విశాఖ నుంచి వైసీపీలో ఆ అదృష్టవంతులెవరో ?
వైసీపీ అంటే ఇపుడు బూరెల గంప అని చెప్పాలి. గంప నిండా బూరెలు ఉన్నాయి. అవి అయిపోతే మళ్లీ మళ్లీ కూడా వస్తాయి. ఏకపక్షంగా జనాలు 2019 [more]
;
వైసీపీ అంటే ఇపుడు బూరెల గంప అని చెప్పాలి. గంప నిండా బూరెలు ఉన్నాయి. అవి అయిపోతే మళ్లీ మళ్లీ కూడా వస్తాయి. ఏకపక్షంగా జనాలు 2019 [more]
వైసీపీ అంటే ఇపుడు బూరెల గంప అని చెప్పాలి. గంప నిండా బూరెలు ఉన్నాయి. అవి అయిపోతే మళ్లీ మళ్లీ కూడా వస్తాయి. ఏకపక్షంగా జనాలు 2019 ఎన్నికల్లో ఓట్లేసి గుద్దిన ఫలితం అది. ఎక్కడా కనుచూపు మేరలో ఒక్క ఎమ్మెల్సీని కూడా గెలిపించుకునే అవకాశం లేని దైన్యం టీడీపీకి ఉంది. మరో వైపు వచ్చిన వాటిని వచ్చినట్లే లాగేసుకునే వాటం వైసీపీది. ఇదిలా ఉంటే తాజాగా ఖాళీ అయిన ఆరు ఎమ్మెల్సీల కోసం వైసీపీలో ఆశావహులు పెద్ద ఎత్తున ఉన్నారు. అయితే జగన్ ఎవరి పేరు చెబితే వారినే పదవులు వరిస్తాయి. కిరీటం వారికే దక్కుతుంది.
ఆయనకు చాన్స్ ఉందా….?
జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఇప్పటిదాకా ఎంపిక చేసిన నామినేట్ పదవుల్లో ఉత్తరాంధ్రాకు పెద్దగా వాటా దక్కలేదు అన్న అసంతృప్తి అయితే నేతల్లో చాలానే ఉంది. దాంతో వారంతా ఇపుడు ఖాళీ అయిన ఆ అరడజన్ ఎమ్మెల్సీ సీట్ల వైపు ఆశగా చూస్తున్నారు. విశాఖ నుంచి చూస్తే మైనారిటీ కోటాలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ ఎ రహమాన్ చాలాకాలంగా కాచుకుని ఉన్నారు. విశాఖ సౌత్ నుంచి ఆయన ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తూ పార్టీలో చేరారు. అయితే అక్కడ ఏకంగా సిటింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీలో చేరడంతో రహమాన్ కి 2024 ఎన్నికల్లో కూడా ఆ టికెట్ దక్కదు అని చెప్పాలి. దాంతో జగన్ వయా మీడియాగా ఆయన్ని ఎమ్మెల్సీ చేసి విశాఖ సౌత్ పాలిటిక్స్ ని బ్యాలన్స్ చేస్తారు అని అంటున్నారు.
ఆ సామాజికవర్గం నుంచి ….
మరో వైపు చూసుకుంటే విశాఖలో గవర సామాజిక వర్గం తమకు వైసీపీలో పెద్దగా రాజకీయ ప్రాధాన్యత లేదని బాధపడుతోంది. వారిని బుజ్జగించేందుకు మాజీ మంత్రి సీనియర్ నేత దాడి వీరభద్రరావుకు చాన్స్ ఇస్తారా అన్న మాట కూడా ఉంది. ఆయనకు కాకపోతే కుమారుడు, గత ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు గెలవడానికి కృషి చేసిన రత్నాకర్ కి ఇస్తారా అన్న చర్చ కూడా ఉంది. అలాగే విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి కూడా ఆశావహులు ఈసారి ఎక్కువగానే ఉన్నారు. వారంతా కూడా తమకు ఈసారి చాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. వీరిలో జగన్ మెచ్చిన వారు, ఆయన స్వయంగా ప్రోత్సహిస్తున్న వారు కూడా ఉన్నారు.
ఆలీకే టికెట్…
ఇక ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో సినీ రంగానికి ఒక టికెట్ ఇవ్వాలని జగన్ భావిస్తున్నారని టాక్. ఆ టికెట్ కచ్చితంగా హాస్యనటుడు ఆలీకి ఇస్తారని అంటున్నారు. ఆలీ ఆ మధ్య జగన్ ని స్వయంగా కలసి ఈ మేరకు హామీ పొందారని అంటున్నారు. ఆలీకి ఇస్తే తూర్పు గోదావరి జిల్లా కోటాలో ఇచ్చినట్లుగా ఉంటుంది. అపుడు ఉత్తరాంధ్రా జిల్లాల నుంచి ఎవరికీ చాన్స్ ఉండకపోవచ్చు అని కూడా అంటున్నారు. మొత్తానికి జగన్ మదిలో ఎవరి పేరు ఉందో తెలియదు కానీ ఆశావహులు మాత్రం పెద్ద ఎత్తున ఈ మూడు జిల్లాలలో ఉన్నారని తెలుస్తోంది.