ఊరిస్తున్న జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎవరికి ఛాన్స్ ఇస్తారోనన్న ఉత్కంఠ పార్టీలో నెలకొంది. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో నామినేటెడ్ పదవులపై [more]

Update: 2019-07-06 12:30 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎవరికి ఛాన్స్ ఇస్తారోనన్న ఉత్కంఠ పార్టీలో నెలకొంది. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో నామినేటెడ్ పదవులపై ఎందరో ఆశలు పెట్టుకున్నారు. పార్టికి తొలి నుంచి సేవలందించిన వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని వై.ఎస్.జగన్ యోచిస్తున్నారు. నామినేటెడ్ పోస్టులన్నీ ఒకేసారి భర్తీ చేయాలన్న ఆలోచనతో జగన్ ఈ మేరకు కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

పదవుల పందేరానికి…..

కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టులను దక్కించుకున్న వారు రాజీనామాలు చేశారు. పలు దేవాదాయ శాఖలో ఉన్న నియామకాలతో పాటు వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్ల పోస్టులను కూడా ఒకేసారి భర్తీ చేసేందుకు వై.ఎస్. జగన్ సిద్ధమవుతున్నారు. అయితే ఈ పోస్టులకు ఆశావహుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఎమ్మెల్యే టిక్కెట్లు దక్కని వారు, పార్టీ కోసం తొమ్మిదేళ్లుగా కష్టపడుతున్న వారికి ప్రధమ ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

నామినేటెడ్ పోస్టులకు…..

వై.ఎస్. జగన్ ప్రస్తుతం మూడు అంశాలపై దృష్టి పెట్టారు. సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు పాలనపై దృష్టిసారించడమే కాకుండా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో బడ్జెట్ సమావేశాలు ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈలోపే నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలన్న ఉద్దేశ్యంతో వై.ఎస్. జగన్ ఐదు రోజుల నుంచి కసరత్తులు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఎమ్మెల్యేలకు ఇస్తారా?

స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నందున ముందుగానే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తే ఉపయోగకరంగా ఉంటుందన్నది వై.ఎస్.జగన్ ఆలోచన. తొలుత నామినేటెడ్ పోస్టులను ఎమ్మెల్యేలకు ఇవ్వకూడదని వై.ఎస్.జగన్ భావించినప్పటికీ మంత్రిపదవులు దక్కని వారికి సంతృప్తి పర్చేందుకు ఆర్.కె. రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వారికి నామినేటెడ్ పదవులు ప్రకటించాల్సి వచ్చింది. అయితే వారు కాకుండా ఎమ్మెల్యేలకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలా? లేదా? అన్న దానిపై వై.ఎస్.జగన్ సీనియర్ నేతలతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులకు కూడా నామినేటెడ్ పదవులు ఇచ్చే ఆలోచన ఉన్నట్లు పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. మొత్తం మీద వైసీపీ నేతలను నామినేటెడ్ పదవులు ఊరిస్తున్నాయనే చెప్పాలి.

Tags:    

Similar News