రింగ్ తిప్పుతున్న తోట

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో అధికారపార్టీ లో ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరింది. అది ఏ స్థాయిలో అంటే చెప్పులు విసురుకునే రేంజ్ కి పోయింది. మరీ [more]

Update: 2020-02-21 06:30 GMT

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో అధికారపార్టీ లో ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరింది. అది ఏ స్థాయిలో అంటే చెప్పులు విసురుకునే రేంజ్ కి పోయింది. మరీ ముఖ్యంగా వైసిపి అగ్రనేత టిటిడి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి సమక్షంలోనే చెప్పుల దాడులు సాగడం ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. రామచంద్రపురం ఎమ్యెల్యే చెల్లుబోయిన వేణుగోపాల్, తోటత్రిమూర్తుల కు గత కొంతకాలంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. వారి నడుమ ముదిరిన వివాదం చెప్పులదాకా పోవడంతో వైసిపి కి షాక్ గా పరిణమించింది.

తానే ఎమ్మెల్యేగా…..

రామచంద్రపురం మాజీ ఎమ్యెల్యే తోట త్రిమూర్తుల హవా అధికార పార్టీ లో చేరిన నాటినుంచి జోరుగా సాగుతుంది. అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ గా వైసిపి అధిష్టానం తోట త్రిమూర్తులుకు బాధ్యతలు అప్పగించింది. దాంతో ఆయన హల్చల్ మొదలైంది. రామచంద్రపురం లో మాజీ ఎమ్యెల్యేగా తోట త్రిమూర్తులుకు నేరుగా ప్రజలతో ఉన్న సంబంధాల నేపథ్యంలో ఆయన సిట్టింగ్ ఎమ్యెల్యేను సైతం కాదని తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ప్రోటోకాల్ విషయం లోనూ తోట త్రిమూర్తులు ఆధిపత్యం కొనసాగుతుంది. ఈ వ్యవహారాలు సిట్టింగ్ ఎమ్యెల్యే వేణు వర్గానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దాంతో సమయం కోసం వేచి చూస్తున్న వేణు అనుచరవర్గం వైవి సుబ్బారెడ్డి ఎదురుగానే తోట త్రిమూర్తులుకు పరాభవం చేయాలని దాడికి పాల్పడింది.

వర్గ పోరు సరిదిద్దుతారా …?

కుల రాజకీయాలకు రామచంద్రపురం పెట్టింది పేరు. ఇక్కడ రెండు సామాజికవర్గాల ఆధిపత్య పోరు రాజకీయాలను శాసిస్తుంది. గతంలో రెండు పార్టీల నడుమ వుండే ఈ కుల పోరాటాలు ఇప్పుడు ఏకంగా అధికారపార్టీలోనే తుఫాన్ గా మారింది. విడవమంటే పాముకు, కరవమంటే కప్పకు కోపం అన్నట్లుగా రామచంద్రపురం రాజకీయాలు వైసిపి అధిష్టానానికి కొత్త తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయి. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సొంత పార్టీలోనే లుకలుకలు ఫ్యాన్ పార్టీ కి దడపుట్టిస్తున్నాయి. ఒకప్పుడు ప్రస్తుత మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ – తోటత్రిమూర్తుల నడుమ ఉప్పు నిప్పులా రాజకీయం సాగేది. అయితే బోస్ ను మండపేట నియోజకవర్గానికి మార్చడంతో ఇప్పుడు ఆయన స్థానంలో ఎమ్యెల్యే అయిన వేణు కి ఇప్పుడు తోట త్రిమూర్తులు చేస్తున్న హడావిడి తో ఎవరు ఎమ్యెల్యేనో అర్ధం కావడం లేదు. దాంతో నేరుగా ఆయనపై తన అనుచరులతో దాడులకు తెగబడేలా ప్రోత్సహం ఇస్తున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో రామచంద్రపురం పంచాయితీకి అధిష్టానం శుభం కార్డు వేయకపోతే ఇది మరింత ముదిరి రోడ్డున పడటం ఖాయం అంటున్నారు క్యాడర్.

Tags:    

Similar News