అమరావతి ఉద్యమం వెనక డొల్లతనం..?
సీమాంధ్ర ప్రజలు వాస్తవానికి ఉద్యమాలకు ఎపుడూ కడు దూరం. అది విభజన సమయంలోనే బయటపడిపోయింది. అటువైపు తెలంగాణాలో పెద్ద ఎత్తున పోరాటాలు జరుగుతూంటే ఏపీ మౌనంగానే అన్నీ [more]
సీమాంధ్ర ప్రజలు వాస్తవానికి ఉద్యమాలకు ఎపుడూ కడు దూరం. అది విభజన సమయంలోనే బయటపడిపోయింది. అటువైపు తెలంగాణాలో పెద్ద ఎత్తున పోరాటాలు జరుగుతూంటే ఏపీ మౌనంగానే అన్నీ [more]
సీమాంధ్ర ప్రజలు వాస్తవానికి ఉద్యమాలకు ఎపుడూ కడు దూరం. అది విభజన సమయంలోనే బయటపడిపోయింది. అటువైపు తెలంగాణాలో పెద్ద ఎత్తున పోరాటాలు జరుగుతూంటే ఏపీ మౌనంగానే అన్నీ చూసేది. ఇక ఎటూ విభజన జరిగింది. దాంతో ప్రత్యేక హోదా ఇస్తామని నాటి యూపీఏ, నేటి బీజేపీ సర్కార్ రెండూ హామీలు ఇచ్చాయి. కానీ ఆచరణలో వాటిని తుంగలో తొక్కారు. కానీ హోదా కోసం ఉద్యమించాల్సిన ఆంధ్రులు మళ్ళీ మౌనాన్నే ఆశ్రయించారు. అయితే తమ కోపాన్ని, బాధను వారు ఎన్నికల ఫలితాల రూపంలో తెలియచేసారు.
స్పందన ఏదీ ..?
ఇపుడు అమరావతిలో ఏకైక రాజధాని కావాలని కోరుతూ ఉద్యమం జరుగుతోంది. అయితే దీన్ని ఉద్యమం అనాలా లేక కొంతమంది ఆవేదనగా చూడాలా అన్నది ఇప్పటికీ తెలుగు మీడియాకు అర్ధం కావడంలేదు. ఎందుకంటే వేలాది ఎకరాలు భూ సేకరణ జరిగినపుడు ఇక్కడ మూడవ వంతు రాజధానిని మాత్రమే ఉంచుతామని ప్రభుత్వం చెప్పినపుడు ఉవ్వెత్తున నిరసన జ్వాలలు ఎగిసిపడాలి. కానీ అలా ఏమీ జరగలేదు. తొలి నుంచి కొన్ని పరిమిత గ్రామాలు, అక్కడ జనాలే ముందుండి ఉద్యమం అంటున్నారు. దాన్ని మెల్లగా మూడు వందల రోజులకు తెచ్చారు. మరో రెండు నెలల్లో ఏడాది నిరసనలూ జరుగుతాయి. కానీ మొత్తం మీద చూస్తే ఆ రెండు జిల్లాలతో సహా ఏపీలోని ఇతర జిల్లాల జనాల్లో అమరావతి రాజధాని మీద సోయి కానీ, ధ్యాస కానీ ఉన్నట్లుగా కనిపించడంలేదు. అసలు ఎక్కడా స్పందన లేని పరిస్థితి.
అదేనా కారణం….
సమైక్యాంధ్రా ఉద్యమం, ప్రత్యేక హోదా పోరాటంతో అమరావతి రాజధానిని అసలు పోల్చకూడదు. ఆ రెండూ కేంద్ర పాలకులు చేసిన ఘాతుకాలు. అయితే ఇది మన తెలుగు వారి సమస్య. రాజధాని ఒకటి ఉండాలా, మూడు ఉండాలా అన్నది కూడా జనాలు చర్చించుకోవచ్చు. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే జనాలు ప్రాంతాలుగా విడిపోయారు. పైగా అభివృద్ధి అంతా ఓకే చోట కుప్పగా పోసి పెడితే జరిగే వినాశనం ఏంటో హైదరాబాద్ మోడల్ ని చూసి జనం తెలుసుకున్నారు. రేపటి రోజున బాగా అభివృద్ధి చెందినమీదట అమరావతి ప్రాంతాలు కూడా తమను పక్కన పెడితే గతేంటి అన్న బాధ ఉత్తరాంధ్రా, రాయలసీమ జిల్లాల్లో ఉంది. పైగా వారికి ఆయా ప్రాంతాల్లో సెంటిమెంట్లు ఉన్నాయి. అందుకే అమరావతి అంటూ ఎన్ని ఏళ్ళు పోరాడినా కూడా మద్దతు జనం నుంచి దొరకడంలేదు అన్న విశ్లేషణలు ఉన్నాయి.
బయటపడ్డారా….?
ఇక అమరావతి ఉద్యమం అంటూ మొదట్లో మాట్లాడిన వారు ఏపీ ప్రగతి, మన రాజధాని అని చెప్పుకొచ్చేవారు. మరి రోజులు గడచిన తరువాత కూడా ఫలితం రాలేదన్న నిరాశ వల్లనో, లేక నిర్వేదం వల్లనో కాదు తెలియదు కానీ అసలు విషయాలు బయటపెట్టేసుకుంటున్నారు. అమరావతి నుంచి సచివాలయాన్ని, హై కోర్టుని తరలిస్తే తమ భూముల రేట్లు పడిపోతాయని ఇపుడు వారు గట్టిగా మాట్లాడుతున్నారు. దాంతో ఉద్యమం లోని డొల్లతనం ఇలా బయటపడినట్లు అయింది. దీనివల్ల మిగిలిన ప్రాంతాలు మరింతగా ఏకైక రాజధాని డిమాండుకు దూరం జరిగే ప్రమాదం కూడా ఉంది. మేము కట్టే పన్నులు, మా ఫ్లోటింగ్ తో అక్కడ అభివృద్ధి చెందితే మీరు బాగుపడతారా. మేము మాత్రం ఇలాగే ఉండిపోవాలా అన్న ఆలోచనలు కూడా కలుగుతాయి. దాంతో ఎప్పటికీ అమరావతి ఉద్యమం ముందుకు విస్తరించే అవకాశాలే ఉండవు. ఏది ఏమైనా పోరాటం జరుగుతున్న వేళ అసలు విషయం చెప్పి కళ్ళు తెరిపించారని కూడా అంటున్నారు.