బాగా గ్యాప్‌ ఉన్నా…. ఫిల్ చేసే త‌మ్ముడేడీ..?

ప్రకాశం జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం చీరాల‌. ఇక్కడ ప్రస్తుతం ఓ విధ‌మైన పొలిటిక‌ల్ గ్యాప్ ఏర్పడింది. ఈ నేప‌థ్యంలో ప్రధాన ప్రతిప‌క్షంగా ఉన్న టీడీపీ ఈ గ్యాప్‌ను [more]

Update: 2020-12-26 05:00 GMT

ప్రకాశం జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం చీరాల‌. ఇక్కడ ప్రస్తుతం ఓ విధ‌మైన పొలిటిక‌ల్ గ్యాప్ ఏర్పడింది. ఈ నేప‌థ్యంలో ప్రధాన ప్రతిప‌క్షంగా ఉన్న టీడీపీ ఈ గ్యాప్‌ను త‌న‌కు అనుకూలంగా మార్చుకునే ప‌ని ఎక్కడా ప్రారంభించ‌క‌పోవ‌డం ఆశ్చర్యంగా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వాస్తవానికి ఎక్కడ అవ‌కాశం ఉన్నా.. రాజ‌కీయ నేత‌లు ఎదిగేందుకు ప్రయ‌త్నాలు చేస్తారు. స‌ద‌రు గ్యాప్‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయ‌త్నిస్తారు. అయితే చీరాల‌లో ఏర్పడిన రాజ‌కీయ గ్యాప్‌ను టీడీపీ నేత‌లు ఎవ‌రూ కూడా అందిపుచ్చుకోవ‌డం, త‌మ‌కు అనుకూలంగా మార్చుకోవ‌డం అనే విష‌యాల‌పై దృష్టి పెట్టలేక పోతున్నారనే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.

బలంగా ఉన్నా….

చీరాల‌లో టీడీపీ 1983, 1985, 1994, 1999ల‌లో గెలుపు గుర్రం ఎక్కింది. ఆ త‌ర్వాత ఇప్పటి వ‌ర‌కు ఇక్కడ పాగా వేసింది లేదు. 1994, 99ల‌లో పాలేటి రామారావు వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకున్నారు. ఆ త‌ర్వాత‌.. ఇక్కడ టీడీపీ జెండా మోసే నాయ‌కులు ఉన్నా.. పార్టీ గెలుపు మాత్రం నానాటికీ తీసిక‌ట్టుగా మారింది. ఈ క్రమంలోనే 2014 ఎన్నిక‌ల త‌ర్వాత ఇక్కడ నుంచి ఇండిపెండెంట్‌గా గెలిచిన ఆమంచి కృష్ణమోహ‌న్‌ను చంద్రబాబు పార్టీలోకి తీసుకున్నారు. పార్టీ బ‌ల‌ప‌డుతుంద‌ని భావించారు. అయితే.. టీడీపీ వ‌ర్గ పోరులో ఆయ‌న ఇమ‌డ‌లేక‌.. పార్టీ కి దూర‌మ‌య్యారు.ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో వెనువెంట‌నే చంద్రబాబు ఎలాంటి ఆలోచ‌న చేయ‌కుండా అద్దంకిలో పార్టీకి త‌ల‌నొప్పిగా మారిన క‌ర‌ణం బ‌ల‌రాంను అక్కడ‌కు పంపారు.

ఎడం బాలాజీకి పార్టీ పగ్గాలు….

స్థానికంగా ఉన్న ప‌రిస్థితులు.. ఆమంచి చివ‌ర్లో పార్టీ మార‌డం లాంటి కార‌ణాలు క‌ర‌ణంకు ప్లస్ అయ్యి ఆయ‌న గెలిచారు. క‌ర‌ణం గెలిచినా అక్కడ‌ పార్టీని నిల‌బెట్ట‌లేదు. పైగా తానే పార్టీ మారిపోయి.. ఫ్యాన్ కింద‌కు వెళ్లిపోయారు. ఆ వెంట‌నే చంద్రబాబు 2014లో ఇక్క‌డ వైసీపీ నుంచి పోటీ చేసి మూడో స్థానంలో ఉండ‌డంతో పాటు గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న ఎడం బాలాజీకి నియోజ‌కవ‌ర్గ ప‌గ్గాలు ఇచ్చారు. ఇక క‌ర‌ణం, పోతుల సునీత‌, పాలేటి రామారావు ఇలా పాత టీడీపీ గ్యాంగ్ అంతా ఫ్యాన్ కింద‌కు వెళ్లిపోవ‌డంతో ఇప్పుడు ఎడం బాలాజీ ఒక్కరే నియోజ‌క‌వ‌ర్గంలో మిగిలారు. దీంతో ప్రస్తుతం వైసీపీలో ఏర్పడిన అంత‌ర్గత క‌ల‌హాల నేప‌థ్యంలో ప్రజ‌ల‌కు టీడీపీని చేరువ చేసేందుకు అవ‌కాశం ఉన్న క్రమంలో ఆయ‌న దూకుడు పెంచితే.. బాగుంటుంద‌నే సూచ‌న‌లు వ‌స్తున్నాయి.

వారి వ్యవహారంగానే….

కానీ, బాలాజీ మాత్రం బ‌య‌ట‌కు రావ‌డం లేదు. ప్రస్తుత ప‌రిస్థితిని క‌ర‌ణం-ఆమంచిల వ్యవ‌హారంగానే ఆయ‌న చూస్తున్నారు త‌ప్ప.. రాజ‌కీయంగా చూడ‌డం లేదు. పైగా త‌న‌కు టికెట్‌పై హామీ లేద‌ని.. ఇప్పుడు పార్టీని డెవ‌ల‌ప్ చేసినా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అయినా.. త‌న‌కు టికెట్ ఇస్తార‌నే గ్యారెంటీ లేద‌ని ఆయ‌న చెబుతున్నట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. మొత్తంగా చూస్తే.. మంచి అవ‌కాశం ఉంచుకుని కూడా టీడీపీని డెవ‌ల‌ప్ చేసుకోలేక పోతున్నార‌నే వాద‌న మాత్రం వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఇప్పటికైనా చంద్రబాబు జోక్యం చేసుకుని నేత‌ల‌కు దిశానిర్దేశం చేస్తే బెట‌ర్ అని అంటున్నారు టీడీపీ సానుభూతి ప‌రులు.

Tags:    

Similar News