మరో అమరావతిని చేయొద్దు ?

విశాఖకు రాజధాని అంటే జనం భయపడింది అందుకే. విశాఖలో ప్రశాంతంగా బతుకుతున్న వారికి ఈ హంగులూ, అభివృద్ధి చాలు. రాజధాని అంటే మరింత రచ్చ తప్ప ఒరిగేది [more]

;

Update: 2020-08-31 06:30 GMT

విశాఖకు రాజధాని అంటే జనం భయపడింది అందుకే. విశాఖలో ప్రశాంతంగా బతుకుతున్న వారికి ఈ హంగులూ, అభివృద్ధి చాలు. రాజధాని అంటే మరింత రచ్చ తప్ప ఒరిగేది ఏదీ లేదు అన్నది మెజారిటీ జనం కచ్చితమైన అభిప్రాయం. విశాఖలో ఎక్కువగా ఉండేది మధ్యతరగతి ప్రజానీకం. అలాగే ఉద్యోగస్థులు. వారికి అద్దె ఇళ్ల భారం పెరుగుతుంది అన్న భయం కంగారు అపుడే మొదలయ్యాయి. ఇక దందాలు జరిగితే తమ ఇళ్ళూ వాకిళ్లూ పోతాయని సొంతింటి వారి బాధా ఆవేదన. మరో వైపు చూస్తే అమరావతి కధలను విన్న వారంతా విశాఖను అలా చేయవద్దు అని రెండు చేతులూ ఎత్తి మొక్కుతున్నారు.

ఇప్పటికే చితికి….

గత అయిదేళ్ల టీడీపీ పాలనలో విశాఖ మీద పెద్దల కన్ను పడింది. గద్దలా భూములను దోచుకున్నారు. ఇలా కబ్జాలకు గురి అయిన భూములను తీసుకుంటే అనధికార లెక్కల ప్రకారం అయిదు వేల ఎకరాలు వరకూ ఉంటుంది అని తేలింది. అది అలా చేతులు మారి ఇపుడు ఎవరి దగ్గర ఉందో కూడా తెలియని స్థితిలో ఉంది. ఇక ఈ భూముల్లో ప్రభుత్వానికి చెందినవీ ఉన్నాయి. ఇక ఎక్కడో విదేశాల్లో ఉంటూ విశాఖలో సరదాకు స్థలాలు కొని అట్టేపెట్టుకున్న వారివీ దందాదారులు చప్పరించేశారు. అసైన్డ్ భూములను దళితులకు ఇస్తే వాటినీ నంజుకు తిన్నారు. ఆఖరుకు స్వాతంత్ర సమరయోధులకు ఇచ్చిన భూములు కూడా విడిచిపెట్టలేదు.

అప్పట్లోనే అలా …?

ఇక ఉమ్మడి ఏపీలోనూ, విభజన ఏపీలోనూ పరిశ్రమలు పెడతాము, వ్యాపారాలు చేస్తామని పలుకుబడి కలిగిన వారు, రాజకీయ పార్టీలకు చెందిన పెద్దలు వేలాది ఎకరాలు అప్పనంగా తీసుకున్నారు. వారికి ఆ భూములు ప్రభుత్వం కేటాయించిన తరువాత అక్కడ ఆ రకమైన యాక్టివిటీ జరుగుతోందా ఇప్పటిదాకా చూసిన పాపాన పోలేదు. ఇలా తీసుకున్న భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారమే దర్జాగా చేసుకుంటున్న వారు ఉన్నారు. మరికొందరు ఇపుడు రాజధాని వస్తోందన్న వార్తతో ఈ భూములను చేతులు మార్చేసి అమ్మేసుకుంటున్నారని అంటున్నారు. దీని మీద ఉత్తరాంద్ర్హా అధ్యయన వేదిక కన్వీనర్, ప్రొఫెసర్ కె ఎస్ చలం మాట్లాడుతూ ఇలాంటి భూములను ముందు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సూచిస్తున్నారు.

ప్రభుత్వ భూమి కొరత …..

ప్రభుత్వానికి భవిష్యత్తులో ఎంతో భూమి అవసరం పడుతుంది అని కూడా మేధావులు అంటున్నారు. విశాఖలో ప్రభుత్వ భూములు పెద్దగా లేవని, అందువల్ల ఈ వివిధ కార్యక్రమాల కోసం గతంలో ప్రభుత్వం ఇచ్చిన భూమి వృధాగా పడిఉంటే వాటిని తక్షణం వెనక్కు తీసుకోవాలని వారు గట్టిగా కోరుతున్నారు. అసలు ప్రభుత్వ భూమి ఎంత ఉంది అన్నది సర్వే చేయించమని కూడా నగరాభివృద్ధికాములుకు డిమాండ్ చేస్తున్నారు. ఇది మంచి విధానమే. విశాఖ రాజధాని అంటే వచ్చే మొదటి సమస్య. భూములే. ఇప్పటికే ఎక్కడిక్కడ సర్దేశారు, పంచేశారు. మిగిలినది కబ్జాలలో చిక్కుతుంది. అందువల్ల విలువైన భూములను ప్రభుత్వం అర్జంటుగా కాపాడుకోవాలి. కబ్జాల నుంచి వెనక్కి తీసుకురావలి. ఇలా పరిశ్రమల పేరిట ఇచ్చి రియల్ దందా చేస్తున్న వారి నుంచి కూడా తీసుకోవాలి. వీటికంటే ముందు భూ దందాలకు ఫుల్ స్టాప్ పెట్టాలి. అపుడే విశాఖ మరో అమరావతి కాకుండా ఉంటుందని అంటున్నారు. మరి వైసీపీ సర్కార్ ఈ విషయంలో వేగంగా అడుగులు వేయకపోతే విశాఖలో సామాన్యుడు మధ్యతగతి బతకలేడు అన్నది పచ్చినిజం. అలాగే ప్రభుత్వానికి కూడ సెంట్ జాగా కావాలన్నా రేటు కట్టి తీసుకోవాల్సిన దుస్థితి వస్తుంది.

Tags:    

Similar News