ఇక్కడ దమ్మున వైసీపీ నేత లేరా..!!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి విశాఖ సిటీ ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్ అలాంటిదిలాంటిది కాదు. సిక్కోలు నుంచి మొదలుపెట్టి విజయనగరం, విశాఖ రూరల్ జిల్లా వరకూ జైత్ర యాత్ర [more]

;

Update: 2019-07-09 06:30 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి విశాఖ సిటీ ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్ అలాంటిదిలాంటిది కాదు. సిక్కోలు నుంచి మొదలుపెట్టి విజయనగరం, విశాఖ రూరల్ జిల్లా వరకూ జైత్ర యాత్ర చేస్తూ వచ్చిన ఫ్యాన్ పార్టీకి విశాఖ సిటీ గేట్లు మూసేసింది. నాలుగుకు నాలుగూ ఎమ్మెల్యే సీట్లు సైకిల్ పార్టీ పట్టుకుపోయింది. జనసేన తరఫున జేడీ లక్ష్మీ నారాయణ పోటీ పడబట్టి ట్రయాంగిల్ లో చావు తప్పిన చందంగా మూడున్నర వేల ఓట్ల స్వల్ప మెజారిటీతో ఎంపీ సీటుని వైసీపీ గెలుచుకుంది కానీ లేకపోతే సున్నాకు సున్నా ఫలితం వచ్చేది. ఇదే ఇపుడు వైసీపీ హై కమాండ్ ని వేధిస్తోంది. బాధిస్తోంది. ఇదిలా ఉంటే విశాఖ సిటీ వైసీపీ నాయకులు ఇపుడు అందరికీ అలుసైపోయారు. మరీ ముఖ్యంగా రూరల్ జిల్లా వైసీపీ లీడర్లైతే సిటీ పార్టీని, నేతలను పూచిక పుల్లలా పక్కన పెట్టేస్తున్నారు.

అసలు నాయకులు ఉన్నారా….?

ఈ మాటలు అన్నది ఎవరో ప్రత్యర్ధి పార్టీ వారు కారు. ఏకంగా మూడు సార్లు ఎమ్మెల్యే అయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎలమంచిలి సిట్టింగ్ ఎమ్మెల్యే కన్నబాబురాజు. జీవీఎంసీ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పెట్టుకున్న పార్టీ మీటింగులో రాజు గారు సిటీ నేతల గాలి తీసేశారు. మేము రూరల్ నుంచి వస్తేనే కానీ మీటింగుకు కళ రాదు అన్నట్లుగా ఆయన మాటలు ఉన్నాయి. విశాఖ నగరంలో దమ్మున్న నాయకులే లేరంటూ రాజు గారు హాట్ కామెంట్స్ చేశారు. వైసీపీ ఓ వైపు అప్రతిహితమైన విజయాన్ని సాధిస్తూ ఏపీలో జగన్ సీఎం అని స్పష్టంగా తెలిసిన వేళ విశాఖ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు జగన్ని అసభ్యంగా దూషిస్తూ మాట్లాడితే కనీసం ఖండించే ధైర్యం కూడా ఏ వైసీపీ నేతకు లేకుండా పోయిందని రాజు గారు తగులుకునేసరికి సిటీ లీడర్లకు నోటి వెంట మాట వస్తే ఒట్టు.

అంతకు ముందూ కడిగేశారు….

ఇక మరో సందర్భంలో అంటే మంత్రిగా అవంతి శ్రీనివాసరావుని సన్మానించిన టైంలో కూడా రూరల్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు సిటీ నాయకులను కడిగి పారేశారు. చోడవరం వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ నగరంలో గట్టి నాయకులు లేకపోవడం వల్లనే పార్టీ ఓడిపోయిందని ధర్మంగా చెప్పేశారు. అన్నీ సీట్లు గెలుచుని పార్టీకి బలమైన గాలి కూడా ఉన్న వేళ విశాఖ సిటీలో ఓడిపోయామంటే నాయకుల వైఫల్యమేనని కూడా ధర్మశ్రీ తీర్పు చెప్పేశారు. మరి సిటీలో వైసీపీ జెండా ఎలాగైనా పాతాలని జగన్ గట్టిగా కృషి చేస్తున్న వేళ సహకరించాల్సిన రూరల్ నాయకులే తీసిపారేసేవిధంగా మాట్లాడంతో నగర నాయకులు బాగా నొచ్చుకుంటున్నారు. ఈ గొడవల నేపధ్యమో జీవీఎంసీ పీఠంపై ఫ్యాన్ రెపరెపలు సాధ్యమేనా అన్న డౌట్లు కూడా వస్తున్నాయి.

Tags:    

Similar News