ఆవేదన… మరీ కామెడీ అయిపోయిందా

ప్రత్యేక హోదా ఏపీకి ఎందుకు ఇవ్వాలి. ఎందుకంటే అతి గంభీరమైన వాతావరణంలో భావోద్వేగాల మధ్యన ఉమ్మడి ఏపీని రెండుగా చీల్చాల్సివచ్చింది. ఏపీ ప్రజలకు సుతరామూ ఇష్టం లేని [more]

;

Update: 2019-08-10 08:00 GMT

ప్రత్యేక హోదా ఏపీకి ఎందుకు ఇవ్వాలి. ఎందుకంటే అతి గంభీరమైన వాతావరణంలో భావోద్వేగాల మధ్యన ఉమ్మడి ఏపీని రెండుగా చీల్చాల్సివచ్చింది. ఏపీ ప్రజలకు సుతరామూ ఇష్టం లేని పని అది. నాడు అధికారంలో ఉన్న వారు, రాజకీయ పార్టీలు నాయకులు అంధ్ర ప్రజల మనోభావాలను పూర్తిగా ఢిల్లీ పెద్దలకు అనువదించలేకపోయారు కానీ ఏపీ జనం మాత్రం నాడు ఒక్కొక్కరూ మండే అగ్నిగోళాలే. ఎవరిని కదిపినా ఏదో మోసపోయామన్న బాధ. ఆవేదన. బంగారం లాంటి హైదరాబాద్ ని కాకుండా చేశారని ఆక్రందన, అరవయ్యేళ్ళ అనుబంధాన్ని ఒక్క దెబ్బతో చిత్తు చేశారన్న ఆవేదన. ఇది కదా 2014 ఫిబ్రవరి నాటికి ఏపీలో ఉన్న వాతావరణం. దాన్ని చూసిన తరువాతనే కేంద్రంలోని యూపీయే సర్కార్ మరీ దారుణంగా ముందుకెళ్తే ఏపీ ప్రజలతో పాటు, దేశానికి కూడా అతి పెద్ద విలన్లు గా అవుతామన్న భయంతో అప్పటికపుడు తీసుకున్న నిర్ణయమే ప్రత్యేక హోదా.

న్యాయం కూడా ఉంది….

దేశంలో ఇప్పటివరకూ విభజించిన ప్రాంతాలు అన్నీ కూడా రాజధాని లేకుండానే కొత్తగా ఇచ్చారు. ఒక్క తెలంగాణాలో మాత్రమే హైదరాబాద్ ని కలిపి ఇచ్చారు. ఇక్కడ పాత రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ ఆ విధంగా కొత్త రాష్ట్రం అయింది. మళ్ళీ కధ మొదటికి వచ్చింది. రాజధాని నుంచి నిర్మించుకోవడం అంటే ఆషామాషీ వ్యవహారం కానే కాదు. నిజానికి ఒక రాష్ట్రం అభివృధ్ధి చెందాలంటే రాజధాని చాలా అవసరం. మొత్తం ఖజానాకు చేరే నిధులలో అరవై శాతం పైగా ఒక్క రాజధాని నుంచే సమకూరుతుంది. మరి అటువంటి రాజధాని ఏపీకి లేదు. కనీసం హైదరాబాద్ తో సరిసాటి కాదు కదా మహానగరం అని చెప్పుకునేది ఏదైనా ఉందా అంటే విశాఖ తప్ప మరోటి కనబడదు, ఇక విజయవాడ ఇరుకు రోడ్ల కధ అందరికీ తెలిసిందే, మిగిలిన వన్నీ సెకండ్ టైర్ సిటీస్. అందువల్ల ఏపీ మళ్ళీ పూర్వ వైభవం కాదు కానీ కొంతవరకైనా నిలబడాలి అంటే ప్రత్యేక హోదా అవసరం. నైతికంగా చూసినా కూడా కరెక్ట్ అయిన డిమాండ్ ఇది.

కమల విలాసం…

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మొక్కుబడిగా చెప్పేసి పాత యూపేయే గద్దె దిగిపోతే తరువాత వచ్చిన మోదీ సర్కార్ మేము అది అసలు పట్టించుకోనక్కర‌లేదు అన్నట్లుగా హోదా ఫైల్ ని చెత్తబుట్టలోకి విసిరేసింది. ఇక చంద్రబాబు పదేళ్ళ తరువాత అధికారంలోకి వచ్చిన ఆనందంలో బీజేపీ పెద్దల స్పెషల్ ప్యాకేజికి సరేననేశారు. అటు ప్యాకేజీ లేదు, ఇటు హోదా రాదు. ఇలా అయిదేళ్ళుగా బీజేపీ ఏపీతో ఆడుకుంటోంది. జనంలో గెలవలేని కొంతమంది బీజేపీ నాయకులు ప్రతీ రోజూ ఏపీలో మీడియా పులులైపోతారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వం అంటూ గట్టిగా దబాయిస్తూ మాట్లాడుతారు.

బాబుకు చెప్పిందేనట…

తాజాగా జగన్ ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీ వెళ్ళి హోదా ఇవ్వమని వినతిపత్రం కేంద్ర మంత్రులకు, అమిత్ షాకు ఇచ్చారు. జగన్ ఇలా విమానం దిగారో లేదో కానీ అలా రాజ్య స‌భ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మీడియా ముందుకొచ్చేశారు. చంద్రబాబుకు ఏమి చెప్పామో జగన్ కి అదే చెబుతున్నాం. హోదా ఇవ్వం అంతే అంటున్నారు. అసలు బాబు, జగన్ ని పక్కన పెట్టండి ఏపీ ప్రజలకు బీజేపీ ఇచ్చే సమాధానం ఇదేనా. ప్రజల ఓట్లు కావాలి కానీ వారి మనోభావాలు అక్కరలేదా అంటున్నారు జనం. ఎవరిని అడిగి ఏపీని విభజించారు, మరి హోదా ఎందుకు ఇవ్వరు, సీరియస్ డిమాండ్ ని సిల్లీ నాయకులు మీడియా ముందు చేరి మరీ కామెడీ చేసేస్తూంటే ఆంధ్ర జనం ఉడికిపోతున్నారుగా.

Tags:    

Similar News