కేసీఆర్ మరో నిర్ణయం…?

తెలంగాణ రాష్ట్రంలో మరో చారిత్రాత్మక కట్టడం కనుమరుగుకానుందా..? అవును అనే అంటున్నారు జనం.. న్యాయవాదులు. మొన్న అసెంబ్లీ.. ఆ తర్వాత ముల్కీ మహల్.. ఇప్పుడు ఏకంగా హై [more]

;

Update: 2019-09-04 18:29 GMT

తెలంగాణ రాష్ట్రంలో మరో చారిత్రాత్మక కట్టడం కనుమరుగుకానుందా..? అవును అనే అంటున్నారు జనం.. న్యాయవాదులు. మొన్న అసెంబ్లీ.. ఆ తర్వాత ముల్కీ మహల్.. ఇప్పుడు ఏకంగా హై కోర్టు.. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు వరుసగా వివాదాస్పదం అవుతూనే ఉన్నాయి.. తాజాగా తీసుకున్న నిర్ణయాలు పెద్ద దుమారం రేపుతున్నాయి. అసలు హైకోర్టును ఎందుకు మార్చాలనుకుంటున్నారు..?

నూతన భవనంలోకి…..

తెలంగాణ హైకోర్టును బుద్వేల్‌కు తరలించనున్నారా? ప్రస్తుత సచివాలయాన్ని కూల్చివేసి కొత్తది నిర్మించాలని నిర్ణయించిన సర్కారు.. తాజాగా హైకోర్టును కూడా నూతన భవనంలోకి తరలించనుందా? బుద్వేల్‌లో హైకోర్టు కోసం సువిశాల స్థలం కేటాయించిందా? అంటే సంబంధిత వర్గాలు అవుననే అంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కొత్త సచివాలయం, కొత్త అసెంబ్లీ నిర్మాణాలను చేపట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న హైకోర్టు తరలింపు అంశం తెరపైకి వచ్చింది. బుద్వేల్‌కు తరలించడానికి సానుకూలత వ్యక్తం చేస్తూ న్యాయస్థానం నుంచి ఇప్పటికే ప్రభుత్వానికి ఒక లేఖ కూడా అందింది. ఆ లేఖను పరిశీలించిన సీఎం కేసీఆర్‌.. తరలింపుపై తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్‌ జోషిని ఆదేశించారు. రాజధానికి చారిత్రక చిహ్నంగా, మూసీ ఒడ్డున ఉన్న హైకోర్టు వందేళ్ల ఉత్సవాన్ని కూడా ఇటీవలే పూర్తి చేసుకుంది. దాదాపు 9 ఎకరాల్లో హైకోర్టు విస్తరించి ఉంది. అయితే భవనాలు బాగా పాతవి కావడంతో పాటు నగర విస్తరణతో ట్రాఫిక్‌ ఇబ్బందులు కూడా పెరిగాయి.

వంద ఎకరాల్లో…..

ప్రస్తుత హైకోర్టు భవనంలో రెండు సార్లు అగ్నిప్రమాదాలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి న్యాయస్థానాన్ని తరలించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. హైకోర్టు కోసం ప్రభుత్వం బుద్వేల్‌లో గతంలోనే 100 ఎకరాలను ఇస్తామంది. అందులో ప్రస్తుతం 70 ఎకరాల భూమి ఖాళీగానే ఉంది. దీన్ని హైకోర్టుకు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. అక్కడే న్యాయమూర్తుల గృహ సముదాయానికి కూడా స్థలం కేటాయించడానికి సంసిద్ధత తెలిపింది. బార్‌ అసోసియేషన్‌కు కూడా భూమి ఇవ్వడానికి సానుకూలంగా ఉంది. ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు దగ్గరగా ఉండడం, విశాలమైన భవనాలు రానుండడంతో కొందరు సీనియర్‌ న్యాయవాదులు కూడా హైకోర్టు తరలింపు కొందరు ఒకే అన్నా మరికొందరు నో అంటున్నారు.

తరలింపుపై ఉద్యమం…..

చాలామంది న్యాయవాదులు హైకోర్టు తరలింపును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. హైకోర్టు పరిరక్షణ సమితిగా ఏర్పాటవుతున్నారు. ఇందులో భాగంగా న్యాయవాదులు హైకోర్టు ముందు నినాదాలు చేశారు. వందేళ్ల చరిత్ర కలిగిన హైకోర్టు భవనాన్ని బుద్వేలుకు తరలించవద్దని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వం తరలించాలని చూస్తే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. హైకోర్టును ప్రస్తుత భవనంలోనే కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తూ న్యాయవాదుల సంఘాల ప్రతినిధులు బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ ఎ.నర్సింహారెడ్డికి; హైకోర్టు న్యాయవాదుల సంఘం చైర్మన్‌ సూర్యకిరణ్‌రెడ్డికి విన్నవించారు. ఫలితంగా కోర్టును నమ్ముకున్న జనం ఇబ్బందుల పాలవుతారని చెప్పారు. ఉమ్మడి హైకోర్టు ఉన్నప్పుడే పోరాటాల ద్వారా ప్రత్యేక హైకోర్టు సాధించామని ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకంగా హై కోర్టు రావడం వారంతా వెళ్లిపోవడంతో ఇక్కడ చాలా స్థలం ఖాళీగా ఉందంటున్నారు.

వందేళ్ల చరిత్ర ఉన్న….

1920, ఏప్రిల్ 20న ఏడవ నిజాం ప్రభువు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో హైదరాబాదు రాష్ట్రం కోసం హైకోర్టును ఏర్పాటు చేశారు. 1956లో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం 1956, నవంబర్ 5న ఆంధ్రప్రదేశ్ హైకోర్టుగా మార్చబడింది. 2014, జూన్ 2న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత ఉమ్మడి హైకోర్టుగా ఉండి, 2019 జనవరి 1న పూర్తిస్థాయిలో తెలంగాణ హైకోర్టుగా మార్చారు. అయితే ఇప్పుడు సౌకర్యవంతంగా లేదని, అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయని, ట్రాఫిక్ సమస్య అని, శిథిలావస్థకు చేరిందని ప్రభుత్వం కుంటి సాకులు చెబుతోందని న్యాయవాదులు మండిపడ్డారు. ఆసియా ఖండంలోనే తెలంగాణ హైకోర్టు భవనం చాలా పెద్దదని చెప్పారు. ఇలాంటి కట్టడం సుప్రీం కోర్టు కి కూడా లేదన్నారు. అలాంటి కట్టడాన్ని కనుమరుగు చేయడం సరైంది కాదని తెలిపారు.

ఖర్చు పెరుగుతుందంటున్న…..

తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల ఆందోళన కూడా చాలా తీవ్రతరంగా ఉందన్నారు. ప్రభుత్వం ఈ విషయాన్ని వెనక్కి తీసుకోకపోతే మరోసారి ఉద్యమం చేయాల్సి వస్తుందన్నారు. కోర్టను ని మారిస్తే చాలా మంది అడ్వకేట్లు అక్కడికి వెళ్లలేక కేసులు వాదించలేక ఇబ్బందులు పడతారని అన్నారు. ఇప్పుడు కేసులకు అయ్యే ఖర్చు కన్నా పదింతలు పెరిగి జనం నడ్డివిరగడం ఖాయమని చెప్పారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఊరుకుంటు వస్తే భవిష్యత్తులో చార్మినార్, గోల్కొండ కూడా కనిపించకుండా పోతుందని న్యాయవాదులు ఆరోపించారు. మొత్తానికి హైకోర్టు తరలింపు పెద్ద దుమారమే లేపుతోంది.

Tags:    

Similar News