బాబు పిలుపిస్తేనే సైకిల్ ఎక్కేది …?

కరోనా సెకండ్ వేవ్ లో తెలుగుదేశం పార్టీ లోని తూర్పుగోదావరి జిల్లా నేతలంతా అండర్ గ్రౌండ్ లోకి వెళ్లి  పోయారు. చంద్రబాబు పార్టీ పరంగా ఇచ్చే పిలుపులకు [more]

Update: 2021-05-10 11:00 GMT

కరోనా సెకండ్ వేవ్ లో తెలుగుదేశం పార్టీ లోని తూర్పుగోదావరి జిల్లా నేతలంతా అండర్ గ్రౌండ్ లోకి వెళ్లి పోయారు. చంద్రబాబు పార్టీ పరంగా ఇచ్చే పిలుపులకు ఇంటి నుంచి ఉద్యమాలు చేస్తూ మిగతా సమయంలో సైలెంట్ అయిపోతున్నారు. అదే కరోనా తొలి వేవ్ లో మాత్రం పార్టీ ఇచ్చే పిలుపులకు సంబంధం లేకుండా ప్రభుత్వ లోపాలను ఎండగడుతూ ఎదో ఒక నిరసన కార్యక్రమాలను, సేవా కార్యక్రమాలతో నిత్యం ప్రజల్లో పసుపు దళాలు నిర్వహించేవి.

ఎన్నికల తర్వాత…?

కానీ పంచాయితీ మునిసిపల్ ఎన్నికల ఫలితాల తరువాత టిడిపి శ్రేణులకు ఉన్న ఓపిక కాస్తా పోయి నీరసం వచ్చేసింది. దాంతో క్యాడర్ పటిష్టంగా ఉండే తూర్పు లో ఆ పార్టీ గళం వినిపించడమే గగనం అయిపొయింది. ఎవరికి వారు ఇంటికే పరిమితమయ్యారు. తమ వ్యాపారాలను చూసుకునే వారు కొందరైతే, ఇప్పుడే రెస్ట్ సమయమని మరికొందరు కుటుంబసభ్యులతో గడుపుతున్నారు.

ఉద్ధండులు ఉన్నా …

తూర్పు గోదావరి జిల్లాల్లో టిడిపి కి గట్టి నేతలే ఉన్నారు. యనమల రామకృష్ణుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రు వంటి హేమాహేమీలు ఆచి తూచి మాట్లాడుతున్నారు తప్ప జోరు పెంచడం లేదు. వీరిలో కాస్త మెరుగ్గా ఉన్నది పాలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాత్రం అటు ప్రసార మాధ్యమాల్లోను ఇటు సోషల్ మీడియా లో పోస్ట్ లతో హల్చల్ చేస్తున్నారు తప్పితే మిగిలిన వారంతా గో కరోనా గో అంటూ ఇంట్లో నినాదాలు చేస్తున్నారు. తూగో లో ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు ఎవరంటే కూడా చాలామంది దిక్కులు చూసే పరిస్థితి కొనసాగుతుంది. ఇలాంటి దుస్థితి గతంలో ఎప్పుడు లేదని కూడా తమ్ముళ్ళు వాపోతున్నారు. మరి అధినేత తూర్పు గోదావరి తమ్ముళ్లలో జోష్ పెంచేందుకు ఎలాంటి చర్యలు చేపడతారో చూడాలి.

Tags:    

Similar News