టీడీపీకి తెలంగాణా పొలిటికల్ గేట్ వే ?

తెలుగుదేశం పార్టీ పుట్టిందే తెలంగాణాలో. అందువల్ల దాని మూలాలు ఇక్కడ బలంగానే ఉన్నాయి. అయితే అధినాయకుడే చాప చుట్టేసి అయిదేళ్ల క్రితం ఆంధ్రా వైపు పరుగులు తీశాక [more]

;

Update: 2020-11-11 03:30 GMT

తెలుగుదేశం పార్టీ పుట్టిందే తెలంగాణాలో. అందువల్ల దాని మూలాలు ఇక్కడ బలంగానే ఉన్నాయి. అయితే అధినాయకుడే చాప చుట్టేసి అయిదేళ్ల క్రితం ఆంధ్రా వైపు పరుగులు తీశాక తెలంగాణాలో పసుపుదనం మెల్లగా కరిగిపోయింది. ఏదో నామ్ కే కే వాస్తే అన్నట్లుగా పార్టీ ఇక్కడ సాగుతోంది. ఇక వందల కోట్లతో కట్టిన ఎన్టీఆర్ భవనం ఉండడం వల్ల కూడా టీడీపీ ఉందని చెప్పాల్సివస్తోంది. ఇదిలా ఉంటే 2018 సార్వత్రిక ఎన్నికల తరువాత తెలంగాణా వైపు చంద్రబాబు చూసే సాహసం చేయలేదు. కాంగ్రెస్ తో కలసి పొత్తులు పెట్టుకుని చంద్రబాబు చేసిన ప్రయోగం వికటించింది. దాంతో గప్ చుప్ అయిపోయారని చెబుతారు.

సందడి చేస్తారా…?

తెలంగాణాలో దుబ్బాక ఉప ఎన్నిక జరిగితే జాతీయ పార్టీగా ఉన్న టీడీపీ కనీసం పట్టించుకోలేదంటే దుకాణం ఎంతలా కళాహీనం అయిందో అర్ధమవుతుంది. అయితే తెలంగాణాకు మాత్రం రమణను ప్రెసిడెంట్ ని చేసి తమ పార్టీ ఉనికిని చంద్రబాబు చాటుకుంటున్నారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు వస్తున్నాయి. ఆ ఎన్నికల్లో పోటీ చేయడానికి టీడీపీ శ్రేణులు అయితే ఉత్సాహం చూపిస్తున్నాయట. దాని మీద చంద్రబాబు తో పార్టీ నాయకులు జరిపిన చర్చల్లో బీజేపీతో పొత్తు గురించి ఆలోచించాలని చంద్రబాబుకు సూచించారట. ఇది చంద్రబాబుకు సంతోషకరమైన ప్రతిపాదనే. కానీ బీజేపీ నుంచి సానుకూల స్పందన వస్తుందా అన్నదే ఇపుడు చర్చగా ఉంది.

రెడీ అంటే…..

బీజేపీకి తెలంగాణాలో బలం ఉంది కానీ పూర్తిగా ఎక్కడా లేదు. కొన్ని చోట్ల మాత్రమే అలా కనిపిస్తోంది. ఇక ఉమ్మడి ఏపీని తొమ్మిదేళ్ళ పాటు పాలించిన టీడీపీ గ్రాస్ రూట్లలో పాతుకుపోయింది. దాంతో టీడీపీకి ఆ బలం ఉందని బీజేపీకి కూడా తెలుసు. కానీ జాతీయ నాయకత్వం చంద్రబాబు అంటేనే దూరం పెడుతోంది కాబట్టి వారు నోరు తెరచి బయటపడలేకపోతున్నారు. ఇక బీజేపీ తెలంగాణా ప్రెసిడెంట్ బండి సంజయ్ లాంటి వారు అయితే టీయారెస్ కి వ్యతిరేకంగా కాంగ్రెస్ తప్ప ఎవరినైనా కలుపుకుని పోవాలని చూస్తున్నారట. మరి ఆయన ఏమైనా జాతీయ నాయకత్వాన్ని ఒప్పించి టీడీపీతో దోస్తీ కడితే టీయారెస్ కి కొంత ఇబ్బందికరంగానే గ్రేటర్ ఎన్నికలు ఉంటాయన్నది వాస్తవం.

అటునుంచి ఇటు….

ఇక తెలంగాణాలో కనుక బీజేపీ టీడీపీ జట్టు కడితే ఆ ప్రభావం ఏపీ లోకల్ బాడీ ఎన్నికల మీద కూడా పడుతుందని అంటున్నారు. ఏపీలో కూడా తొందరలో స్థానిక ఎన్నికల సమరం ఉంది. మరి ఇక్కడ సోము వీర్రాజు అయితే చంద్రబాబు పొడ అంటే అసలు గిట్టదు అంటున్నారు. కానీ రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు అన్న దాన్ని నమ్మితే మాత్రం తెలంగాణా నుంచి పొత్తు గాలి అలా పాకి వచ్చి ఏపీ మీదుగా కూడా బలంగా సాగవచ్చు అని అంటున్నారు. మొత్తానికి బాబు హైదరాబాద్ లో కూర్చుని జూమ్ యాప్ లతో కాలక్షేపం చేయడంలేదు. కొత్త ఎత్తులు పొత్తుల కధను విజయవంతంగా నడిపించడానికి వ్యూహ రచన చేస్తున్నారు అంటున్నారు. చూడాలి మరి ఏపీ రాజకీయాలకు తెలంగాణా గేట్ వే అవుతుందా లేదా అన్నది.

Tags:    

Similar News