ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్‌.. ఇద్దరికీ మంత్రి పదవి కావాల‌ట

ఇది చాలా విచిత్రమైన రాజ‌కీయం.. వారిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్‌.. ఏపీ సీఎం జ‌గ‌న్ సొంత జిల్లాకు చెందిన వైసీపీ సీనియ‌ర్ నేత‌లు. వారు ఒక్కొక్కరు ఏకంగా నాలుగు [more]

Update: 2021-08-13 03:30 GMT

ఇది చాలా విచిత్రమైన రాజ‌కీయం.. వారిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్‌.. ఏపీ సీఎం జ‌గ‌న్ సొంత జిల్లాకు చెందిన వైసీపీ సీనియ‌ర్ నేత‌లు. వారు ఒక్కొక్కరు ఏకంగా నాలుగు సార్లు ఎమ్మెల్యేలు అయ్యారు. పైగా జ‌గ‌న్ సోనియాగాంధీని క‌లిసి బ‌య‌ట‌కు వ‌చ్చి కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నాన‌ని చెప్పిన‌ప్పుడు ప‌క్కన వారిద్దరే ఉన్నారు. క్షణం ఆలోచించ‌కుండా వారు వెంట‌నే జ‌గ‌న్‌తో పాటు త‌మ ఎమ్మెల్యే ప‌ద‌వులు వ‌దులుకుని… కాంగ్రెస్ నుంచి జ‌గ‌న్‌తో పాటే బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. ఉప ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి భారీ మెజార్టీతో గెలిచి వైసీపీ తొలి బ్యాచ్‌ ఎమ్మెల్యేలు అయ్యారు. గ‌త ఎన్నిక‌ల్లో త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల నుంచి నాలుగోసారి గెలిచిన ఆ ఇద్దరికి మంత్రి ప‌ద‌వులు ద‌క్కలేదు. ఇక త్వర‌లో జ‌రిగే మంత్రి వ‌ర్గ విస్తర‌ణ‌లో ఇద్దరు నేత‌లు కూడా త‌మ‌కే మంత్రి ప‌ద‌వులు వ‌స్తాయ‌ని చెప్పుకుంటున్నార‌ట‌. లోప‌ల కాస్త ఆందోళ‌న‌గా ఉన్నా.. పైకి మాత్రం డాంబికం పోతూ మంత్రి ప‌ద‌వి నాదే అని చెప్పుకుంటున్నార‌ట‌. పైగా వారిద్దరి నియోజ‌క‌వ‌ర్గాలు కూడా ప‌క్కప‌క్కనే ఉన్నాయి.

వైసీపీకి నమ్మకంగా…..

ఈ ఇద్దరు నేత‌లు ఎవ‌రో కాదు.. క‌డ‌ప జిల్లా రైల్వేకోడూరు, రాయ‌చోటి ఎమ్మెల్యేలు కొరుముట్ల శ్రీనివాసులు, విప్ శ్రీకాంత్ రెడ్డి. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు జ‌గ‌న్‌కు ఎంతో స‌న్నిహితులు.. 2009లో కాంగ్రెస్ నుంచి గెలిచిన వీరు.. 2012 ఉప ఎన్నిక‌, 2014, 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. వీరిద్దరు కూడా మంత్రి ప‌ద‌వికి అర్హులే. అయితే తొలి ట‌ర్మ్‌లో అనేక స‌మీక‌ర‌ణ‌లు వీరికి మంత్రి ప‌ద‌విని దూరం చేశాయి. కొరుముట్ల ఎస్సీ ఎమ్మెల్యేల్లో సీనియ‌ర్‌. అయితే సీఎం సొంత జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కావ‌డం.. పైగా మైనార్టీ కోటాలో ఇదే జిల్లా నుంచి అంజాద్ బాషాకు మంత్రి ప‌ద‌వి రావ‌డంతో కొరుముట్లకు మంత్రి ప‌ద‌వి రాలేదు.

సీఎం ఆఫీస్ నుంచి?

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి వ‌ర్గం ఏర్పడ‌డానికి రెండు రోజుల ముందు సీఎం ఆఫీస్ నుంచి ఆయ‌న‌కు కాల్ కూడా వ‌చ్చింది. పైగా ఎస్సీ వ‌ర్గం నుంచి ఐదుగురిని మంత్రులుగా తీసుకున్నా కొరుముట్లకు చివ‌రి వ‌ర‌కు మంత్రి ప‌ద‌వి ఊరించి ఊరించి ఊసురోమ‌నిపించింది. ఈ సారి ఈ వ‌ర్గం మంత్రుల్లో మూడు నుంచి న‌లుగురు అవుట్ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయ‌న్న ప్రచారం నేప‌థ్యంలో కొరుముట్ల త‌న‌కు ఖ‌చ్చితంగా మంత్రి ప‌ద‌వి ఖాయ‌మ‌నుకుంటున్నారు. ఇక రాయ‌చోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి జ‌గ‌న్‌కు ఎంత స‌న్నిహితుడో ప్రత్యేకంగా చెప్పక్క‌ర్లేదు. శ్రీకాంత్ రెడ్డికి మంత్రి ప‌ద‌వి రాక‌పోవ‌డానికి ఖ‌చ్చితంగా ఆయ‌న సామాజిక వ‌ర్గమే కార‌ణం.

ఎవరికి చాన్స్ ఉందో?

అయితే వైసీపీ అధినేత జ‌గ‌న్ ఆయ‌న్ను వ‌దులుకోలేక విప్ ప‌ద‌వి ఇచ్చారు. ఆ త‌ర్వాత కూడా ముఖ్యమంత్రి, శ్రీకాంత్ రెడ్డి మ‌ధ్య ఏదో గ్యాప్ ఉంద‌న్న ప్రచారం కూడా జ‌రిగింది. గ‌త యేడాది కాలంగా ఆయ‌న పెద్ద యాక్టివ్‌గా కూడా లేరు. ఈ సారి అయినా త‌న‌కు మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌న్న ఆశ ఆయ‌న‌లో ఉంది. లోప‌ల టెన్షన్ ఉన్నా పైకి మాత్రం ప్రచారం చేసుకుంటున్నారు. ఇలా ప‌క్క నియోజ‌క‌వ‌ర్గాల‌కు చెందిన ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయిన ఎమ్మెల్యేల ఆశ‌ల్లో ఎవ‌రి ఆశ‌లు ఎలా నెర‌వేర‌తాయో ? చూడాలి. స‌మీక‌ర‌ణ‌లు చూస్తే శ్రీకాంత్ రెడ్డి కంటే కూడా శ్రీనివాసుల‌కే ఎక్కువ ఛాన్సులు ఉన్నట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News