ట్రాప్ లో పడినట్లే ఉంది

అమరావతి పై విపక్షంలో వున్నప్పుడు వైసిపి చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. రాజధాని ఎక్కడో ముందుగా గుర్తించి తమ వారంతా కొనుగోలు చేసిన తరువాత మాత్రమే [more]

;

Update: 2019-08-28 08:00 GMT

అమరావతి పై విపక్షంలో వున్నప్పుడు వైసిపి చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. రాజధాని ఎక్కడో ముందుగా గుర్తించి తమ వారంతా కొనుగోలు చేసిన తరువాత మాత్రమే నాటి టిడిపి సర్కార్ ఖరారు చేసిందన్న వైసిపి ఆరోపణలను మెజారిటీ ప్రజలు విశ్వసించారు కూడా. మంత్రులు, ఎంపిలు, ఎమ్యెల్యేలు, నేతలు అంతా ఈ భూదందాలో చిక్కున్నారని తాము ప్రభుత్వంలోకి వస్తే ఈ బండారం బయట పెడతామంటూ కూడా వైసిపి ప్రజలకు భరోసా ఇచ్చింది. అనుకున్నట్లే జగన్ సర్కార్ కొలువైంది. అయితే గత మూడు నెలలుగా రాజధాని మార్పు అంశంపై వైసిపి ప్రభుత్వం నోరు మెదపలేదు.

ఇంతగోల చేసి …

ఎన్నికల ముందు రాజధాని పై నానాగోల చేసిన వైసిపి అధికారంలోకి వచ్చాకా మౌన ముద్ర లో ఉండటం అందరిలో ఆసక్తిని పెంచింది. ఈలోగా కొద్ది రోజుల క్రితం వచ్చిన కృష్ణా వరదలు వైసిపి సర్కార్ కి రాజధాని మార్పు తేనెతుట్టను కదిపే అవకాశం కల్పించింది. అంతే మంత్రి బొత్స సత్యనారాయణ ద్వారా రచ్చ మొదలు పెట్టేలా వైసిపి తన వ్యూహాన్ని అమల్లో పెట్టేసింది. అంతే వైసిపి అనుకున్నట్లే టిడిపి లబోదిబో అంటూ రోడ్డెక్కిసింది. బిజెపి లోకి ప్రవేశపెట్టిన తన మిత్రులను రంగంలోకి దింపేసింది. జనసేనను ఇందులోకి లాగేలా చంద్రబాబు సీన్ రూపొందించేశారు. రాజధాని భూదందా పై గతంలో భగ్గుమన్న కామ్రేడ్స్ ను బుజ్జగించి లైన్లో పెట్టేశారు బాబు. గ్రామాల వారీగా రైతులను సమీకరించి భారీ ఉద్యమానికే శ్రీకారం చుట్టేశారు ఆయన.

లిస్ట్ లు బయట పెడుతున్న వైసిపి …

రాజధాని వ్యవహారం తాము అనుకున్నట్లే వేడెక్కడంతో ఇప్పుడు వైసిపి దాడి తీవ్రం చేసింది. అమరావతిలో గతంలో ఆరోపించిన ఇన్ సైడ్ ట్రేండింగ్ బండారం బద్దలు కొట్టడానికి అవసరమైన సరుకు సరంజామా ను కొద్ది కొద్దిగా బయటకు తీస్తుంది. ముందుగా దూకుడుగా వున్న సుజనా చౌదరి కుటుంబం భూముల లిస్ట్ వెల్లడించింది. ఇకపై అమరావతి భూములు ఎవరెవరు టిడిపి నేతలు ఎంతెంత ఎక్కడ కొన్నది బయట పెట్టి చర్చ జరగాలని చూస్తుంది వైసిపి ప్రభుత్వం. టిడిపి, బిజెపిలు ఎంత అల్లరి చేస్తే అంత అడ్వాంటేజ్ గా ఈ అంశాన్ని మార్చుకోవాలని వైసిపి గట్టి కసరత్తే మొదలు పెట్టింది.

వారి ఆశలు గల్లంతు ….

ఏ నాయకుడు ఎక్కడ భూమిని ఎలా ఎంత ధరకు ఏ తేదీన కొన్నది అసైన్డ్ భూములు, ప్రభుత్వం అడ్డగోలుగా రూపాయి పాపాయికి గతంలో ఎవరెవరికి ధారాదత్తం చేసింది రాజధాని రైతులతో చెప్పించే కార్యక్రమం కూడా మొదలు పెట్టేసింది వైసిపి. అధికార యంత్రాంగం చేత సిఆర్డీఎ పరిధిలో వున్న అన్ని వివరాలు రప్పించుకుంది వైసిపి. ఈ రాజకీయ క్రీడలో ఎవరిది పై చెయ్యి అయినా కానీ అమరావతి భూముల ధరలు మాత్రం నేలచూపులు చూడటం ఇప్పుడు రియల్ వ్యాపారం చేసుకుందామనుకున్న వారికి నిరాశే మిగిల్చింది. ముఖ్యంగా కోట్ల రూపాయలు అమరావతిపై పెట్టుబడి పెట్టి డబుల్ త్రిబుల్ చేసుకుందామనుకున్న వారంతా పెట్టిన సొమ్ము వస్తే చాలని దిక్కులు చూస్తున్నారు.

Tags:    

Similar News