టీడీపీ వైపు టర్న్ అవుతారా..?
తనకు కోటి మంది అక్కాచెల్లెల్లు తమ్ముళ్లు.. అంటూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రతీ ఎన్నికల ప్రచార సభలోనూ చెబుతున్నారు. వారంతా తనకు అండగా ఉండి [more]
తనకు కోటి మంది అక్కాచెల్లెల్లు తమ్ముళ్లు.. అంటూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రతీ ఎన్నికల ప్రచార సభలోనూ చెబుతున్నారు. వారంతా తనకు అండగా ఉండి [more]
తనకు కోటి మంది అక్కాచెల్లెల్లు తమ్ముళ్లు.. అంటూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రతీ ఎన్నికల ప్రచార సభలోనూ చెబుతున్నారు. వారంతా తనకు అండగా ఉండి గెలిపిస్తారనేది ఆయన ధీమా. ఇందుకు ముఖ్య కారణంగా చంద్రబాబు ప్రవేశపెట్టిన పసుపు – కుంకుమ పథకం. మూడు నెలల క్రితం డ్వాక్రా మహిళలను తమ వైపు తిప్పుకోవాలనే లక్ష్యంగా ఆ పథకాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో సుమారు 60 లక్షల మంది డ్వాక్రా మహిళలు ఉంటారనే అంచనాలు ఉన్నాయి. ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ పెంచుకోవడం కోసం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పసుపు – కుంకుమ, పింఛన్ల పెంపు, అన్నదాత సుఖీభవ పథకాలను ప్రవేశపెట్టారు. ఈ పథకాల ద్వారా పెద్దసంఖ్యలో ఉన్న డ్వాక్రా మహిళలు, వృద్ధులు, రైతులను తన వైపు తిప్పుకోవాలనేది చంద్రబాబు ఆలోచన.
వైసీపీ వైపే ఎక్కువ మొగ్గు..?
రెండు నెలలుగా పింఛన్లు రెట్టింపు చేసి ఇస్తున్నారు. డ్వాక్రా మహిళలకు ఇప్పటికే రెండు విడతలుగా డబ్బు బ్యాంకుల్లో జమ చేశారు. ఎన్నికలకు వారం ముందు నేడో రేపో మరో విడత జమ అయ్యే అవకాశం ఉంది. దీంతో ఈ డబ్బు తీసుకుని డ్వాక్రా మహిళలు పెద్ద ఎత్తున టీడీపీకే ఓటేస్తారని చంద్రబాబు నమ్ముతున్నారు. అయితే, చంద్రబాబు వ్యూహం ఏమేరకు పని చేస్తుందనే విషయమై వివిధ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా డ్వాక్రా మహిళల విషయంలో చంద్రబాబు నాయుడు తీసుకువచ్చిన పసుపు – కుంకుమ పథకం పెద్దగా ఫలితాన్ని ఇచ్చే అవకాశం లేదు. సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్(సీపీఎస్) సర్వేలో కూడా ఇదే తేలింది. డ్వాక్రా మహిళల్లో తెలుగుదేశం పార్టీ కంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ మొగ్గు ఉందని ఈ సర్వేలో తేలింది. వైసీపీకి 45.2 శాతం, టీడీపీ వైపు 44 శాతం మంది డ్వాక్రా మహిళలు ఉంటారని ఈ సర్వే అంచనా వేసింది. అంటే డ్వాక్రా మహిళలు పసుపు – కుంకుమ డబ్బులు తీసుకొని ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు.
స్థానిక నేతలు తీరు వల్ల…
కేవలం ఎన్నికల కోసమే పసుపు – కుంకుమ పథకం తీసుకువచ్చారనే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రచారం ప్రజల్లోకి బాగానే వెళ్లింది. వైసీపీ తరపున ప్రచారం చేస్తున్న వారంతా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇక, పసుపు – కుంకుమకు కౌంటర్ గా ‘అమ్మ ఒడి’ పథకాన్ని వైసీపీ ప్రచారం చేస్తుంది. తాము అధికారంలోకి వస్తే పిల్లలను పాఠశాలకు పంపించిన తల్లికి సంవత్సరానికి రూ.15 వేలు ఇస్తామని జగన్ ప్రకటిస్తున్నారు. ఇక, స్థానిక తెలుగుదేశం నేతల వ్యవహార శైలి కూడా డ్వాక్రా మహిళల్లో కొంత వ్యతిరేకతకు కారణమవుతోంది. పసుపు – కుంకుమ చెక్కులు ఇచ్చే సమయంలో కూడా కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీకే ఓటేస్తామని ప్రమాణం చేయాల్సిందిగా ఒత్తిడి తెచ్చారు. మరికొన్ని చోట్ల తాము రూ.10 వేలు ఇస్తున్నామని, కచ్చితంగా తమకే ఓటేయాలని టీడీపీ స్థానిక నేతలు కొంత కఠినంగా మాట్లాడుతున్నారు. ఇది కూడా ఆ పార్టీ పట్ల డ్వాక్రా మహిళల్లో కొంత వ్యతిరేకతకు కారణమవుతోంది.
పింఛనుదారులు మాత్రం సానుకూలంగా…
ఇక, ఈ ఐదేళ్లలో చంద్రబాబు పదేపదే ధర్మపోరాట దీక్షలు, నవనిర్మాణ దీక్షలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు అంటూ సభలు నిర్వహించారు. వీటికి డ్వాక్రా మహిళలను తరలించేవారు. వారికి విసుగు పుట్టే అంతలా సభలు జరిగాయి. ఇదీ కొంత నష్టం చేసే అవకాశం ఉంది. ఇక, డ్వాక్రా రుణమాఫీ కాలేదని, పావలా వడ్డీ రుణాలు రావడం లేదని అసంతృప్తి కూడా డ్వాక్రా మహిళల్లో ఉంది. మొత్తానికి డ్వాక్రా మహిళల ఓట్లపై చంద్రబాబు పెట్టుకున్న నమ్మకం పూర్తిగా సఫలమయ్యేలా కనిపించడం లేదు. ఇదే సమయంలో పింఛన్ల లబ్ధిదారులు మాత్రం చంద్రబాబు పట్ల ఎక్కువ సానుకూలంగా కనిపిస్తున్నారు. రూ.200 ఉన్న పింఛన్ ను ఐదేళ్లలో రూ.2 వేలకు తీసుకెళ్లడంతో వారికి ఈ డబ్బు చాలా ఉపయోగపడుతోంది. డ్వాక్రా మహిళల విషయంలో చంద్రబాబు వ్యూహం పూర్తిగా సఫలం కాకున్నా పింఛన్ల లబ్ధిదారుల విషయంలో మాత్రం సక్సెస్ అయ్యేలా కనిపిస్తోంది.