సోముకు…కత్తి మీద సాము ?

ఏపీ బీజేపీకి అధ్యక్షుడుగా సోము వీర్రాజు వచ్చారు. ఆయన నియామకం తరువాత ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో హడావుడి పెరిగింది. ఏదో జరిగిపోయినంత బిల్డప్ ని కూడా మీడియా [more]

;

Update: 2020-08-10 11:00 GMT

ఏపీ బీజేపీకి అధ్యక్షుడుగా సోము వీర్రాజు వచ్చారు. ఆయన నియామకం తరువాత ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో హడావుడి పెరిగింది. ఏదో జరిగిపోయినంత బిల్డప్ ని కూడా మీడియా ఇచ్చింది. వరసగా సోము వీర్రాజు ఇంటర్వ్యూల కోసం అంతా ఎగబడ్డారు. ఇంత జరిగాక ఇపుడు సోము వీర్రాజు సైలెంట్ అయిపోయారు. ఆయన సంబరం మూణ్ణాళ్ళ ముచ్చటేగా ఉంది. సోము వీర్రాజు మూడు రాజధానుల విషయంలో బీజేపీ వాయిస్ ని ఎటూ సరిగ్గా వినిపించలేక తటస్థంగా ఉంటున్నారు. అదే ఆయన మౌనానికి కారణం అంటున్నారు. రాజధాని అన్నది రాష్ట్రానికి సంబంధించిన అంశం అని సోము ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఆ తరువాత మళ్ళీ సౌండ్ లేదు, ఈలోగా టీడీపీ చేయాల్సిన రచ్చ అంతా చేస్తోంది. జనసేన కూడా రెండు రోజులు మీటింగులు అంటూ హడావుడి చేసి బీజేపీ లాగానే సైలెంట్ అంటోంది.

టార్గెట్ గా…..

ఇక పైకి బీజేపీని టీడీపీ డైరెక్ట్ గా విమర్శించడంలేదు కానీ అమరావతి రాజధాని జేయేసీ నేతలు బాగానే టార్గెట్ చేశారు. వారు గట్టిగానే విమర్శలు చేస్తూ వచ్చారు. ఇక కాంగ్రెస్, వామపక్షాలైతే బీజేపీని వదలడంలేదు. సీపీఐ నారాయణ బీజేపీని అమరావతి కేసులో ఏ టూ ముద్దాయిని చేసేశారు. ఇలా జగన్ తీసుకున్న నిర్ణయంతో ఏపీ బీజేపీ అనవసరంగా ముద్దాయి అయింది. చేయని నేరానికి అన్నట్లుగా టార్గెట్ అవుతోంది. విపక్షాలు అన్నీ కూడా జగన్ కంటే కూడా ఎక్కువగా బీజేపీని చీల్చిచెండాడుతున్నారు. ఈ పరిణామాలన్నీ కూడా సోము వీర్రాజు ఏపీ ప్రెసిడెంట్ కుర్చీ ఎక్కగానే సంభవించడంతో కొత్త అధినేత గుక్కతిప్పుకోలేకపోతున్నారు.

ముద్ర పడిందా …?

కన్నా లక్ష్మీనారాయణ మీద టీడీపీ అనుకూలుడు అన్న ముద్ర పడింది. ఆయన పదవి పోవడానికి అదే కారణం. మరి వస్తూనే సోము వీర్రాజు మీద వైసీపీ అనుకూల ముద్ర పడడం కాస్తా ఇబ్బంది కలిగించే అంశమేనని అంటున్నారు. ఇలా సోము వచ్చారు, అలా గవర్నర్ మూడు రాజధానుల బిల్లుపై అనుకూలంగా సంతకం చేశారు, ఇంకో వైపు చూస్తే కన్నాను తప్పించిందే ఇందుకు అన్నట్లుగా కూడా రాజకీయ విశ్లేషణలు వచ్చాయి. ఇక సోము వీర్రాజుకు ఎటూ చంద్రబాబుకు బద్ధ వ్యతిరేకి అన్న పేరు ఉంది. దానికి తోడు ఇపుడు జగన్ కి సన్నిహితుడు అన్న బ్రాండ్ పడితే ఆయన కూడా ఒకే వైపు ఉండిపోతారా ఏంటి అన్న డౌట్లు బీజేపీలో వస్తున్నాయట. దాంతో సోము వీర్రాజు సారధ్యానికి ఆదిలోనే హంసపాదులా వరస‌ పరిణామాలు సంభవించాయని అంటున్నారు.

బ్యాలన్స్ కష్టమే…..

వైసీపీకి జాతీయ స్థాయిలో బీజేపీతో మంచి రిలేషన్స్ ఉన్నాయి. మోడీ జగన్ ల మధ్య మంచి అవగాహన ఉంది. పైగా రాజ్యసభలో ఆరు సీట్లు ఉన్న వైసీపీ అవసరం బీజేపీకి చాలా ఉంది. అందువల్ల వారు జగన్ విషయంలో ఎపుడూ సాఫ్ట్ కార్నర్ తో ఉంటారు. కానీ ఏపీకి వచ్చేసరికి మాత్రం రాజకీయంగానే ముందుకు సాగమంటున్నారు. ఈ సమీకరణలు సరిగ్గా అర్ధం చేసుకోలేకనే కన్నా లక్ష్మీ నారాయణ బొక్క బోర్లా పడ్డారు. ఇపుడు సోము వీర్రాజు వంతు వచ్చింది. ఆయన జగన్ మీద ఎలా బాణాలు వేయాలి. ఎంత దూరం నుంచి వేయాలి, టీడీపీకి, వైసీపీకి సమదూరం అని మాటలు చెప్పినంత సులువు కాదు, జగన్ని గట్టిగా విమర్శిస్తే ఆయన పార్టీ వారు కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదు చేస్తారు, అలాగని మిన్నకుంటే ఏపీలో పార్టీ లైన్ మారుతోంది. దాంతో సోము వీర్రాజుకు ఏపీ రాజకీయాలు కత్తి మీద సాము అంటున్నారు. చూడాలి మరి ఫైర్ బ్రాండ్ ఎలా నెట్టుకువస్తారో.

Tags:    

Similar News