టీడీపీపై మాజీ ఎమ్మెల్యే గుస్సా.. సైకిల్ దిగుతారా? ఉంటారా…?

ఇప్పటికే తీవ్ర ఇర‌కాటంలో ఉన్న టీడీపీకి మ‌రో చేదు వార్త వినిపించ‌నుందా ? అంటే ఔన‌నే అంటున్నారు చిత్తూరు జిల్లా నాయ‌కులు. ముఖ్యంగా తిరుప‌తి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం [more]

;

Update: 2020-03-20 08:00 GMT

ఇప్పటికే తీవ్ర ఇర‌కాటంలో ఉన్న టీడీపీకి మ‌రో చేదు వార్త వినిపించ‌నుందా ? అంటే ఔన‌నే అంటున్నారు చిత్తూరు జిల్లా నాయ‌కులు. ముఖ్యంగా తిరుప‌తి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జ్‌గా ఉన్న సుగుణ‌మ్మ విష‌యంలో నాయ‌కులు అంద‌రూ త‌లో మాట అంటున్నారు. 2014లో మున్నూరు వెంక‌ట‌ర‌మ‌ణ టీడీపీ త‌ర‌పున ఇక్కడ నుంచి విజ‌యం సాధించారు. త‌ర్వాత ఆయ‌న అనారోగ్యంతో మ‌ర‌ణించ‌డంతో 2015లో జ‌రిగిన ఉప పోరులో ఆయ‌న స‌తీమ‌ణి సుగుణ‌మ్మ పోటీ చేసి విజ‌యం సాధించారు. ఆ ఎన్నిక‌ల్లో సుగుణ‌మ్మ ఏకంగా 1.05 ల‌క్షల ఓట్ల మెజార్టీతో ఘ‌న‌విజ‌యం సాధించి రికార్డులు బ‌ద్దలు కొట్టారు. అప్పటి నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ఆమె.. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసిన కేవ‌లం 7 వంద‌ల ఓట్ల తేడాతో ప‌రాజ‌యం పాల‌య్యారు.

పట్టించుకోక పోతుండటంతో….

ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నప్పటికీ ఓట‌మి త‌ర్వాత త‌న‌కు ప్రాధాన్యం లేకుండా పోయింద‌ని ప‌లుమార్లు ఆమె పార్టీ అంత‌ర్గత స మావేశాల్లో త‌న ఆవేద‌న‌ను వెల్లడించారు. అయితే, ఈ విష‌యాన్ని చంద్రబాబు లైట్‌గా తీసుకున్నారు. పైగా ఆమెకు వ్యతిరేకంగా కూడా ఇక్కడ గ్రూపు రాజకీయాలు న‌డుస్తున్నా చంద్రబాబు ప‌ట్టించుకోలేదు. ఈ నేప‌థ్యంలో సుగుణమ్మ పార్టీపై కొంత అసంతృప్తితోనే ఉన్నారు. అయితే, ఇప్పుడు మ‌రింత‌గా పార్టీ నుంచి ఆమెకు ఇబ్బందిక‌ర ప‌రిణామాలు ఎదుర‌య్యాయ‌ని అంటున్నారు. దీనికి ప్రధాన కార‌ణం మేయ‌ర్ పీఠ‌మేన‌ని తెలిసింది. విష‌యంలోకి వెళ్తే.. తిరుపతి మేయర్‌ అభ్యర్థిగా టీడీపీ తరఫున తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు శ్రీధర్‌వర్మ సతీమణి జోత్స్న పేరును ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.

మొదటి నుంచి సేవ చేస్తున్న….

వాస్తవానికి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా మాజీ చైర్మన్‌ నరసింహయాదవ్‌ తమ కుటుంబం నుంచి ఒకరిని మేయర్‌ అభ్యర్థిగా ప్రకటించమని పార్టీ అధిష్టానాన్ని అడినట్లు తెలిసింది. మ‌రీ ముఖ్యంగా సుగుణ‌మ్మ ఈ విష‌యంలో ప‌ట్టుబ‌ట్టార‌ని స‌మాచారం. అయితే, ఈ విష‌యంలో చంద్రబాబు సుగుణ‌మ్మ అభ్యర్థనను క‌నీసం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోక‌పోవ‌డంతో ఆమె గ‌డిచిన వారం రోజులుగా మౌనంగా ఉంటున్నారు. ఇక‌, మేయ‌ర్ పీఠం ఖ‌రారైంద‌ని భావిస్తున్న జ్యోత్స్న హుషారుగా ప‌నిచేసుకుంటున్నారు. కాగా, శ్రీధర్‌వర్మ, ఆయన తండ్రి ఎన్టీఆర్‌ రాజు పార్టీకి మొదటి నుంచి సేవ చేస్తున్నారు.

పార్టీ వీడే యోచనలో…..

ఇదిలా ఉంటే మొన్నటి వరకు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మనుమరాలికి ఇప్పించాలని, మరోవైపు మహిళా విభాగం అధ్యక్షురాలు పుష్పావతి ఆశించారు. అయితే, సుగుణ‌మ్మ ప్రయ‌త్నాలు ఫ‌లించ‌లేదు. దీంతో ఆమె పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేయాల‌ని భావిస్తున్నట్టు తెలిసింది. ఆమె రాక‌కు ప్రస్తుత ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి కూడా అభ్యంత‌రం చెప్పక‌పోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఇదే జ‌రిగితే.. టీడీపీలో మ‌రో వికెట్ ప‌డ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక ఏపీ టీడీపీలో ఇప్పటికే ప‌డుతోన్న వ‌రుస వికెట్ల నేప‌థ్యంలో ఈ మాజీ ఎమ్మెల్యే సుగుణ‌మ్మ సైకిల్ దిగితే పెద్ద ఆశ్చర్య ప‌డాల్సిన ప‌నిలేదు.

Tags:    

Similar News