తిప్పల వన్ టైమ్ ఎమ్మెల్యేనా…?

ఆయన సినీ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఓడించి మరీ గాజువాక సీటు పట్టేశారు. రీల్ స్టార్ రియల్ స్టార్ అని జగన్ చెప్పినపుడు గాజువాక జనం [more]

Update: 2021-03-13 13:30 GMT

ఆయన సినీ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఓడించి మరీ గాజువాక సీటు పట్టేశారు. రీల్ స్టార్ రియల్ స్టార్ అని జగన్ చెప్పినపుడు గాజువాక జనం కూడా పాజిటివ్ గా తీసుకుని వైసీపీ అభ్యర్ధి తిప్పల నాగిరెడ్డిని గెలిపించారు. అయితే రెండేళ్ళకు దగ్గరపడుతున్నా తిప్పల అటు పార్టీని, ఇటు ప్రజలను పట్టించుకోకుండా సొంత రాజకీయాలు చేసుకుంటున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. తాను తన కొడుకు, తన వాళ్ళు అని గిరిగీసుకుని ఎమ్మెల్యే రాజకీయం చేయడంతో ముందుగా సొంత పార్టీలోనే అసంతృప్తి వెల్లువలా మారుతోంది అంటున్నారు.

కొడుకు కోసం …

అందరు రాజకీయ నాయకుల మాదిరిగానే తిప్పల నాగిరెడ్డి కూడా పుత్ర ప్రేమకు అతీతులు కారు. తన కొడుకు వంశీని కార్పోరేటర్ గా నిలబెట్టారు. వీలు అయితే ఆయన్ని డిప్యూటీ మేయర్ చేసి అయినా చక్రం తిప్పాలనుకుంటున్నారు. అది కుదరకపోతే రాజకీయంగా తన వారసుడిగా గాజువాక నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించాలనుకుంటున్నారుట. మొత్తానికి తిప్పల రాజకీయం అంతా కొడుకు, కోడలు, బంధువుల చుట్టూనే సాగుతోంది. ఈ పరిణామాలతో వైసీపీ నేతలు మండిపోతున్నారు. అసలే గాజువాకలో స్టీల్ ప్లాంట్ ఉంది. ఉక్కు ప్రైవేటీకరణ మీద జనాల్లో ఆందోళన ఉంది. అది రివర్స్ కాకుండా ఉండాలంటే పార్టీకి అండగా ఉంటూ తగిన వ్యూహాలు రచించాలి. కానీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాత్రం ఇవేమీ అసలు పట్టించుకోవడం లేదు అంటున్నారు.

జనసేనకు సీన్ ఉందా..?

ఇక పవన్ గాజువాక నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత ఆయన ఒక్కసారి మాత్రమే గాజువాకకు వచ్చారు. రెండేళ్ళ వ్యవధిలో ఆయన విశాఖకు వచ్చినది కూడా బహు తక్కువ. ఇవన్నీ ఇలా ఉంటే గాజువాకలో పవన్ పోటీ చేయడం వల్ల కొంత పునాది జనసేనకు ఏర్పడి ఉంటుంది కదా కార్పోరేషన్ ఎన్నికల్లో ప్రభావం ఏమైనా ఉంటుందా అన్న చర్చ అయితే వస్తోంది. పైగా కాపులు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో జనసేన ఉనికి బలంగా చాటుకుంటుందా అన్న మాట కూడా ఉంది. అయితే బీజేపీతో దోస్తీయే ఇపుడు జనసేనకు కొంత ఇబ్బందిగా మారిందని అంటున్నారు. ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేయడానికి కేంద్రం సన్నాహాలు చేస్తోంది. దాంతో మిత్రపక్షంగా పవన్ కనీసంగా మాట్లాడకపోవడాన్ని అంతా తప్పుపడుతున్నారు.

మంచి ఛాన్స్….

ఇక పవన్ పోటీ చేసి ఓడిపోయాక గాజువాకను వదిలేశారు. మరో వైపు అక్కడ టీడీపీ కూడా తగ్గిపోతోంది. ఈ సమయంలో కనుక పవన్ స్టీల్ కార్మికులకు అండగా ఉంటే పెద్ద ఎత్తున వారి మద్దతు దక్కుతుందన్న్న విశ్లేషణలు ఉన్నాయి. పవన్ సామాజికవర్గం సైతం ఈసారి జనసేన వైపు కొంత మొగ్గు చూపించే అవకాశం ఉంది. ఎమ్మెల్యేగా తిప్పల నాగిరెడ్డి వైఫల్యాలు ఎటూ ప్లస్ అవుతాయి. అయితే పవన్ బీజేపీ బంధం, గాజువాక వైపు ఆయన కన్నెతి చూడకపోవడం వంటి వాటి వల్లనే క్యాడర్ లో నిరుత్సాహం ఉందని అంటున్నారు. చూడాలి మరి మునిసిపల్ పోరులో వైసీపీ కనుక వెనకబడిపోతే తిప్పలకు తిప్పలు మొదలైనట్లే. జనసేనకు బేస్ దొరికేసినట్లే.

Tags:    

Similar News