కొత్తల్లో అంతేగా … అంతేగా?

కొత్త బిచ్చగాడు పొద్దెరడగని ఒక సామెత ఉంది. తెలంగాణ కాంగ్రెస్ కు ఇన్ ఛార్జులుగా వచ్చిన వారు కూడా ఇదే టైపు అని చెప్పక తప్పదు. తెలంగాణాలో [more]

;

Update: 2020-10-01 11:00 GMT

కొత్త బిచ్చగాడు పొద్దెరడగని ఒక సామెత ఉంది. తెలంగాణ కాంగ్రెస్ కు ఇన్ ఛార్జులుగా వచ్చిన వారు కూడా ఇదే టైపు అని చెప్పక తప్పదు. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ ఇప్పట్లో కోలుకునే పరిస్థిితి కన్పించడం లేదు. అయినా అధిష్టానం ఒక ప్రయోగం చేసింది. పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జిగా కుంతియాను తప్పించి మాణికం ఠాకూర్ ను నియమించింది. ఈయన పొరుగున ఉన్న తమిళనాడుకు చెందిన వారే. ఈయన వల్ల పార్టీ బాగుపడుతుందా? లేదా? అన్నది పక్కనపెడితే కొత్తగా నియమితులైన ఇన్ ఛార్జిలు ఎవరైనా హెచ్చరికలు జారీ చేస్తారు. అలాగే మాణికం ఠాకూర్ కూడా నేతలకు వార్నింగ్ ఇచ్చారు.

వార్నింగ్ లపైన వార్నింగ్ లు…..

కుంతియా కూడా కొత్తల్లో అలాగే వార్నింగ్ ఇచ్చారు. తర్వాత కొందరికి సరెండర్ అయ్యారు. ఇప్పుడు మాణికం ఠాకూర్ కూడా అదే రకమైన వార్నింగ్ లు ఇస్తున్నారు. అందరూ కలసి పనిచేయాలని హితవాక్యాలు చెబుతున్నారు. అందరూ సమన్వయంతో పనిచేయకుంటే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ప్రతి వారం ఒక మీటింగ్ అని మాణికం ఠాకూర్ హడలెత్తిస్తున్నారు. పార్టీ బాధ్యతలను అప్పగించిన కొద్ది కాలంలోనే నాలుగైదు వీడియో కాన్ఫరెన్స్ లను మాణికం ఠాకూర్ ఏర్పాటు చేశారు.

క్లాసు పీకుతూ…..

ప్రధానంగా మాణికం ఠాకూర్ ప్రతి సమావేశంలోనూ క్రమశిక్షణపై క్లాసులు పీకుతున్నారట. ఎవరుపడితే వారు ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదని చెబుతున్నారు. వ్యక్తిగత అజెండాలు మానేసి పార్టీని బలోపేతం చేయడానికి పనిచేయాలని, పనితీరు ఆధారంగానే పార్టీలో పదవులు దక్కుతాయని మాణికం ఠాకూర్ క్లారిటీ ఇచ్చారట. ప్రతి పదిహేను రోజులకు ఒకసారి కోర్ కమిటీ సమావేశం జరగాలని ఆదేశించారు.

లైట్ అంటున్న నేతలు….

అయితే మాణికం ఠాకూర్ కు ఒక విష‍యం తెలియడం లేదు. ఇక్కడి కాంగ్రెస్ నేతలు ఎవరి మాట వినరు. తమకు తామే హైకమాండ్. తమకు నచ్చినదే చేస్తారు. నచ్చకపోతే ముట్టను కూడా ముట్టరు. కొత్తగా వచ్చిన ఇన్ ఛార్జులు ఎవరైనా చెప్పే మాటిలివేనని కాంగ్రెస్ నేతలు మాణికం ఠాకూర్ వార్నింగ్ లను లైట్ గా తీసుకుంటున్నారట. ఆయన వార్నింగ్ లు ఇస్తుంటే నవ్వుకునే వాళ్లు కూడా లేకపోలేదు. కొన్ని రోజులు ఆగితే కాని మాణికం ఠాకూర్ కి రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, పార్టీలో తన పరిస్థితి అర్థమవుతుందంటున్నారు.

Tags:    

Similar News