ము‘గ్గురి’ తప్పిన ఆయుధాలు..?

రాష్ట్రంలో ఆ ముగ్గురు సృష్టిస్తున్న ప్రకంపనలు మామూలుగా లేవు. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండటమనేది ఏ రంగంలోని వారికి అయినా రాణింపు నిస్తుంది. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన [more]

;

Update: 2021-04-23 15:30 GMT

రాష్ట్రంలో ఆ ముగ్గురు సృష్టిస్తున్న ప్రకంపనలు మామూలుగా లేవు. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండటమనేది ఏ రంగంలోని వారికి అయినా రాణింపు నిస్తుంది. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన వారు అడ్డగోలుగా ప్రవరించడం హాస్యాప్పదంగా మారుతుంది. హీరోలుగా వెలుగొందాల్సిన వాళ్లు చివరికి కమెడియన్లుగా కనిపిస్తారు . ఎవరి మెప్పుకోసం ప్రయత్నిస్తున్నారో వారు తాత్కాలికంగా ఆనందిస్తారు. కానీ చివరికి దూరం పెడతారు. తమకు చెడ్డపేరు వస్తుందనే భయంతో తమకేం సంబందం లేదంటూ డిస్ ఓన్ చేసుకుంటారు. చివరికి అడ్డగోలు నేతలు రెంటికీ చెడ్డ రేవడిగా మిగిలిపోతారు. వినోదం మాత్రమే పంచుతారు. వారి పట్ల ప్రజల్లో క్రమేపీ గౌరవభావం సన్నగిల్లిపోతుంది. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి, తిరుగుబాటు నాయకుడు రఘురామకృష్ణం రాజు, సినీ సంచలనం రామ్ గోపాల్ వర్మలు తమ విచ్చలవిడి కామెంట్లు, ట్వీట్లతో రచ్చ రంబోలా చేసేస్తున్నారు. సమయం, సందర్భం లేని వారి తీరు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు నవ్వులు పూయిస్తోంది. ఎంతో పేరు ప్రఖ్యాతులతో మెలగాల్సిన వీరు తమ అపరిపక్వతను తామే ప్రదర్శించుకుంటున్నారు. ప్రత్యర్తులపై ప్రయోగించామనుకుంటున్న అస్త్రాలు తమ వైపునకే ఎదురుతిరుగుతున్నాయి.

అగ్రనేత అయినా ఒంటరి…

ఒకానొకప్పుడు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో విజయసాయి రెడ్డి మాటకు తిరుగులేదు. జగన్ మోహన్ రెడ్డికి ఆయన ఎంతచెబితే అంత అన్నంతగా పలుకుబడి ఉండేది. జిల్లా ఇన్ ఛార్జుల నియామకం మొదలు పార్టీ వ్యవహారాల సమన్వయం వరకూ అంతా తానై చూసుకునేవారు. వైసీపీలో అధినేత తర్వాత తిరుగులేని నంబర్ టు స్థానం ఆయనదే. పార్టీ తరఫున తొలిసారిగా రాజ్యసభలో అడుగుపెట్టింది కూడా ఆయనే. ఎన్నికల తర్వాత వైసీపీ విజయం సాధించి గద్దె నెక్కే వరకూ విజయసాయి రెడ్డి హవా కొనసాగింది. పార్టీ తరఫున సామాజిక మాధ్యమాల సమన్వయం ఆయనే చూసేవారు. వ్యూహకర్త ప్రశాంతకిశోర్, అధినాయకుడు జగన్ మోహన్ రెడ్డిలకు తలలో నాలుకలా వ్యవహరించేవారు. విశాఖ ను రాజధాని చేయాలనే ఆలోచన సైతం విజయసాయిరెడ్డిదే అని పార్టీ వర్గాలు చెబుతాయి. అంతటి స్థానమున్న నాయకుడు ఎన్నికల తర్వాత జగన్ వద్ద క్రమేపీ పలుకుబడి కోల్పోతూ వచ్చారు. ఉత్తరా:ధ్రకు మాత్రమే పరిమితం చేసి బాధ్యతలను వికేంద్రీకరించారు. తాజాగా ఒకవైపు అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. మరోవైపు విజయసాయిరెడ్డి తనదైన శైలిలో సెటైర్లు వేశారు. రాజకీయ విమర్శలకు సమయం , సందర్భం ఉండాలి. జగన్ మోహన్ రెడ్డి బీజేపీ నాయకులతో సత్సంబంధాలకు ప్రయత్నిస్తున్నారు. విజయసాయి విరుచుకుపడుతున్నారు. ఇవన్నీ ఆయన వ్యూహాత్మకంగా చేస్తున్నారా? లేదా ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా? అన్నది పక్కనపెడితే విజయసాయి వాదనలకు పార్టీలో ఇతర నేతలు ఎవరూ మద్దతుగా నిలవడం లేదు. పార్టీకి ఆయన వ్యాఖ్యలు చెడ్డపేరు తెస్తున్నాయనే అంతర్గత విమర్శ మొదలైంది. పార్లమెంటరీ నేతగా పార్టీలోని ఎంపీలను కలుపుకుని వెళ్లడం లేదనే వాదననూ కొందరు ముందుకు తెస్తున్నారు. ఇదంతా జగన్ వద్ద విజయసాయి పలుకుబడిని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి.

రెంటికీ చెడుతున్న రేవడి…

ఏ రోటికాడ ఆ పాట పాడటంలో అందె వేసిన చెయ్యి ఎంపీ రఘు రామకృష్ణం రాజుది. వైసీపీ తరఫున టిక్కెట్ తెచ్చుకుని తన చిరకాల కోరిక అయిన ఎంపీ కాగలిగారు. పార్టీ విధేయతను పక్కన పెట్టి అధినాయకత్వం ప్రతిష్ఠను దెబ్బతీసే అజెండాను చేపట్టారు. నిజానికి రఘురామకృష్ణం రాజుకు పార్టీ నాయకత్వం అన్యాయమేమీ చేయలేదు. బీజేపీ అగ్రనాయకత్వానికి చేరువ అవుతూ తన సొంత అజెండాను అమల్లో పెట్టాలనుకున్నారాయన. ఫలితంగా ముందుగా విజయసాయిరెడ్డిపై విమర్శలతో మొదలుపెట్టారు. బీజేపీ నుంచి పరోక్షంగా ప్రోత్సాహం లభించింది. తర్వాత క్రమేపీ ముఖ్యమంత్రినే లక్ష్యంగా చేసుకుంటూ ఆరోపణలు మొదలుపెట్టారు. ముఖ్యమంత్రి బెయిల్ రద్దు చేయాలని కేసులు వేస్తూ న్యాయపోరాటానికి తెర తీశారు. కాగల కార్యం గంధర్వులే తీరుస్తారన్నట్లుగా బీజేపీ, టీడీపీ ఉత్సాహంగా ఆయన చర్యలను గమనిస్తున్నాయి. వైసీపీతో తీవ్రస్తాయి విభేదాలతో పొలిటికల్ కెరియర్ ను మొత్తాన్ని నాశనం చేసుకున్నారని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం సాయుధ బలగాలు తోడు లేకుండా నియోజకవర్గంలో అడుగుపెట్టలేని పరిస్థితి. ప్రజలలో సొంతంగా ఏమాత్రం పలుకుబడి లేకుండా పార్టీ ప్రతిష్ఠపైనే నెగ్గిన రఘురామకృష్ణం రాజు అధినాయకత్వాన్నే సవాల్ చేయడమే వింత. బీజేపీ తనను అక్కున చేర్చుకుంటుందని వేసుకున్న అంచనా తప్పుతోంది. రఘురామకృష్ణం రాజు చర్యలతొ తమకెటువంటి సంబంధం లేదని కమల నాథులు ఇటీవల స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో రెంటికీ చెడ్డ రేవడిగా మిగిలిపోయే చాన్సులు పెరుగుతున్నాయి. ఒకవేళ న్యాయపరమైన కేసుల్లో జగన్ పై ఆధిక్యం సాధించినా టీడీపీ వంటి పార్టీలకు లాభిస్తుందే తప్ప, రఘురామకు వ్యక్తిగతంగా ఒరిగేదేమీ ఉండదు.

రాంగో… గిమిక్స్…

ఒకనాడు రాంగోపాల్ వర్మ పేరు చెబితే సినిమా పరిశ్రమ టార్చ్ బేరర్ గా భావించేది. గడచిన రెండు దశాబ్దాలలో దారితప్పిన ఆలోచనలతో సృజనాత్మకతను పక్కదారి పట్టించేశారాయన. తన సినిమా అంటే విశృంఖల శృంగారం, హింస, మాఫియా, దెయ్యాలు అన్నట్లుగా వింత నిర్వచనాన్ని ఖాయం చేసుకున్నారు. ఈ సిని మేదావిని హిందీ పరిశ్రమ పక్కన పెట్టేసింది. దాంతో తనకు పురుడు పోసిన టాలీవుడ్ నే నమ్ముకుంటూ విచ్చలవిడి సినిమాలు తీసి పారేస్తున్నారు. వింత ప్రచారాలు, వివాదాలతో తన చిల్లర సినిమాలకు సొమ్ము చేసుకుంటున్నారు. తనకు సంబంధం లేని రాజకీయ రంగంపైన కామెంట్లు చేస్తూ ప్రచారం తెచ్చుకుంటుంటారు. రాంగోపాల్ వర్మ తెలుగుదేశాన్ని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేస్లుంటారు. అటు టీడీపీ, ఇటు వైసీపీ రెండు పార్టీలు తన వ్యాఖ్యలను పట్టించుకోవాలనేది ఆయన ఉద్దేశం. తాజాగా లోకేశ్ టీడీపీ కి వైరస్ అంటూ కరోనా తో పోలిక తేవడం పరిధులు దాటిన విమర్శగానే చెప్పాలి. లోకేశ్ సమర్థత, వారసత్వం అనేది ఆ పార్టీ తేల్చుకోవాల్సిన వ్యవహారం. తాను రాజకీయ ప్రత్యర్థిగా ఉంటే విమర్శ చేసిన ఫర్వాలేదు. కానీ తనకు రాజకీయాలంటేనే పడదని చెబుతారు వర్మ. మరి బలహీనమైన స్థితిలో ఉన్న టీడీపీపై అస్త్రాలు ఎక్కుపెట్టడంలోనే తన బలహీనతను చాటుకుంటున్నారు. రాంగోపాల్ వర్మ వ్యాఖ్యలకు మంచిదైనా, చెడ్డదైనా ప్రజల్లో క్రేజ్ ఉంది. ప్రభుత్వం చేసే పనుల్లో మంచి చెడ్డలను ఎత్తి చూపితే ఉపయోగం ఉంటుంది. అధికారంలోకి వస్తుందో రాదో తెలియని టీడీపీపై బ్రహ్మాస్త్రం ప్రయోగించడం వృథా శ్రమ. చచ్చిన పాముని మళ్లీ కొట్టడం వల్ల చేతులు నొప్పి పుడతాయే తప్ప సాధించేదేమీ ఉండదు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News