యువ నాయ‌కురాళ్ల పోరులో విజేత ఎవ‌రో..?

అనంత‌పురం జిల్లా శింగ‌న‌మ‌ల నియోజ‌క‌వ‌ర్గంలో ఇద్ద‌రు యువ నాయ‌కురాళ్ల మ‌ధ్య ఆస‌క్తిక‌ర పోరు జ‌రిగింది. గ‌త ఎన్నిక‌ల్లో స్వ‌ల్ప తేడాతో కోల్పోయిన ఈ సీటును ఈసారైనా ద‌క్కించుకోవాల‌ని [more]

Update: 2019-04-26 15:30 GMT

అనంత‌పురం జిల్లా శింగ‌న‌మ‌ల నియోజ‌క‌వ‌ర్గంలో ఇద్ద‌రు యువ నాయ‌కురాళ్ల మ‌ధ్య ఆస‌క్తిక‌ర పోరు జ‌రిగింది. గ‌త ఎన్నిక‌ల్లో స్వ‌ల్ప తేడాతో కోల్పోయిన ఈ సీటును ఈసారైనా ద‌క్కించుకోవాల‌ని ప‌ట్టుద‌ల‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సిట్టింగ్ స్థానాన్ని తిరిగి కైవ‌సం చేసుకోవాల‌ని తెలుగుదేశం పార్టీ ఇక్క‌డ హోరాహోరీ త‌ల‌ప‌డ్డాయి. రెండు పార్టీల నుంచి పోటీ చేసిన వారు ఇద్ద‌రూ యువ రాజ‌కీయ నాయ‌కురాళ్లే కావ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, మాజీ మంత్రి శైల‌జానాథ్ కూడా మ‌రోసారి కాంగ్రెస్ నుంచి త‌న అదృష్టం ప‌రీక్షించుకున్నారు. అయితే, ప్ర‌ధాన పోటీ మాత్రం తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మ‌ధ్యే ఉంది.

టీడీపీ నుంచి కొత్త అభ్య‌ర్థి

ఎస్సీ రిజ‌ర్వుడ్ నియోజ‌క‌వ‌ర్గ‌మైన శింగ‌న‌మ‌ల‌లో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల‌కు స‌మాన బ‌లం ఉండేది. అయితే, 2014లో కాంగ్రెస్ స్థానంలోకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ‌చ్చింది. ఆ ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి మాజీ మంత్రి శ‌మంత‌క‌మ‌ణి కూతురు యామినిబాల పోటీ చేసి గెలిచారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన జొన్న‌ల‌గ‌డ్డ ప‌ద్మావ‌తిపై ఆమె 4 వేల ఓట్ల స్వ‌ల్ప మెజారిటీతో విజ‌యం సాధించారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన శైల‌జానాథ్ కేవ‌లం 2 వేల ఓట్లు మాత్ర‌మే ద‌క్కించుకున్నారు. ఈసారి కూడా టిక్కెట్ త‌న‌కే ఇవ్వాల‌ని యామినిబాల చివ‌రి వ‌ర‌కు పార్టీ అధినాయ‌క‌త్వం వ‌ద్ద ప్ర‌య‌త్నించారు. అయితే, అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డితో ఆమెకు విభేదాలు ఏర్ప‌డ్డాయి. ఈ టిక్కెట్ ను ఆయ‌న ప‌ట్టుబ‌ట్టి మ‌రీ కొత్త అభ్య‌ర్థి శ్రావ‌ణిశ్రీకి ఇప్పించారు.

వైసీపీ అభ్య‌ర్థిపై సానుభూతి

శ్రావ‌ణిశ్రీ రాజ‌కీయాల‌కు కొత్త‌. జేసీ కుటుంబం హామీతో కొన్ని రోజులుగా ఆమె నియోజ‌క‌వ‌ర్గంలో తెర‌పైకి వ‌చ్చి ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు చేశారు. టిక్కెట్ ఇప్పించిన జేసీ కుటుంబం ఆమె విజ‌యం కోసం తీవ్రంగానే శ్ర‌మించారు. శింగ‌న‌మ‌ల నియోజ‌క‌వ‌ర్గంలో వారికి కొంత ప‌ట్టుంది. జేసీ కుటుంబం శ్రావ‌ణిశ్రీ త‌ర‌పున అన్నీ తామై వ్య‌వ‌హ‌రించి ప్ర‌చారం చేశారు. ఇది ఆమెకు క‌లిసివ‌చ్చింది. అయితే, టిక్కెట్ ద‌క్క‌ని అసంతృప్తితో ఉన్న యామినిబాల మాత్రం ఆమెకు దూరంగా ఉన్నారు. ఇక‌, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో ఉన్న ప‌ద్మావ‌తిపై నియోజ‌క‌వ‌ర్గంలో గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన సానుభూతి ఉంది. ఆమె ఐదేళ్లుగా ప్ర‌జ‌ల్లోనే ఉంటున్నారు. నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌స్య‌ల‌పై ఆమె ప‌లుమార్లు గ‌ళ‌మెత్తారు. ఓడినా ప్ర‌జ‌ల త‌ర‌పున ఉన్నార‌నే పేరుంది. ఇక‌, సామాజ‌క‌వ‌ర్గ స‌మీక‌రణాలు కూడా ఆమెకు క‌లిసివ‌చ్చాయి. ఆమె భ‌ర్త రెడ్డి సామాజ‌క‌వ‌ర్గానికి చెందిన వారు. వైసీపీలోకి కొత్త‌గా ప‌లువురు నాయ‌కులు చేర‌డంతో ఆ పార్టీ బ‌లం పెరిగింది. మొత్తానికి శింగ‌న‌మ‌ల‌లో ఈసారి తెలుగుదేశం పార్టీ గెల‌వ‌డం క‌ష్ట‌మే అనే అంచ‌నాలు ఉన్నాయి.

Tags:    

Similar News