సిక్కోలు… చిక్కులు తెచ్చేలా ఉందే ?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నపుడు చిట్టచివరి జిల్లాగా శ్రీకాకుళం ఉండేది. విభజన ఏపీలోనూ దూరంగా విసిరేసినట్లుగా ఉండడమే కాదు, అభివృద్ధిలో అత్యంత వెనకబడిఉంది. ఆర్ధికంగా సామాజికంగా వెనకబడితే [more]

;

Update: 2020-12-26 00:30 GMT

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నపుడు చిట్టచివరి జిల్లాగా శ్రీకాకుళం ఉండేది. విభజన ఏపీలోనూ దూరంగా విసిరేసినట్లుగా ఉండడమే కాదు, అభివృద్ధిలో అత్యంత వెనకబడిఉంది. ఆర్ధికంగా సామాజికంగా వెనకబడితే పడవచ్చు కానీ చైతన్యం విషయంలో మాత్రం ఎపుడూ ముందంజలోనే ఈ జిల్లా ఉంది. 1960 దశకంలో నక్సలైట్ ఉద్యమానికి ఈ జిల్లా చోటు ఇచ్చింది. అనేక ప్రగతిశీల ఉద్యమాలకు పుట్టినిల్లుగానూ ఉంది. ఇక రాజకీయ చైతన్యంలోనూ ఎపుడూ ఈ జిల్లా అగ్రగామిగానే ఉంది. రాజులను తరాజులుగా చేయడడమో సిక్కోలు రూటే సేపరేటు అంటారు అంతా.

ఉరుముతున్న జిల్లా …

రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు వైసీపీ సర్కార్ రెడీ అవుతోంది. దానికి పార్లమెంట్ నియోజకవర్గాలను ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. ఆ విధంగా చూస్తే పది అసెంబ్లీ సీట్లు ఉన్న ఈ జిల్లా మూడు ముక్కలు కాక తప్పదు. దాంతో ఈ జిల్లాలో ఇపుడు ఉద్యమాలు మళ్ళీ మొదలయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలోనే రాజాం, ఎచ్చెర్ల అసెంబ్లీలను ఉంచాలని ఓ వైపు నినదిస్తూంటే, పాలకొండను ప్రత్యేక జిల్లాను చేయాలని మరో ఉద్యమం మొదలైంది. ఇక టెక్కలి. పలాసాలు కేంద్రాలుగా కొత్త జిల్లాలు కావాలని ఆయా ప్రాంతవాసులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో అసలు కొత్త జిల్లాలూ వద్దు, విభజన అంతకంటే వద్దు, సమైక్య శ్రీకాకుళం జిల్లా మా నినాదం అంటూ మరికొందరు ముందుకు వస్తున్నారు. ఇవన్నీ మెల్లగా రాజకీయ రంగు పులుముకుంటే సెగలూ పొగలూ కక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

మీటర్లతో హీటెక్కిస్తారా…?

జగన్ సర్కార్ రైతుల పంపుసెట్లకు మీటర్లను బిగించాలని నిర్ణయించింది. పైలెట్ ప్రాజెక్ట్ గా శ్రీకాకుళం జిల్లానే దానికి గుర్తించింది. ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఆ మీదట ఏపీవ్యాప్తంగా విస్తరించాలనుకుంటోంది. మరి విద్యుత్ మోటార్లకు మీటర్లు కనుక బిగిస్తే చూస్తూ ఊరుకోమని ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు అంటున్నారు. పంపుసెట్ ని ముందు ముట్టుకుని చూడండి, మా తడాఖా ఏంటో చూపిస్తామని హెచ్చరిస్తున్నారు. తమ పొలాల్లోకి విద్యుత్ అధికారులను రానీయవద్దు అని కూడా ఆయన గర్జిస్తున్నారు. ఇదే విషయం మీద ఇప్పటికి జిల్లాలో రెండు మూడు టూర్లేసిన పీసీసీ చీఫ్ సాకే శైలజానాధ్ కూడా జగన్ సర్కార్ మీటర్లు బిగించడం ఆపకపోతే సిక్కోలు నుంచే సమరం మొదలుపెడతాం అంటున్నారు.

యుద్ధం తప్పదా…?

ఇక శ్రీకాకుళం జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం ధర్మాన క్రిష్ణదాస్ అయితే ఉచిత విద్యుత్ మీద తాము ఒక్క అడుగు కూడా వెనక్కు వేయ‌లేదని అంటున్నారు. పంపుసెట్లకు మీటర్లు బిగించినా ఒక్క రూపాయి కూడా రైతుల నుంచి వసూలు చేయమని చెబుతున్నారు. అలా ఒక్క పైసా వసూలు చేసినా తమ పదవికి రాజీనామా చేస్తానని కూడా గట్టి సవాలే విసురుతున్నారు. మొత్తానికి చూస్తే అటు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ ఇక్కడే ఉన్నారు, ఇటు ఉప ముఖ్యమంత్రి, జగన్ కి సన్నిహితుడు అయిన క్రిష్ణ దాస్ కూడా మరో వైపు ఉన్నారు. ఈ ఇద్దరు నేతల మధ్య మాటల యుధ్ధం కాస్తా రేపటి రోజున మరి కాస్తా ముందుకెళ్తే సిక్కోలు చిక్కులు తెచ్చేలాగే ఉంది అంటున్నారు. పలు రకాలైన సమస్యలన్నీ కూడా కలసి ఉద్యమిస్తే శ్రీకాకుళం జిల్లావే ఏపీలో హీట్ రేపుతుంది అని కూడా అంటున్నారు.

Tags:    

Similar News