మధ్యంతర ఎన్నికలు అందుకే వచ్చాయా?
నేపాల్ లో రాజకీయ ప్రతిష్ఠంభనకు తెరపడింది. పార్లమెంటును రద్దు చేసి గత కొంత కాలంగా కొనసాగుతున్న ప్రతిష్ఠంభనకు అధ్యక్షురాలు ముగింపు పలికారు. ఈ ఏడాది నవంబరులో మధ్యంతర [more]
;
నేపాల్ లో రాజకీయ ప్రతిష్ఠంభనకు తెరపడింది. పార్లమెంటును రద్దు చేసి గత కొంత కాలంగా కొనసాగుతున్న ప్రతిష్ఠంభనకు అధ్యక్షురాలు ముగింపు పలికారు. ఈ ఏడాది నవంబరులో మధ్యంతర [more]
నేపాల్ లో రాజకీయ ప్రతిష్ఠంభనకు తెరపడింది. పార్లమెంటును రద్దు చేసి గత కొంత కాలంగా కొనసాగుతున్న ప్రతిష్ఠంభనకు అధ్యక్షురాలు ముగింపు పలికారు. ఈ ఏడాది నవంబరులో మధ్యంతర ఎన్నికలకు ఆదేశించడం ద్వారా సంక్షోభాన్ని కొలిక్కి తీసుకువచ్చారు. అధ్యక్షురాలు బిద్యాదేవి భండారీ నిర్ణయం మేరకు నవంబరు 12, 19తేదీల్లో రెండు విడతలుగా మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (యూఎంఎల్- యూనిఫైడ్ మార్క్సిస్టు లెనినిస్టు) అధినేత, ప్రధాని ఖడ్గ ప్రసాద శర్మ నాయకత్వంలోని ప్రభుత్వం గత కొంత కాలంగా సభలో మెజార్టీ నిరూపించలేక సతమతమవుతోంది. ఈ నేపథ్యంలో సర్కారు ఏర్పాటు చేయాల్సిందిగా వివిధ పార్టీలను అధ్యక్షురాలు భండారీ కోరారు. చివరికి వారు కూడా తమ అశక్తతను వ్యక్తం చేయడంతో గత్యంతర లేక, ఆఖరి ప్రత్యామ్నాయంగా పార్లమెంటు రద్దుకు, మధ్యంతర ఎన్నికలకు అధ్యక్షురాలు అనివార్యంగా ఆదేశాలు ఇచ్చారు.
రెండోసారి….
275 మంది సభ్యులు గల నేపాల్ దిగువసభ అయిన ప్రతినిధుల సభలో ఎవరికీ పూర్తి మెజార్టీ లేదు. తాజాగా ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని కోరుతూ ప్రధాని ఓలీ, విపక్షనేత అయిన నేపాలీ కాంగ్రెస్ అధినేత షేర్ బహదుర్ దేవ్ బా అధ్యక్షురాలికి అభ్యర్థనలు అందజేశారు. కొందరు ఎంపీల పేర్లు ఇరువురి అభ్యర్థనల జాబితాల్లో ఉండటంతో పార్లమెంటు రద్దు నిర్ణయం అనివార్యమైంది. రాజకీయ సంక్షోభం తలెత్తిన తరవాత పార్లమెంటును రద్దు చేయడం ఇది రెండోసారి కావడం గమనార్హం. గత డిసెంబరులో తొలిసారి పార్లమెంటును రద్దు చేశారు. అప్పట్లో ఈ నిర్ణయంపై సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ నిర్ణయం చెల్లదని, ఇది రాజ్యాంగ విరుద్ధం అంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలో సర్వోన్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. దీంతో మళ్లీ ఓలీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అయితే పార్టీలో నెల కొన్న అంతర్గత రాజకీయాల కారణంగా ప్రభుత్వాన్ని నడపలేని పరిస్థితి ఎదురైంది. ఫలితంగా రెండోసారీ పార్లమెంటును రద్దు చేయాల్సి వచ్చింది.
ఏపార్టీకి స్పష్టమైన….?
275 మంది సభ్యులు గల నేపాల్ పార్లమెంటుకు 2017 నవంబరు 26, డిసెంబరు 7 తేదీల్లో ఎన్నికలు జరిగాయి. అప్పట్లో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం లభించలేదు. ఓలీ నాయకత్వంలోని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (యూఎంఎల్) కు 121 సీట్లు వచ్చాయి. పుష్పకమల్ దహాల్ అలియాస్ ప్రచండ నాయకత్వంలోని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్టు)కు53, నేపాలీ కాంగ్రెస్ కు 63 సీట్లు వచ్చాయి. దీంతో ఓలీ, ప్రచండ పార్టీలు విలీనమయ్యాయి. ఈ సందర్భంగా అధికార పంపిణీకి సంబంధించి ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా చెరి సగం కాలం ప్రధాని పదవిని పంచుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు తొలుత ఓలీకి అవకాశం వచ్చింది. ఒప్పందంలో భాగంగా ప్రధాని పదవిని ప్రచండకు బదిలీ చేయడానికి ఓలీ నిరాకరించారు. దీంతో ప్రచండ ప్రభుత్వానికి తన పార్టీ మద్దతు ఉపసంహరించారు. ఫలితంగా రాజకీయ అనిశ్చితి ఏర్పడింది.
మరోవైపు కరోనా….?
విపక్షమైన నేపాలీ కాంగ్రెస్ అధినేత సూర్య బహదుర్ దేవ్ బా ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నించి చివరకు చేతులెత్తేశారు. దేశంలో అత్యంత పురాతన పార్టీ అయిన నేపాలీ కాంగ్రెస్ భారత అనుకూల పార్టీ. ఈ పార్టీ సుదీర్ఘ కాలం దేశాన్ని ఏలింది. వామపక్ష పార్టీలు సహజంగానే చైనాకు అనుకూలంగా, భారత్ కు వ్యతిరేక గళం వినిపించేవి. నేపాల్ వామపక్ష పార్టీల మధ్యరాజీ కుదిర్చేందుకు చైనా చేసిన ప్రయత్నాలు ఫలించ లేదు. రాజకీయ సంక్షోభం నేపథ్యంలో దేశంలో తాండవిస్తున్న కరోనా గురించి పట్టించుకున్న వారే లేరు. గత నెల 23 నాటికి దేశంలో 5,13,241 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 3,91, 348 మంది కోలుకున్నారు. 6,346 మంది మరణించినట్లు గణాంకాలు ఘోషిస్తున్నాయి. దక్షిణాసియాలో నిరుపేద దేశంగా గుర్తింపు పొందిన నేపాల్ నిత్యం సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటోంది. దీనికితోడు కరోనా … గోరు చుట్టు మీద రోకలిపోటులా పరిణమించింది. ఈ నేపథ్యంలో మరో ఆరు నెలల్లో జరగనున్న పార్లమెంటు ఎన్నికలపై అంతటా ఆసక్తి నెలకొంది.
-ఎడిటోరియల్ డెస్క్