయంగా బీజేపీనే మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. అమరావతి రాజధాని మార్పు వంటి వాటిపై రాష్ట్ర శాఖ ఇప్పటికే ఒక నిర్ణయం ప్రకటించింది. ఈ విషయంలో కేంద్ర నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం వైఖరుల్లో వ్యత్యాసాలు ఉన్నాయనేది వైసీపీ అంచనా. దీనిపై రానున్న రోజుల్లో స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రతిపక్షాన్ని బలహీనపరిచే ఎత్తుగడతో తాను బలపడటమా? అధికారపార్టీపై పోరాటంతో ప్రజల్లో పలుకుబడి పెంచుకోవడం ద్వారా బలపడటమా? అన్న విషయంలోనూ సుదీర్ఘ కార్యాచరణకూ బీజేపీ సిద్దం కావాల్సి ఉంటుంది. అందువల్ల ఆంధ్రప్రదేశ్ కమల సారథికి ముందున్నది కత్తిమీద సామే.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News